25, అక్టోబర్ 2023, బుధవారం

వీథికుక్క-1

 ఒకరోజున, అది ఏ రోజో సరిగా గుర్తులేదు గానీ...రమారమి ఆరు నెలల క్రితం మా బయట గోడ ని ఆనుకుని ఓ బక్క కుక్క పడుకుని ఉంది. వాన చినుకులు పడుతున్నాయి. ఓ వారగా మునగదీసుకుని పడుకుంది.పైన ఉన్న రేకుల కప్పు వల్ల అంతగా చినుకులు దాని మీద పడటం లేదు. ఎందుకనో బయటకి వచ్చి చూస్తే మెల్లిగా మూలుగుకుంటూ నా వేపు జాలిగా చూసింది.

"ఏవిటి...నన్ను వెళ్ళగొడతారా...కాసేపు ఉండనివ్వరూ" అన్నట్లుగా భయంగా మొహం పెట్టింది. సరేలే ఉండు...ఉండు...అని నేను ఇంట్లోకి వచ్చేశాను. నేను పై అంతస్తు నుంచి కిందికి చూస్తే ఆ కుక్క కనపడుతూనే ఉంది. గండం గడిచినట్లుగా హాయిగా పడుకుని అటూ ఇటూ చూసుకుంటూ ఏదో ఆలోచన లో ఉంది.

పాపం వీథి కుక్క. ఎక్కడ పుట్టిందో ఏవిటో ...ఏమి తింటుందో...ఏవిటో...ఈరోజు ఇక్కడ కి చేరింది. నా అనుమానం ప్రతిరోజు కూడా దానికి తినడానికి ఏమీ దొరకదనుకుంటా. దొరికినప్పుడు తింటుంది.లేదా ఇలా ఎక్కడో అక్కడ చేరి మునగదీసుకు పడుకుంటుంది.

ఇంట్లో పెరిగే సీమ కుక్కలు ముద్దుగా బొద్దుగా ఎంత బావుంటాయి. ఎంత ముద్దు చేస్తారు జనాలు. ఈ కుక్క కూడా పుట్టినపుడు బుజ్జిగా ముద్దుగా నే ఉండేదనుకుంటా. కానీ ఆలనా పాలనా చూసే దిక్కేది..? అందుకే అలా కొంత బొచ్చు అక్కడక్కడా ఊడిపోయి, బక్కగా ,మురికిగా అలా అయిపోయింది.

 కానీ ఆ కుక్క ని తరమాలని వెళ్ళినపుడు ఆ ప్రాణి చూసిన నిస్సహాయమైన చూపు నాలో దేన్నో కదిలించింది. మరి దాని కళ్ళ లో ఏమి కనబడిందో సరిగా చెప్పలేను. అలా అనిపించింది అంతే..!

(ఇంకా ఉంది)   

--- Macondo


వీథికుక్క-1

 ఒకరోజున, అది ఏ రోజో సరిగా గుర్తులేదు గానీ...రమారమి ఆరు నెలల క్రితం మా బయట గోడ ని ఆనుకుని ఓ బక్క కుక్క పడుకుని ఉంది. వాన చినుకులు పడుతున్నాయ...