11, ఆగస్టు 2021, బుధవారం

స్మృతి లో

 ఎప్పుడూ ఓ సందేహం ...అయితే ఎవర్నీ అడిగింది లేదు. అడిగితే బహుశా తలా ఓ రకంగా చెప్పవచ్చును లేదా కొంతమంది నాలాగే ఆలోచిస్తూండవచ్చు.

మనం ఎన్నో రచనలు చదువుతూండవచ్చు.కాని చాలావాటి గురించి మర్చిపోతాం,కొన్ని అసలే గుర్తుకు రావు.


మరికొన్ని మాత్రం ఎన్ని ఏళ్ళయినా స్మృతి లో మెదులుతూనే ఉంటాయి.అవకాశం వచ్చినప్పుడల్లా మనసు లోతుల్లోనుంచి పైకి వచ్చి ఆనంద డోలికల్లో ఊగిస్తూనేఉంటాయి.


అసలు ఒక రచన అది కథ గాని నవల గాని ఎందుకు ఏ లక్షణాల వల్ల ఒక చదువరి కి ప్రియమైనది గా మారుతుంది..?


రచయిత ఉపయోగించిన భావ సమ్మోహనం వల్లనా...భాష వల్లనా...తనని ఆయా పాత్రల్లో లీలగా అయినా పోల్చుకోవడం వల్లనా...ఆ రచన నడిచే నడక లోని విన్యాసం వల్లనా..? 

అని ఆలోచిస్తే పైవన్నీ కూడా కారణాలే అనిపించింది.వీటన్నిటితో బాటు రచన చేసిన వారి యొక్క సంస్కారం కూడా అత్యంత ప్రధానమైనది. అది రచన లోని మొదటి పదం నుంచి చివరి పదం వరకు పరుచుకొని ఉంటుంది.దాన్ని విడమరిచి చెప్పలేకపోవచ్చు,కాని ఒక చదువరి దాన్ని తనకి తెలియకుండానే ఆస్వాదిస్తాడు.సంస్కారం అంటే...ఇక్కడ నా అర్ధం రచయిత ప్రపంచం నుంచి అనేక దారుల్లో పొందిన జ్ఞానాన్ని తనదైన ఆలోచనా వైఖరుల తో కలగలిపి తన రచన ద్వారా ప్రవహింపజేయడం..!


నేను ఇప్పటికివరకు చదివిన అనుభవం లో నుంచి చెప్పాలంటే మొదటి ఆరు,ఏడు వాక్యాలు చదవగానే,వెంటనే ఆ తర్వాత పేజీ వరకూ అలవోకగా కొన్ని చదివిస్తాయి.ఆ తరువాత ఆటోమేటిక్ గా చదువుకుంటూ పోతూనే ఉంటాము.దాన్నే ఇంకో మాటలో రీడబిలిటీ అంటాము.సమకాలీనులు మాత్రమే గాక పాతవాళ్ళు రాసినవి కూడా నాకు ఈ లిస్ట్ లో ఉన్నాయి.జాక్ లండన్ రాసిన వైల్డ్ ఫేంగ్ అండ్ కాల్ ఆఫ్ ద వైల్డ్,మేరియో ప్యూజో రాసిన సిసిలియన్,ఎర్నెస్ట్ హెమింగ్వెయ్ రాసిన ఏ ఫేర్ వెల్ టు ద ఆర్ంస్,ఇంచుమించు అన్నీ చెకోవ్ కథలు అలాగే జాన్ బుచానన్ (ఒకప్పటి కెనడా ప్రధాని కూడా) రాసిన కథలు ఇలా ఓ జాబితా చాలా ఉంది.


అలాగే అనువాదాల్లో కూడా పెద్ద లిస్ట్ ఉంది.చింగీజ్ ఐత్మతోవ్ రచనలు,టాల్ స్టాయ్,గోర్కీ,దోస్తోవిస్కీ ఇలా ఓ లిస్ట్ ఉంది.మళ్ళీ వీళ్ళందరి రచనలు అన్నీఒకేరకమైన రీడబిలిటీ ని కలిగి ఉండవు.ఒక్క చింగీజ్ ఐత్మతోవ్ మటుకు మినహాయింపు. కొన్ని రచనలకి ఎందుకనో గాని విపరీతమైన ప్రచారం వస్తుంది గాని తీరా చదివితే పరమ చిరాకు లేస్తుంది.అలాంటి వాటిల్లో అయాన్ ర్యాండ్,గాబ్రియేల్ గార్షియా మార్క్వెజ్ రచనలూ ఉన్నాయి.ఒక్కోసారి పెద్దగా ప్రాచుర్యం పొందని రచనలు చాలా బాగా అనిపిస్తాయి.అలాంటి వాటిల్లో జేన్స్ ఆస్టిన్ యొక్క మేన్స్ ఫీల్డ్ పార్క్ ఇంకా హెక్టార్ హగ్ మన్రో(సాకి అనేది కలం పేరు) యొక్క కథలు ఉన్నాయి.హెరాల్డ్ రాబిన్స్ ని మరీ బూతు రచయిత గా అనుకుంటారు గాని ఆయన రాసిన ద కార్పెట్ బ్యాగర్స్ (లాటిన్ అమెరికా రాజకీయ,సామాజిక నేపథ్యం లో) గుర్తు వచ్చే నవలల జాబితా లో ఉంటుంది.


   

 

వీథికుక్క-1

 ఒకరోజున, అది ఏ రోజో సరిగా గుర్తులేదు గానీ...రమారమి ఆరు నెలల క్రితం మా బయట గోడ ని ఆనుకుని ఓ బక్క కుక్క పడుకుని ఉంది. వాన చినుకులు పడుతున్నాయ...