D.H. LAWRENCE NOVEL

              ద వర్జిన్ అండ్ ద జిప్సీ (తెలుగు అనువాదం)

------------------------------------------------------------------------

 ఆంగ్లమూలం:  డి.హెచ్.లారెన్స్  

              తెలుగు సేత:మూర్తి కెవివిఎస్


Post No: 1

--------------


Vicar గారి భార్య చిల్లిగవ్వలేని ఓ యువకుని తో లేచిపోయిందనే వార్త మామూలు గా పాకలేదు.ఆమె కి ఇద్దరు కుమార్తెలు.ఒకరికి ఏడేళ్ళు,మరొకరికి తొమ్మిదేళ్ళు.Vicar గారి గూర్చి చెప్పాలంటే చాలా మంచి భర్త.నిజం.అతని తలవెంట్రుకలు కాస్త నెరిసివుండవచ్చు గాక,కాని మీసాలు మాత్రం నలుపే..!అందం గానే ఉంటాడు.అందమైన తన భార్య అంటే బయటకి చెప్పలేనంత ఇష్టం..!


మరి ఆమె ఎందుకు లేచిపోయింది..?మతిలేని ఆ పని ఎందుకు చేసినట్లు..?


ఎవరివద్దా జవాబు లేదు.భయభక్తులు గల కొందరు స్త్రీలు ఆమె గుణమే మంచిది కాదు అన్నారు.ఇంకొంతమంది మౌనం వహించారు.అయితే వారికి దానిలోపలి విషయం తెలుసు.


ఆ ఇద్దరు చిన్న పాపలకి మాత్రం ఏమీ తెలియదు.వాళ్ళ అమ్మ వాళ్ళని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయిందనే నిర్ణయానికి మాత్రం వచ్చారు.వారి హృదయం గాయపడినది.


ఈ దిగ్భ్రాంతికరమైన వార్త మిగతా అందరిని పెద్ద గా ఊపివేసింది ఏమీ లేదులే గాని Vicar గారి కుటుంబానికి మాత్రం బాంబు పేలినట్లయింది.ఇంకా చూడండి...ఆ ఊరి లోని పుస్తకప్రియులకి ఆయన మీద కొంత జాలి కలిగింది.ఎందుకంటే ఈయన వ్యాసరచయిత గా ఇంకా అందులోనూ వివాదస్పదుని గా పేరెన్నికగన్న వ్యక్తి. ఆ Papplewick ప్రాంతం లో ఆ విధంగా ఆయనకి పేరుంది.దురదృష్టం అనే గాలిని ఈ North country లో ఉన్న Rectorate మీది కి తోలాడు ఆ దేవుడు.


ఆ ఊరి లోకి ప్రవేశించే ముందర ఒక నది ప్రవహిస్తూంటుంది.దాన్ని River Papple అంటారు.దానిని ఆనుకునే ఈ Vicar గారి Stone house ఉంటుంది.ఒక మాదిరి గా ఉంటుంది.ఇంకొద్దిగా ముందుకుపోతే ఓ చిన్న పిల్లకాలువ తగులుతుంది.ఆ దాపునే ఎప్పుడో నీటి శక్తి తో నడపబడిన కాటన్ మిల్‌స్ కానవస్తాయి.ఆ రోడ్డుని దాటి వంపు తిరిగి పైకి వెళితే ఆ ఊరి లో రాతి తో వేసిన వీధులు కానవస్తాయి.


ఆ ఏరియా లోని భవనం లోకి వచ్చిన తర్వాత Vicar గారి కుటుంబం కొన్ని కావలసిన మార్పులు చేర్పులు దానికి చేసుకున్నారు.Vicar అనే పదవి నుంచి Rector అనే పదవి లోకి వచ్చాడిప్పుడీయన.ఆయన తో బాటు వృద్దురాలైన తల్లి,సోదరి,సిటీ లో ఉండే సోదరుడు వీరంతా కూడా ఈ ఇంటిలోకి వచ్చారు.ఇక మిగిలిన ఆ ఇద్దరు బాలికలు ...మిగతా వారితో పోలిస్తే విభిన్నవర్గమని చెప్పాలి.


Rector గారికి ఇపుడు 47 ఏళ్ళు.ఆయన భార్య అలా వెళ్ళిపోవడం పట్ల గాఢంగానే కలత చెందారు. ఆయన పట్ల దయగల స్త్రీలు కొంపదీసి ఆత్మహత్య చేసుకుంటాడా అని కనిపెట్టుకు కూచున్నారు.ఆయన జుట్టు ఇంచుమించు గా తెల్లగా అయిపోయింది.కళ్ళు వెడల్పు గానూ దీనం గానూ అయినాయి.నిజం గా మీరు ఆయన్ని చూసి తీరవలసిందే ఎంత భయానకంగా ఆయన స్థితి అయిపోయిందో తెలుసుకోవాలనుకుంటే..!


అయినా ఎక్కడో ఒక అపశ్రుతి ఉన్నది.ఆయనంటే జాలి పడిన స్త్రీల లో కూడా కొందరు రహస్యం గా ఆయన్ని అయిష్టపడేవారు.మళ్ళీ ఓ వైపు ఈయన సత్యవర్తనుడు అనే భావమూ ఉండేది. 

 (సశేషం )       


   

         POST NO:2

----------------------------


ఆ ఇద్దరు చిన్నపిల్లలు ,వారికి తెలిసినంతలో కుటుంబనిర్ణయం తో ఏకీభవించారు.ఇహ ముసలావిడ,అదే Rector గారి తల్లి ,ఆ పిల్లల కి నాయనమ్మ సంగతి,ఆమె కి వయసు డబ్భై పైనే ఉంటుంది.ఆమెకి కనుచూపు కాస్త మందగించింది.అయితేనేం ఆ ఇంటికి ప్రధాన కేంద్రం లా అయిపోయింది.ఇక Cissyఆంటీ ...ఆమె వయసు నలభై పైనే ఉంటుంది.పాలినట్లుగా,భక్తిపరురాలిలా,ఏదో లోపల పురుగు తొలుస్తున్నావిడలా ఉంటుంది.ఇంటిని చూసుకోవడం లో ఆమె పాత్ర ఆమెది.ఇహ Fredఅంకుల్ ..నలభై ఏళ్ళవాడు.ఆయనకోసమే ఆయన జీవిస్తున్నట్లుగా ఉంటాడు.ప్రతిరోజు టౌన్ కి వెళ్ళిరావడం ఆయనకి పరిపాటి.ఇహ Rector గారి సంగతి చెప్పేది ఏముంది,ఆ ముసలావిడ తర్వాత ఈయనే ప్రధానవ్యక్తి ఆ ఇంటిలో..!


ఆ ముసలావిడ ని అంతా Mater (మాతృమూర్తి) అని పిలుస్తుంటారు.చూడటానికి అసహ్యం గా ఉన్నా,మహా తెలివైనది.జీవితం లో రకరకాల మగవాళ్ళ బలహీనతల్ని చూసి,వాటితో ఆడుకొని పండిపోయినావిడ..!ఏదైనా అర్ధం చేసుకోవడం లో మంచి చురుకు.Rector గారు ఇంకా తనకి దూరమైన ఆ భార్య ని ప్రేమిస్తూనే ఉన్నాడు.ఆమె పోయేదాకా అలా చేస్తూనే ఉంటాడు.కాబట్టి ఇక అక్కడ ఆగడం మంచిది.ఆయన భావం లో పవిత్రత ఉంది.ఆయన ఎంతో ఆరాధించి ,పెళ్ళాడిన నాటి భార్య రూపమే ఆయన గుండెలో కొలువుదీరింది. 

బయటలోకానికి సంబంధించి చెప్పాలంటే, ఒక ప్రతిష్ఠ లేని స్త్రీ Rector గారిని ,ఆ చిన్నపిల్లని వదిలేసిపోయింది.ఇపుడు ఒక గర్హించదగిన యువకుని తో వెళ్ళిపోయి,ఎంత అపకీర్తి తేవాలో అంతా తెచ్చింది.ఇది బాగా అర్ధం చేసుకోవాలంతే.ఆ హిమపుష్పం వంటి ఆ వధువు Rector గారి హృది లో స్వచ్చంగా వికసించిఉంది ఇప్పటికీ..! ఆ హిమపుష్పం వాడిపోదు.ఎవరైతే అవతల మనిషి ఉన్నాడో వాడితో తనకనవసరం..!


ఇక మాతృమూర్తి,ఆ ముసలావిడ,ఒకానొకప్పుడు చిన్న ఇంటిలో వితంతువు గా ఏదో తన జీవితం అలా జీవిస్తూండేది.అయితే ప్రస్తుతం ఆమె ఈ ఇంటిలో ప్రధాన నాయకురాలు అయిందని చెప్పాలి.Rector గారి ఇంటిలో పెద్దకుర్చీలో తన వృద్ధశరీరాన్ని స్థిరంగా కూలేసి కూర్చుంటుంది.ఆమె ని సిమ్హాసనం దింపేవాళ్ళు ఎవరూ లేరిప్పుడు.Rector గారి స్థితి పట్ల ,ఆయన హిమపుష్పం పట్ల ఎంతో జాలి గా నిట్టూర్చుతుంది.నిజానికి లోపల ఉండేది వేరు.ఎందుకైనా మంచిదన్నట్లు లేని గౌరవాన్ని తన కొడుకు ప్రేమ హృదయానికి ఆపాదిస్తూ,పాడులోకం లోని ఈ దరిద్రపు వ్యవహారాల పట్ల ఏమీ మాట్లాడ్కుండా మిన్నకుంటుంది.


ముఖ్యం గా తన కోడలు Mrs.Arthur Saywell ...ఒకప్పుడు ఏమోగాని ...ఇప్పుడలా చెప్పుకోవడానికి ఆమె కి ఆ అర్హత ఉందా..? ఎంతమాత్రం లేదు.స్వచ్చమైన హిమపుష్పం బాగా విరబూసింది.దానికి పేరేమిటి...ఏమీలేదు...కుటుంబం ఆమె ని Cynthia అనే పుష్పం తో పోల్చవచ్చును గాక..!


ఇదంతా ఆ ముసలావిడ ఊహాశక్తి కి తోడ్పడేదే..!దీనివల్ల ఏమిటయా అంటే తన కొడుకు Arthur మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఆపడమే అనుకోవాలి.అతని బలహీనత ఇపుడు ముసలావిడ కి బాగా అర్ధమయింది.ఒక పిరికి ప్రేమ అది.అంతే.అతను పెళ్ళాడింది వాడిపోయే హిమపుష్పాన్ని.అదృష్టవంతుడు.గాయపడ్డాడు.అంతే.సంతోషం లేదు,బాధ మరో వైపు.ఏమి ప్రేమ హృదయం..!తను క్షమించేశాడు.తెల్లని హిమపుష్పం క్షమించబడింది.  విల్లు లో కూడా ఆమెది ఆమె కి రాశాడు.మరి అవతల వాడు..?చీ ...అనుకోవడమే అనవసరం.ప్రపంచం లోని ఆ భయంకరమైన విషయాన్ని గురించి అసలు ఆలోచించకూడదు.ఆ Cynthia పుష్పం ఉన్నదే...ఆ గతం లో అక్కడెక్కడో ఎవరకీ అందని,ఆ ఎత్తుల్లోనే వికసించనీ..!వర్తమానం వేరు.!


ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఇటువంటి పవిత్రచింతనల మధ్యనే పెరిగారు.బాహాటం గా కొన్ని విషయాలు ఎవరూ బయటకి అనేవారు కాదు.ఆ హిమపుష్పం అందరాని ఎత్తుల్లో ఉందన్నసంగతి వాళ్ళూ గుర్తెరిగారు.వాళ్ళ జీవితాల్లో ఎక్కడో,స్పృశించ వీలుగాని చోట...ఆ విలువైన అంశం ప్రతిష్ఠితమైంది.


అదే సమయం లో ఎంతకాదనుకున్నా ఈ దరిద్రపు ప్రపంచం లో స్వార్ధం,నైచ్యం అనే వాటి వాసన వస్తూనే ఉంటుంది.ఆ Cynthia గురించే చెప్పేది.ముసలావిడ అప్పుడప్పుడు కావాలనే ఆ పిల్లల దృష్టికి వాళ్ళమ్మ గూర్చిన ప్రస్తావన ని తెస్తుంటుంది.ముగ్గుబుట్ట లాంటి జుట్టు ఉన్న ఆ ముసలావిడ అప్పుడు అసహ్యం తో ఊగిపోతుంది లోలోపల..!


ఒకవేళ ఆ Cynthia తిరిగివచ్చినా ,తన స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. చాలా ప్రణాళిక ప్రకారం ఈ ముసలి నాయనమ్మ ఈ భావజాలాన్ని పిల్లల్లో ప్రవేశపెట్టింది.వాళ్ళ అమ్మ ఎంత చెడ్డదో అన్నట్లుగా చెబుతూంటుంది.ఇదంతా ఇలా ఉండగా,అసలు తమ ఇంట్లోని పరిస్థితులు ఏమిటి అనేది ఆ పిల్లలు కూడా బాగానే గ్రహిస్తున్నారు.తమ తల్లి ఆకర్షణీయమైనదేగాని అంత ఆధారపడదగినది కాదు అని వారికి తెలుసు.ఆమె తెచ్చిన గొప్పకాంతి ప్రమాదకరమైన సూర్యుని లా వచ్చి వారి జీవితం లో వేగం గా ప్రసరించిపోయింది.ఆ కిరణాలు ఎప్పటికీ వస్తూ పోతుంటాయి.ఉన్నంతసేపు వెలుతురు.కాని ఒక ప్రమాదం..కూడా ఉంది.ఆకర్షణ,భయంకరమైన స్వర్ర్ధం అనీ ఉన్నాయందులో..! (సశేషం)   


                         

POST NO: 3

-----------------


ఇప్పుడు ఆ తెల్లని హిమపుష్పం యొక్క వన్నె తగ్గింది.సమాధి పై ఉంచబడిన పుష్పాలతో నిండిన పింగాణీ పాత్ర లా తయారయింది.సమస్థితి లేకపోవడం,జంతుప్రవృత్తి లోని స్వార్ధం ఇలాంటివేమీ ఇపుడు లేవు.ఒక నెమ్మదితనం వచ్చింది.ఎవరైనాసరే,హాయిగా ఈ వాతావరణం లో కనుమూయవచ్చు.


పిల్లలూ పెరుగుతున్నారు.ఆ క్రమం లో కొంత గందరగోళ పడటమూ ఉంటుంది.ఇక ఆ పెద్దావిడకి రోజులు గడుస్తున్నకొద్దీ కనుచూపు మరీ మందగిస్తోంది.ఆమెని ఒకరు తీసుకెళ్ళాలి ఎటు కదలాలన్నా..!మధ్యానం దాకా అలానే పడుకుండిపోతుంది.అంత కళ్ళు మందగించినా ,మంచానికి అతుక్కుపోయినట్లయినా ఆ ఇంటికి నేనే పెద్ద దిక్కు అనే అతిశయం మాత్రం పోలేదు.


ఎవరైనా మగమనుషులు ఇంట్లోకి వస్తే,వెంటనే ఎలర్ట్ అయి తన 'పెద్ద కుర్చీ' లో కూర్చుంటుంది.ఆ విషయం లో నిర్లక్ష్యం అనేది ఉండదు.తనకెవరైన 'Rival' గా తయారవుతున్నారంటే మాత్రం ఆమెకి గిట్టదు.అంత ప్రణాళికతో ఉంటుంది. ఆమెకి ఇంట్లో నిజంగా Rival అంటూ ఎవరన్నా ఉన్నారంటే అది చిన్న మనవరాలు.ఆ అమ్మాయి పేరు Yvette..!నాయనమ్మ అంటే ఆ అమ్మాయికి చిన్నచూపే,అసలు లెక్కచేయదు.దానికంతా ఆ తల్లి పోలికే వచ్చింది అనుకుంటుంది ఆ ముసలావిడ.సరే...ఎప్పుడో ఒకప్పుడో నా చేతికి చిక్కకపోతుందా అని సముదాయించుకుంటుంది.


ఆ Rector ఈ కూతురు ని మరీ ముద్దు చేసి ఇలా తయారు చేశాడు.ఏం,నేను మాత్రం గారాబం చేయబడలేదా,మెత్తటి హృదయం గలవాణ్ణి కాదా అనుకుంటాడతను.వెంట్రుకవాసి అంత బలహీనత ఉండవచ్చు అతని దృష్టిలో..!అతని అభిప్రాయం అలా ఉంటుంది.ఇలాంటివి అన్నీ కనిపెట్టింది కాబట్టే ఆ కూతుర్లు ఇద్దరిని అతనికి ఒక అలంకారం గా ఉండాలని అంటూ ఉంటుంది.అదొక ఏర్పాటు.


స్త్రీలకి ఆకర్షణీయమైన దుస్తులు ఎలాగో ఆకర్షణీయమైన శీలం అలాగా అని అతని అభిప్రాయం.అయితే ఈ మాతృమూర్తి మాత్రం ఎప్పుడూ ఏవో వంకలు చెబుతుంది.ఆమె మాతృప్రేమ- కొడుకు బలహీనతల్ని బాగా ఎరిగింది.అయితే వాటిని ఆమె వ్యక్తపరచదు.ఇక ఆ Cynthia గురించా ,ఇపుడు ప్రస్తావనే అనవసరం. ఆ మాతృమూర్తి దృష్టిలో కొడుకు ప్రేమ వెన్నెముక లేనిది.అతనొక చవటాయ్.మరో హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే పెద్ద మనవరాలు ఉన్నదే,ఆ అమ్మాయి పేరు Lucille,ఈమె ని ఆ చిన్నదాని కంటే అసహించుకుంటుంది.ఈ Lucille చాలా చికాకు తెప్పిస్తుంది,పెంకి కూడా.ఈ ముసలావిడ శక్తియుక్తుల్ని ఈ పిల్ల బాగా ఎరుగును.ఆ చిన్నదానితో పోలిస్తే..!


Cissie ఆంటీ కి కూడా Yvette అంటే అంత ఇష్టం ఉండదు.అసలు ఆ అమ్మాయి పేరే నచ్చదు ముందు.ఆ ముసలావిడ సేవ కే ఈ Cissie ఆంటీ జీవితం అంకితం.ఈ సంగతి Cissie కి తెలుసు.ఈమెకి తెలుసుననే సంగతి ఆ ముసలామె కీ తెలుసు.ఏళ్ళు గడుస్తూనేఉన్నాయి.ఈ తంతు కొనసాగుతూనే ఉంది.ప్రతి ఒక్కరూ Cissie ఆంటీ త్యాగాన్ని ఆమోదించారు.ఆమెతో సహా.ఆమె ప్రార్ధించిన విషయమే అది.ఆమెకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయన్న సంగతి పాపం ఆ విధంగా తెలుస్తోంది.ఆమె జీవితం మెల్లిగా కరిగిపోతోంది.50 వ ఏటి లోకి ప్రవేశిస్తోంది.ఆమె లో ని నీలి సెగలు ఉన్నట్లుండి పెల్లుబుకుతుంటాయి.అప్పుడామె మతితప్పినదానిలా అయిపోతుంది.  

ఆ నాయనమ్మ మాత్రం Cissie ఆంటీ ని తన ఆధిపత్యం కిందనే ఉంచుకుంటుంది.ఏది ఏమైనా Cissie యొక్క జీవితం లో ఒక తప్పనిసరి బాధ్యత వంటిది ఈ ముసలావిడ.Cissie ఆంటీ కి ఒక్కోసారి ఆ ఇద్దరు ఆడపిల్లల మీద కూడా చిర్రెత్తుకొస్తుంది.చేసేదేముంది.అలాంటి వేళలో ఆ పై వాడిని క్షమాపణ కోసం ప్రార్ధిస్తుంది.అయితే తనకి జరిగిన అన్యాయం తల్చుకున్నప్పుడు మాత్రం ఆమె ఎవరినీ క్షమించదు.నరనరాల్లో ద్వేషం పెల్లుబుకుతుంది.


ఆ ముసలావిడ బయటకి చాలా ప్రేమ,దయ ఉన్నదానిలా అగపడుతుంది.అది కేవలం పైకి మాత్రమే.అంతా కపటత్వం.ఆ ఇద్దరాడపిల్లలకి కూడా క్రమేపీ అర్ధం అవసాగింది.ముగ్గుబుట్ట లాంటి జుట్టు మీద లేస్ టోపీ పెట్టుకుని ,లావు గా ఉండే ఈ ముసలావిడ హృదయం చాలా కపటత్వం తో కూడుకున్నదని..!ఎంతసేపు ఆమె అధికారం సాగించుకోవాలని చూస్తుంటుందని వారికి అర్ధమయింది.డభై,గానీ,ఎనభై గానీ,తొంభై గాని ఎన్ని ఏళ్ళు అయినా రానీ ఆమె గుణం మారదు.


ఆ కుటుంబం లో ఒక సంప్రదాయం ఉంది.అదే Loyalty.ఒకరికొకరు కట్టుబడి ఉండటం.ముఖ్యం గా ఇంట్లో ఉండే ముసలావిడకి.కుటుంబం మొత్తం లో ఆమె పెద్దదే,కాదనడం లేదు. ఆ కుటుంబం మొత్తం Her own extended ego.కాబట్టి అందరి మీద తనకి అధికారం ఉందన్నట్లు గా ఉంటుంది ఆమె ధోరణి.ఆమె కొడుకులు గాని,కూతుర్లు గాని ఐకమత్యం లేనివాళ్ళు,బలహీనులు.కనుక ఆమె కి సహజం గానే Loyal గానే ఉంటారు.కుటుంబం దాటి పోతే వారికి ఉన్నదేమిటి..? ప్రమాదం ఇంకా సిగ్గు పడదగ్గ అంశాలేగా..!Rector తన పెళ్ళి నుంచి పొందినది అదే.కాబట్టి జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఉంది.


ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే కుటుంబం లో ఒకరికొకరు Loyal గా ఉండాలి గదా..!మన లోపల ఎంత ఒరిపిడి ఉండనీ,చికాకులు ఉండనీ...బయట ప్రపంచానికి వచ్చేసరికి కుటుంబం లో అందరూ ఒకరికొకరు అండగా ఉండాలి గదా..!

(సశేషం)    


             

POST NO: 4 (Part-2)

----------------------------------


స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గాని వాళ్ళ నాయనమ్మ పూర్తి సంగతి తెలియలేదు ఆ ఇద్దరాడపిల్లలకి..!Lucille కి ఇపుడు 21 ఏళ్ళు కాగా,Yvette కి 19 ఏళ్ళు.మంచి ఆడపిల్లలు చదువుకునే స్కూల్ లోనే వాళ్ళు చేరారు.Lausanne లో ఉన్నది ఆ స్కూల్..!ప్రస్తుతం చివరి సంవత్సరం లో ఉన్నారు.ఇద్దరూ మంచి ఎత్తు గా,అందంగా తయారయ్యారు.వారి మోములో లేతదనం!బాబ్డ్ హెయిర్ లో హుందాగా చక్కని మేనర్‌స్ తో పెరిగారు.


"మన Papplewick లో మహా బోరు గా ఉండేదేమిటో తెలుసా?" అడిగింది Yvette.వాళ్ళిప్పుడు ఒక కాలువ లో గల బోట్ లో కూర్చుని ఉన్నారు.అక్కడి నుంచి బూడిద వర్ణం లో అగుపిస్తున్న డోవర్ పర్వత శిఖరాన్ని చూస్తున్నారు.


"ఇక్కడ వేరే పురుషులెవరూ ఉండకపోవడమా?డాడీ కి కొంతమంది పాత క్రీడా స్నేహితులు ఉండవచ్చుగా..? Uncle Fred ఉన్నా ఆయన వరకే పరిమితం" 


"ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు" అంది Lucille,ఒక తాత్విక ధోరణిలో..! 

"ఏది ఊహించాలో నీకు బాగా తెలుసు" Yvette సమాధానమిచ్చింది.


"ఆదివారం నాడు Choir ఉంటుంది గదా!ఆడా ,మగా కలిపిపాడే ఆ తరహా అంటే నాకు ఇష్టం ఉండదు.స్త్రీలు లేకుండా అబ్బాయిలు పాడే విధానం లోనే బాగా అనిపిస్తుంది.ఇక సండే స్కూల్ లో అమ్మాయిలు కలివిడి గా ఉంటారు.వయసు మళ్ళిన వాళ్ళంతా నాయనమ్మ ని గురించి అడుగుతుంటారు.కొన్ని మైళ్ళ పర్యంతం చక్కటి యువకుడంటే కనబడటం లేదు." తనే అంది Yvette.


"నాకు అంతగా తెలీదు.అయితే Frameley కుటుంబీకులు ఉన్నారు గదా..!ఆ...ఒకటి ,Gerry Somercotes నువ్వంటే ఎంతో ఆరాధన తో ఉంటాడు" అంది Lucille.


"Oh..but I hate fellows who adore me,  అలాంటి వాళ్ళంటే బోర్ నాకు.ఎపుడు అదేపనిగా వెనక పడుతూ ఉంటారు.." Yvette అరిచి చెప్పింది.


"నిన్ను ఆరాధించడం నీకు ఇష్టం లేకపోతే మరి ఇంకేమిటి నీకు కావలిసింది ? వాళ్ళని నువ్వేమీ పెళ్ళాడటం లేదుగా !వాళ్ళమానాన వాళ్ళు ఆరాధించుకుంటారు.వాళ్ళ ఇది వాళ్ళది." 


"Oh..but I want to get married" అరిచి చెప్పింది Yvette.


"అలాగయిన పక్షంలో ,వాళ్ళ ఆరాధనలో వాళ్ళని ఉండనీ ,నీకు నచ్చేవాడుదొరికేదాకా""ఏమో..అది నా వల్ల కాని పని.ఆరాధించబడే వ్యక్తి లా నేను ఉండలేను.అది నాకు బోర్ గా ఉంటుంది.They make me feel beastly" 


"సరే...వాళ్ళు అవసరమనుకుంటే,నా విషయం లో అది సమంజసమే అనుకుంటాను.అదీ దూరం నుంచే సుమా!కొంత నయం అది" 


"నేను గాఢంగా ప్రేమ లో పడదల్చుకున్నాను" 


"ఓహ్..నా వల్ల కాని పని అది.అది నాకు ఇష్టం ఉండదు.నీ విషయం లో అలా ఒకవేళ అయితే కానీ.అంతకన్నాముందు జీవితం లో మనం స్థిరపడాలి.మనకేమీ కావాలో తెలియాలంటే ముందు అది అవసరం"


"Papplewick వెళ్ళడం అంటే నీకు చికాకు గా లేదూ ?" ప్రశ్నించింది Yvette తన సుకుమారమైన ముక్కుని ఎగబీల్చుతూ.


"ప్రత్యేకం గా అలా ఏమీలేదు.బోర్ కొట్టేమాట నిజమే.కాని నేననుకోవడం డాడీ ఓ కారు కొంటారని..!అదీగాక మన పాత సైకిళ్ళు ఉన్నాయి గదా,వాటిని బయటకి తీసి అలా రౌండ్స్ వేయవచ్చు.అలా పైకి Tansy Moor దాకా తొక్కుకుంటూ వెళ్ళడం నీకు మాత్రం నచ్చదా?" 


"ఆ గుట్టమీదికి సైకిళ్ళని గట్టిగా తొక్కుకుంటూ వెళ్ళడం కొద్దిగా కష్టమే గాని అది నాకు ఇష్టమే" 


దూరం గా ఓ పడవ నున్నని కొండల్ని సమీపిస్తోంది.అది వేసవి,కాని వాతావరణం మబ్బుగా ఉంది.ఆ ఇద్దరమ్మాయిలు వేసుకున్న కోట్లు కి ఉన్న ఫర్ కాలర్‌స్ పైకి లేచి ఉన్నాయి.వాళ్ళు పెట్టుకున్న టోపీలు చెవులు కిందకి ఆని ఉన్నాయి.చూడటానికి ఎత్తుగా,సుతారం గా ఉన్నారు.మొహం లో ఓ అమాయకత్వం,లేతదనం. అయితే వారిలో చాలా ఆత్మవిశ్వాసం కూడా ద్యోతకమవుతోంది.స్కూల్ పిల్లల్లో ఉండే గీర ఒకటి..!

నిజంగా వాళ్ళు నూటికి నూరు శాతం ఇంగ్లీష్ అమ్మాయిల్లానే ఉన్నారు.బయటకి స్వేచ్చగా ఉన్నా,వాళ్ళని లోన పట్టి ఉంచేది ఏదో ఉంది.బయటకి ధైర్యం గా,అసాంప్రదాయికంగా ఉన్నా లోపల మటుకు దానికి మరో వేపు ఉంది.మనసులో ఏవో ద్వారాలు మూయబడి ఉన్నాయి.జీవితం అనే మహాసముద్రం లోకి మెల్లిగా ప్రవేశిస్తున్న నౌకలు వాళ్ళు. నిజం చెప్పాలంటే అవగాహన లేని రెండు యువ జీవితాలు.ఒకచోట వేసిన లంగరు ని విడిచి మరో చోటికి పయనమవుతున్నాయవి.

(సశేషం)    


POST NO: 5

------------------


ఆ పిల్లలిద్దరికీ వాళ్ళ Rectory పరిధి లోకి అడుగు పెట్టడం తో హృదయాల్లో ఝం అన్నది.చూసేందుకు వారికది నచ్చదు.ఇక్కడంతా ఒక మధ్య తరగతి వాతావరణం ఇంకా కేవలం అలాంటి సౌకర్యాలే ఉంటాయి,అంతే.వాళ్ళ ఇల్లంటే పెద్దగా నచ్చదు.ఆ రాతి కట్టడం వారికి అశుభ్రంగా అనిపిస్తుంది.దానిలోని ఫర్నీచర్ అదీ  గానీ వారికి నూతనం గా అనిపించదు.భోజనం దగ్గర కూడా..వాళ్ళకి రుచించదు.విదేశం లో చదువుకొచ్చిన యువతరం గదా  మరి అలాగే అనిపిస్తుందేమో..!


రోస్ట్ చేసిన బీఫ్,వెట్ కేబేజ్,కోల్డ్ మటన్,మాష్డ్ పొటాటో,పుల్లటి పచ్చళ్ళు,భోజనానతరం తినే కొన్ని తీపి పదార్థాలు ...ఇవి ఆ ఇంటిలోని వంటకాలు. 


నాయనమ్మ కి పోర్‌క్ అంటే ఇష్టమే గాని ఆమెకి కొన్ని ప్రత్యేక వంటకాలు ఉంటాయి.బీఫ్ టీ,రస్కులు,సేవరీ కష్టర్డ్ ఇలాంటివి.ఆమె ఒంటరిగా టేబుల్ ముందు కూర్చుని ప్లేట్ లో బాయిల్డ్ పొటాటో వేసుకుని తింటూఉంటుంది. మాంసాహారం తినదు.మిగతావాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ,స్థిమితం గా ఉండి,మళ్ళీ తనకి కేటాయించబడిన పదార్థాల్ని లొట్టలు వేసుకుంటూ ఆరగిస్తుంది. ఆహార పదార్థాలు పెద్ద రుచిగా ఉండవు ఆ ఇద్దరాడపిల్లలకి..! 


ఎందుకలా అంటే,ఆ వంటల్ని చూసుకునే Cissie ఆంటీ కి ఫుడ్ విషయం లో పెద్దగా అభిరుచి లేకపోవడం. తినడం లోనూ అంతే.గత మూడు నెలలుగా పనిమనుషుల్ని కూడా మానిపించింది.


ఆ ఇద్దరాడపిల్లలు ఏదో తిన్నాం అంటే తిన్నాం లాగా జరిపించేస్తుంటారు. Lucille ఏమి మాట్లాడకుండా తినేస్తుంది. Yvette మాత్రం ముక్కు తో వాసన చూసి ఇష్టం లేనట్టు మొహం చిట్లిస్తుంది.ఆ ఒక్క Rector మాత్రం జోక్ లు వేసుకుంటూ తినేస్తుంటాడు.తెల్లని జుట్టు గల ఆ మనిషి తన బూడిద రంగు మీసాల్ని కర్చీఫ్ తో తుడుచుకుంటూ మహదానందం గా లాగిస్తుంటాడు.


రాను రాను తను లావై పోతున్నాడు.తన రూం లో పుస్తకాలతో రోజంతా కాలక్షేపం చేస్తుంటాడు.బద్దకస్తుడిలా అవుతున్నాడు.వ్యాయామం అనేది చేయడు.వాళ్ళ అమ్మ తో కూర్చుని ఏవో వ్యంగ్యాత్మక కబుర్లు, జోకులు చెప్పుకుంటూ కాలం గడుపుతుంటాడు.


ఎత్తైన గుట్టలతో , లోతైన లోయలతో ఆ గ్రామీణ ప్రాంతమంతా ముసురు పట్టి నిద్ర పోతున్నట్లు గా ఉంటుంది.ఆ ప్రదేశానికి దానికంటూ ఉండే ఓ ప్రత్యేకత ఉన్నది.అదే దానికి బలం.ఉత్తరానికి అలాగే 20 మైళ్ళు వెడితే అక్కడ కొన్ని పరిశ్రమలు ఉన్నాయి.ఆ Papplewick గ్రామం ఒంటరి గా ,ఏదో పొగొట్టున్నట్లు గా ఉంటుంది.అక్కడగల రాతికట్టడాల్లోనే జీవమంతా ఉన్నది.ఓ కవితాత్మకమైన ప్రదేశం అది.


గతంలో లానే ఆ ఇద్దరాడపిల్లలు Choir లో పాడటమూ,ఆ Parish లో సాయపడటమూ చేస్తుంటారు.Yvette కి సండే స్కూల్ అంటే ససేమిరా పడదు.ఎప్పుడో పెద్దవాళ్ళు నిర్ణయించిన ఇలాంటి పనులు ఆమెకి నచ్చవు.చర్చ్ కి సంబందించిన విధులు అన్నిటినీ తప్పించుకుంటుంది.ఎప్పుడు అవకాశం దొరికినా Rectory నుంచి దూరం గా ఉంటుంది.


Framleys కుటుంబం Grange ప్రాంతం లో ఉంటుంది.చాలా పెద్ద కుటుంబం,డల్ గానూ,ఆనందం గానూ ఉంటారు.విధుల పట్ల అలసత్వం చూపరు.ఒక్కోసారి ఆమెని ఎవరైనా భోజనానికి గాని,టీ కి గాని ఆహ్వానిస్తే ,అది మామూలు శ్రామికుల కుటుంబం అయినా సరే,ఆమె దానిని స్వీకరిస్తుంది.అలా చేయడం లో ఆమె కి ఓ థ్రిల్లింగ్ ఉన్నది.అలాంటి వారి తో అంటే శ్రామికుల వంటి వారి తో మాటాడటం ఆమె కి ఇష్టం.వాళ్ళ లో కొంతమంది చికాకు గాళ్ళు ఉంటారు గాని చాలా మటుకు మంచి వాళ్ళూ సైతం ఉంటారు.ఏదైమైనా వారిదంతా మరో ప్రపంచం. 


నెలలు గడిచిపోయాయి.Gerry Somercotes ఇంకా Yvette కి ఆరాధకుడి గానే ఉన్నాడు.రైతు కుటుంబం నుంచి,మిల్ ఓనర్ల కుటుంబం నుంచి వచ్చిన యువకులు ఇంకొందరు కూడా ఆమె కి ఆరాధకులు గా మారారు.ఆమె ఇప్పుడు ఇక్కడ సమయాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.కాని ఆమె పార్టీలు,డాన్‌స్ లు అంటూ బయట ఊర్లకి వెళుతుంది.ఆమె కోసం స్నేహితులు మోటారు కార్ల లో వస్తుంటారు. అలా ఆమె సిటీ కి వెళ్ళి ప్రధానమైన హోటళ్ళ లో మధ్యానపు డాన్స్ ల లో ఫాల్గొంటుంది.నూతనం గా నిర్మించిన ఘనమైన Palais de Danse కి వెళుతుంది.దాన్ని Pally అని పిలుస్తారు.


అయినప్పటికీ ఆమె ఇంద్రజాలానికి గురైన జీవి లా ఉంటుంది.పూర్తి ఆనందం గా ఉండదు.లోలోపల ఎక్కడో ఓ చికాకు.అలా ఉండటం ఆమె కి ఇష్టం కాదు గాని అది ఎప్పుడు మొదలయిందో ఆమె కీ తెలియదు.Cissie ఆంటీ తో కూడా ఒకోమారు రూడ్ గా ఉంటుంది.ఇంటి దగ్గర ఉండటం అంటే మహా చికాకు.Yvette కి ఉండే ఈ స్వభావం ఆ కుటుంబానికి ఉన్న ఓ లక్షణం గా తయారైంది.


ఇక Lucille విషయానికొస్తే,చాలా ప్రాక్టికల్ మనిషి.తనకి ఫ్రెంచ్ భాష,షార్ట్ హేండ్ వచ్చును.ఆ అవసరం ఉన్న ఓ వ్యక్తి దగ్గర ఆమె పర్సనల్ సెక్రెటరీ గా జాయినయింది.రైలు లో రోజూ సిటీ కి వెళ్ళి వస్తుంది.అదే రైలు లో Uncle Fred కూడా ప్రయాణిస్తాడు.కాని ఈమె మాత్రం తనతో కలవదు.వాతావరణం ఎలా ఉన్నా ఆమె స్టేషన్ దాకా సైకిల్ మీదనే వెళుతుంది.ఆయన మాత్రం నడుచుకుంటూ వెళతాడు.


సుఖవంతమైన సాంఘిక జీవితాన్నే ఆ ఇద్దరమ్మాయిలు కోరుకున్నది.Rectory అంటే ఇద్దరికీ పడదు.ఇక వాళ్ళ స్నేహితుల గురిచి చెప్పేదేముంది..!


వారి ఇంటిలో కింది భాగం లో నాలుగు గదులు ఉంటాయి.ఒక కిచెన్,దాన్లో ఇద్దరు పనివాళ్ళుంటారు.అసంతృప్తిగా..!ఆ తర్వాత ,అంతగా వెలుతురు రాని డైనింగ్ రూం ఒకటి ఉంటుంది.ఇక పోతే Rector చదువుకోవడానికి ప్రత్యేకంగా ఒక స్టడీ రూం..! ఆ తర్వాతది లివింగ్ రూం లేదా డ్రాయింగ్ రూం ,ఇది పెద్ద గా ఉంటుంది.డైనింగ్ రూం లో గ్యాస్ తో వెలిగే పొయ్యి ఉంటుంది.లివింగ్ రూం లో మాత్రం చలికాచుకోవడానికి మంచి వసతి ఉన్నది.ఆ ప్రదేశం లో నాయనమ్మ దే హవా..!


ఈ రూం లో కుటుంబం అంతా సమావేశమవుతుంది.సాయంత్రం పూట డిన్నర్ గట్రా అయిపోయినతర్వాత Uncle Fred,Rector ఇద్దరూ వాళ్ళమ్మ తో కలిసి క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయడం అనే కార్యక్రమం ఒకటి పెట్టుకుంటారు.

(సశేషం)       


POST NO: 6

----------------

   "ఆ..అమ్మా...ఇపుడు చెప్పు...నువు రెడీయేగదా,N బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్ W : a siamese functionary"


"ఏ...ఏమిటి...?M బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్ W నా? " అడిగింది ముసలావిడ.ఆమె కి వినికిడి శక్తి తక్కువ అని తెలిసిదే గదా..!


"కాదమ్మా..M కాదు,N ఆ తర్వాత నాలుగు బ్లాంక్ లు చివరన W వస్తుంది.దాని అర్ధం a siamese functionary అట."


"N ఆ తర్వాత 4 బ్లాంక్ లు,ఆ తర్వాత W నా ! a chinese functionary నా..అంతేగదా..?"


"కాదు,సియామిస్" 


"ఆ అలాగా " 


"siamese,siam" 


"ఓ.. సియామిస్ ఫంక్షనరీ నా..?అయితే ఆ ఖాళీల్లో ఏ అక్షరాలు వస్తాయబ్బా " రెండు చేతులు పొట్టకి ఆనించి ఆలోచించసాగింది.ఇద్దరు కొడుకులు ఏవో ఊహిస్తున్నారు.దానికామె ఊ కొడుతున్నది.


Rector ఈ క్రాస్ వర్డ్ పజిల్‌స్ పూరించడం లో మంచి తెలివైనవాడు.అయితే Fred కొన్ని సాంకేతిక పదాల్ని బాగా ఊహిస్తాడు.


"ఇది చాలా కష్టమైన పదం లా ఉంది" ఆ ముసలావిడ అన్నది.అందరూ ఆలోచిస్తున్నారు.


Lucille చెవులకి తన చేతుల్ని అడ్డం పెట్టుకుని ఏదో చదువుతున్నట్లుగా అభినయిస్తోంది.Yvette కోపంగా ఏదో బొమ్మలు గీకుతూ గట్టిగా రాగం తీస్తున్నది.


Cissie ఆంటీ అదుపు లేకుండా చాకొలెట్ తింటున్నది.ఆమె దవడలు ఎప్పుడూ అలా కదులుతూనే ఉంటాయి.ఆమె కాస్తా దూరం గా ఉంది.ఇంకో చాకొలెట్ నోటిలో వేసుకుని Parish మేగజైన్ ని తిప్పుతోంది.ఆమె ఓ సారి తల తిప్పి,ముసలావిడకి హార్లిక్స్ టైం అయిందన్నట్లు లేచింది.


ఆమె అలా లేవగానే Yvette విసురు గా వెళ్ళి ఒక కిటికీ ని తెరిచింది.ఆమె ఉద్దేశ్యం లో ఆ రూం లోకి ఫ్రెష్ గాలి రావాలని.అంత చెవుడు ఉన్న ముసలావిడ కి ఆ శబ్దం బాగానే వినబడింది.


"ఏయ్ ...Yvette , ఆ కిటికీ ని తెరిచావా..?ఇక్కడ నీకంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు.ఆ సంగతి గుర్తుంచుకోవాలి.అర్ధమైందా..?భరించలేని చలిగాలి వీస్తోంది. అందరికీ జలుబు చేస్తుంది" అంది ముసలావిడ. 


మళ్ళీ తనే అంది " ఈ రూం పెద్ద గానే ఉంది.అందరూ కావలసినంత వెచ్చదనం పొందవచ్చు ఇక్కడ ఉన్న ఫైర్ తో.." 


"అది నాకు తెలుసు,కొద్దిగా ఫ్రెష్ గాలి రావాలని తెరిచాను" అంది Yvette. ఆ ముసలావిడ కోపం తో కంపించింది.


"ఏమిటి...నిజమా?" అరిచింది ఆమె.


ఈ లోపులో Rector మెల్లగా లేచి ఆ కిటికి దగ్గరకి పోయి దాన్ని మూసేశాడు.కూతుర్ని అదిలించడం ఇష్టం లేక ఆమె వైపు చూడకుండా వచ్చేశాడు.అయితే ఎప్పుడెలా ఉండాలో ఆ అమ్మాయి తెలుసుకునే తీరాలి.


ఈ క్రాస్ వర్డ్ పజిల్స్ ని ఆ సాతాను కనిపెట్టాడనుకుంటా,ఇపుడు ఇది ఈ ముసలామె దాకా వచ్చింది.ఆమె హార్లిక్స్ తాగింది.మంచం ఎక్కి నిద్రపోవడానికి గాను నిర్ణయించుకుని అందరికీ గుడ్ నైట్ చెప్పింది. అందరూ లేచారు.


అప్పటికి రాత్రి తొమ్మిదయింది.ఆ ముసలావిడ ఏదో పడుకుంటుంది గాని ఆమె కి నిద్ర అంత తొందరగా పట్టదు.ఆ Cissie ఆంటీ వచ్చి నిద్రోయేదాకా..! 


"నే కాపురం చేసిన 54 ఏళ్ళు మీ నాన్నగారు లేకుండా ఏ రోజు నిద్రపోయింది లేదు.ఆయన పోయిన తర్వాత ..నిద్రపోయే వేళకి ప్రాణం బయటకి వచ్చినంత పని అవుతోంది.అసలు నన్నే ముందు తీసుకెళ్ళమని ఆ దేవుడిని ప్రార్ధించా...అయితే ఒకటిలే...నేను ముందెళ్ళినా తను భరించలేడు" సణిగింది ముసలావిడ.


ఆ ముసలావిడ తోనే ఈ Cissie ఆంటీ కూడా పడుకుంటుంది.ఆమెకది చికాకు గానే ఉంటుంది.తను అంత తొందరగా నిద్రపోదు.రోజురోజు కి ఆమె పరిస్థితి అలా తయారవుతోంది.ఆ తినే తిండి సహించడం లేదు.ఏదో ఒకటి చేయాలి.


మధ్యాన భోజన సమయం కల్లా ముసలావిడ లేస్తుంది. ఆ చూపు తగ్గుతున్న నీలికళ్ళు,సాగుతున్న కనుబొమలు,ఎర్రటి మొహం,ఒకలాంటి భరించలేని గంభీరత్వం ఇలాంటి లక్షణాల తో కూడిన ఆమె తన చేతుల కూర్చీ లో కూర్చొని ఆరగిస్తుంది.తెల్లని వెంట్రుకలు పల్చబడుతున్నాయి.దానిమీద Rector అనడమూ,ఈమె దాన్ని ఒప్పుకోకపోవడమూ అదొక సన్నివేశం.తిండి విషయం లో సంతృప్తి గా ఉంటుంది.ఆ ఘట్టం అయిన తర్వాత తన శరీరాన్ని నొక్కుకుంటూ ఆ కుర్చీ లో కూలబడుతుంది.


ఆ ఇద్దరాడపిల్లలకి ఒక ఇబ్బంది ఏమిటంటే ...వాళ్ళ స్నేహితులు ఎవరు వచ్చినా ఈమె వాళ్ళని అన్నీ వాకబు చేస్తుంది.రాగానే ముందు ఆ గది లోనే ఉంటుంది.ఆమె ని చూసుకుంటూ Cissie ఆంటీ కూడా..!వచ్చిన ప్రతివాళ్ళు ముసలావిడ దగ్గర హాజరు వేయించుకోవాలి.వాళ్ళెవరు,ఎక్కడినుంచి వచ్చారు,వాళ్ళ జీవిత విశేషాలు ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటుంది.ఆమె సంతృప్తి చెందితే సంభాషణ కొనసాగిస్తుంది. 

(సశేషం) 

 

POST NO: 7

-----------------

  

"తొంభై సంవత్సరాల వయసు లో కూడా జీవితం పట్ల ఆమెకి గల ఆసక్తి ఆశ్చర్యం కలిగించేదే" అని అనుకుంటారు.కాని ఆ అమ్మాయిల స్నేహితుల అందరి వివరాలు పూసగుచ్చినట్లు కనుక్కోవడం మాత్రం వారికి నచ్చదు.


"ముఖ్యంగా ఇతరుల విషయాల్లో ఆ ఆసక్తి మరీ ఎక్కువ" అంటుంది Yvette.అలా అన్నప్పుడు ఆ అమ్మాయి గిల్టీ గా ఫీలవుతుంది.తొంభై ఏళ్ళ వయసు లో కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఆలోచించగలగడం అంటే అది చెప్పుకోవలసిన విషయమే..!అందునా ఆ ముసలావిడ ఎవరకీ ఏ హానీ చేయదు ఎప్పుడు.మునుముందు చేయబోదు కూడా..!ఒకరి వయసు ని బట్టి వారిని అవహేళన చేయడం మంచి పని కాదు.


ఆ ఆలోచన రాగానే Yvette పశ్చాత్తాపపడింది.వాళ్ళ నాయనమ్మ తాను బకింగ్ హాం షైర్  అనే ఊరి లో చిన్నపిల్ల గా ఉన్నప్పటి అనుభవాల్ని తరచూ చెబుతుంది.అవి చాలా వినోదకరంగా ఉంటాయి.నిజం చెప్పాలంటే ఆమె వండర్ఫుల్ మనిషి.


మధ్యానం పూట..! Lottie,Ella,Bob Framely,Leo Wetherell ఇలాంటి మిత్రబృందం అంతా ఇంటికి వచ్చారు.నాయనమ్మ తెల్లటి టోపీ పెట్టుకుని ఆ రూం లోనే కూర్చొని ఉంది.    


"నాయనమ్మ ఇతను Mr.Wetherell" పరిచయం చేసింది Yvette.


"ఆ..మిస్టర్,ఏం చెప్పావు..? నాకు కొద్దిగా వినబడదు..!" ఆ ముసలావిడ ఆ అబ్బాయికేసి చూస్తూ అంది.అతను అప్పటికి అసౌకర్యం గా ఫీలవుతున్నాడు. "అన్నట్లు నువు మా Parish వాడివి కావనుకుంటాను" తనే అన్నది.


"మాది Dinnington" చెప్పాడతను గట్టిగా..!


"రేపు మేము Bonsall Head కి పిక్నిక్ వెళదాం అనుకుంటున్నాము.Leo కారు లో వెళతాము మేమంతా" Ella అన్నది చిన్నగా.


"ఏమిటి..? Bonsall Head కా ?" ప్రశ్నించింది ముసలావిడ.


"అవును" 


కొద్దిసేపు నిశ్శబ్దం.


"ఏమిటి మీరనేది కారులో వెళుతున్నారా?" 


"అవును..Mr.Wetherell కారు లో" 


"అది చాలా ప్రమాదకరమైన రోడ్...అతను మంచిగా డ్రైవ్ చేయగలడని అనుకుంటున్నాను"  


"తను మంచి డ్రైవర్" 


"కావచ్చు.కాని చాలా మంచి డ్రైవర్ అయితే కాదుగా.." ముసలావిడ సందేహం అది.


"లేదు,చాలా మంచి డ్రైవర్" 


"అయితే మీరు ఒక పని చేయాలి.Bonsall Head కి వెళ్ళే మాటయితే Lady Louth కి నేను ఒక ఉత్తరం ఇస్తా.అది ఆమెకి ఇవ్వాలి" 


'మధ్య లో Lady Louth  ని తీసుకొచ్చిందేమిట్రా బాబూ,ఫ్రెండ్స్ తో జాలీ గా పిక్నిక్ వెళదాం అనుకుంటూంటే' అనుకున్నారు మిత్రబృందం.


"ఓహ్.. నాయనమ్మా,మేము ఆ దారి మీదు గా వెళ్ళము" అరిచి చెప్పింది Yvette.


"మరయితే ఏ దారి వెళ్ళేది..? ఎలా వెళ్ళినా Heanor మీదుగా వెళ్ళాల్సిందేగా " అంది ముసలావిడ.కుర్చీల్లో బాతుల్లాగా కూర్చొని ఇబ్బందిగా కదులుతున్నారు పిల్లాలంతా.


ఇంతలో Cissie ఆంటీ వచ్చింది.ఆ తర్వాత పనిమనిషి వచ్చి టీ లు ఇచ్చింది అందరికీ.అలాగే ప్లేట్ నిండా తాజా కేక్ లు కూడా వచ్చాయి.ముసలావిడ మెల్లిగా కుర్చీ పట్టుకుని పైకి లేచి,ఆంటీ చెయి పట్టుకుని టేబిల్ దగ్గరకి వెళ్ళింది టీ తాగడానికి.


అందరూ టీ తాగుతున్న సమయానికి Lucille వచ్చింది. తాను ఉద్యోగం చేస్తూన్న టౌన్ నుంచి.అలసిపోయినట్టుగా కనిపిస్తూంది.ఈ మిత్రబృందాన్ని చూసి ఆనందం గా అరిచింది.కాసేపటికి ఆ గోల సద్దుమణిగింది.


"ఏయ్..Lucille,నువు ఎప్పుడూ Mr.Wetherell గురించి చెప్పలేదేం..?" అడిగింది ముసలావిడ.


"నాకు గుర్తు రాలేదు" చెప్పిందామె.


"ఆ పేరు నాకు వింతగా అనిపించింది.అలా చేసి ఉండకూడదు నువు" 


Yvette తనకేమీ వినబడనట్లు మరో కేక్ తీసుకుని తినసాగింది.ప్లేట్ ఖాళీ కాసాగింది.ఈ ప్రవర్తన Cissie ఆంటీకి నచ్చక మొత్తం ప్లేట్ ని తన చేతిలోకి తీసుకుంది.తింటూ,మర్యాద కోసం అన్నట్లుగా " నా కేక్ కూడా తింటావా ఒకటి" అంది.


" నీకు వద్దు అనేది ఖాయమైతే అప్పుడు చెప్పు. ప్రస్తుతానికి కృతజ్ఞతలు" అంది Yvette.


(సశేషం)    


          POST NO: 8

---------------------------


ఇపుడు ఆ ప్లేట్ లో రెండు కేక్ లు మాత్రమే మిగిలాయి.Lucille అది చూసి దిగాలుగా అయిది.సర్లెమ్మని టీ తాగడానికి ఉపక్రమించింది.చేసేదేం లేదన్నట్లు గా Cissie ఆంటీ మొహం అదోలా పెట్టింది.పరిస్థితి ఇబ్బందికరం గానే ఉంది.


ఇవేం పట్టనట్లు ముసలావిడ వచ్చి కూర్చుంది.ఆ తుఫాన్ లాంటి వాతావరణం మధ్యన ఆవిడ ఇలా అన్నది.


"ఏయ్ Lucille, మీరు Bonsall Head వెళుతున్నారు గదారేపు,నేనిచ్చే ఉత్తరాన్ని Lady Louth కి అందజేస్తారని ఆశిస్తున్నా" 


"ఓ..అలాగే" అంది Lucille.చురుకు గా ముసలావిడ వైపు చూస్తూ.


' ఆ Lady Louth ఒక గొప్ప మనిషి ఈమె దృష్టిలో..!ఆవిడ ఏమన్నా కింగ్ చార్లెస్ కుటుంబానికి అధినేత్రా..? ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా ఒరుగుతుందా? ' అనుకుంది Lucille.


" ఆమె చాలా మంచి మనిషి.గత వారం ఒక Cross-Word puzzle పుస్తకం పంపించింది నాకు" అంది ముసలావిడ.


"అందుకు గాను నువ్వు ఆమెకి థాంక్స్ చెప్పావు గదా,ఇంకేమిటి?" అంది Yvette.


"కాని ఆమె కి ఓ ఉత్తరం పంపాలని నా కోరిక" అంది ముసలావిడ.


"ఓ పని చేద్దాం,పోస్ట్ చేస్తే సరి"అంది Lucille.


"అలా కాదు ,ఆమెకి తీసుకెళ్ళి ఇవ్వాలి మీరు,గతం లో ఓసారి ఆమె కలిసినపుడు.." ఏదో చెప్పబోయింది పెద్దావిడ.


ఏమి అనాలో తోచలేదు ఆ ఇద్దరు పిల్లలకి.నోరు కుట్టిన చేపలు నీటి పైకి వచ్చినట్లుగా ఉంది వారి పరిస్థితి.ఆ కేక్ సమస్య ఒహటి..దానివల్ల కూడా Cissie ఆంటీ కి ఆ ఇద్దరాడ పిల్లలకి కనబడని కోపం రగులుతోంది.పాపం ఆ Cissie ఆంటీ ఏమీ చేస్తుంది,ఆ దేవుడిని ప్రార్దించడం తప్పా..!


స్నేహితులు వెళ్ళిపోయే సమయం.ఆ ఇద్దరూ అలసిపోయినట్లు అయిపోయారు.Yvette వాళ్ళ నాయనమ్మ కేసి చూసింది.ఆమె ఏమీ పట్టించుకోనట్లు గా గంభీరం గా కుర్చీ లో వాలి కూర్చుంది. కాసేపట్లో ఆమె నోరు తెరుస్తుంది Leo Wetherell గూర్చిన ప్రతి వివరం కనుక్కోవడానికి.ప్రస్తుతానికి మాత్రం సుప్త చేతనావస్థ లో ఉంది పెద్ద వయసు వల్ల.ఆమె కి తన జీవితం ఇంకా ఇతరుల జీవితాల పట్ల గల ఆసక్తి వల్ల అలా చేస్తుంది.


పార్ట్-3


తర్వాత రోజు చాలా డల్ గా గడిచింది.రోడ్లు అన్నీ భయంకరం గా తయారయ్యాయి ,కొన్ని వారాల నుంచి వాన కురవడం వల్ల. అయితేనేం ఆ యువ బృందం తమ పిక్నిక్ ని వాయిదా వేసుకోలేదు.ఆ ముసలావిడ ఇస్తానన్న ఉత్తరాన్నీ తీసుకోలేదు.ఆమె లంచ్ చేసి మేడ పైకి వెళ్ళినపుడు చల్లగా బయటకి జారుకున్నారు. 

ఆ Lady Louth ని కలిసే సమస్యే లేదు.ఆమె భర్త Knight బిరుదు పొందిన ఒక డాక్టర్.ఇపుడు అతను కీర్తి శేషుడు.ఆమె అన్నివిధాలా మంచిదే.ఇపుడు ఆమె ఈ ఇద్దరికీ లెక్క లో మనిషి లా అయిపోయింది.


కారు లో మొత్తం ఆరుగురు యువ బృందం కూర్చున్నారు.రోడ్డు బురద గానే ఉంది.కారుని దాంట్లోనుంచే పోనిస్తున్నారు.చాలా స్వేచ్ఛ గా ఉన్నారు. వాళ్ళకి నచ్చినట్లు చేయవచ్చు.పేరెంట్స్ నుంచి ఇబ్బంది లేదు.తెంపుకోవలసిన శృంఖలాలూ లేవు.వారి జీవితపు తాళం చేతులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి.


జీవితం లోని తెరువబడని ద్వారాల్ని తెరవడం అంటే ఒక్కోసారి జైలు ని పగలగొట్టడం కంటే కష్టం.ఓ రకంగా,ఇప్పటి తరానికి ఇది ఓ వ్యధ నే..! ముసలావిడ ఉంది.మంచిదే,పాపం.కాని అన్నీ ఆమె తో కరాఖండీ గా చెప్పలేరు గదా.ఆమె చేసిన హానీ కూడా ఏమీ లేదు.ఇంకో విధం గా అనుకోవడమూ తప్పే.  

ఆ యువ బృందం పిక్నిక్ కి బయలుదేరేప్పుడు ఆమె కి చెప్పలేదు.అందరూ ఉత్సాహం గా ఉన్నారు.ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు.అయితేమాత్రం ఏముందిలే,కారు లో కూర్చోవడం ఇంకా వాళ్ళ వీళ్ళ గురించి ఏదో మాట్లాడుకోవడం ,సిల్లీ కబుర్లు..అవీ బోరే.


వాళ్ళు దాటకూడని ఆజ్ఞల్లాంటివి ఏమీ లేవు.ఆ Lady Louth కి ఉత్తరం తీసుకెళ్ళకపోవడం తప్పా..!ఆ విషయం లో వాళ్ళ నాన్న కూడా అనడు.కింగ్ చార్లెస్ కుటుంబానికి అధినేత్రి అయినా ఆయన వాటిని సరకు చేయడు.


వాళ్ళు అంతా పాడుతున్నారు.పెద్ద మధురమైన పాటలేమీ కావవి.ఏదో కామిక్ పాటలు.కారు అలా గ్రామాల గుండా పోతున్నది.దారి లో ఒక పార్క్ ఉంది.అక్కడ జింకలు గుంపులు గా ఉన్నాయి.ఆ మబ్బు గా ఉన్న మధ్యానం వేళ ఓక్ చెట్ల కింద సేద తీరుతున్నాయి.వాటికీ మనుషులతో ఉండడం ఇష్టం లా ఉంది.


Yvette కారాపమని చెప్పింది.వాటితో మాటాడ్డానికి. అమ్మాయిలందరూ రష్యన్ బూట్లని ధరించారు.తడి గా ఉన్న పచ్చిక లో నడుస్తున్నారు.జింక ఒకటి పెద్ద కళ్ళ తో భయం లేకుండా చూస్తోంది.మగ జింక ఒకటి తల వెనక్కి వంచుతూ మెల్లగా కదులుతోంది.వాటి కొమ్ముల బరువు వల్ల అలా చేస్తోంది.ఆడ జింక రెండు చెవులని బేలన్స్ చేస్తూ ,చెట్టు కింద నుంచి లేవ లేదు.అమ్మాయిలంతా చేరువగా వచ్చారు.అప్పుడు మాత్రం తోక కదిలించుతూ మెల్లిగా కదిలింది.మిగతా జింకలూ కదిలాయి.


(సశేషం)   


         POST NO: 9

--------------------------


"అవి చాలా బాగున్నాయి కదూ,అంత తడి గా ఉన్న నేల మీద ఎలా పడుకుంటాయో " Yvette ఆ లేళ్ళ మంద ని ఉద్దేశిస్తూ అరిచింది.


"ఏదో వేళ లో విశ్రాంతి తీసుకుంటాయవి,ఇదిగో ఈ చెట్టు కింద చూడు ,ఇక్కడ పొడిగా నే ఉంది" అంది Lucille అక్కడి గడ్డిని తొక్కుతూ..!ఆ సరికే కొన్ని లేళ్ళు పడుకుని ఉన్నాయక్కడ.Yvette ఆ చోట చెయ్యి పెట్టి పరిశీలించింది.


"ఔనౌను,ఇక్కడ కొంత పొడిగానే ఉన్నది"అంది చివరకి.


లేళ్ళ మందలు అన్నీ అల్లంత దూరాన పోయి నిలబడ్డాయి.మధ్యానపు వేళ.మబ్బు గా ఉంది.అవతల వేపు చూస్తే పల్లంగా ఉంది.గడ్డి,చెట్లు అంతానూ.ఇంకొద్దిగా అవతలికి ,చప్పుడు చేస్తూ ఒక నది ప్రవహిస్తోంది.దాని మీద ఉన్న బ్రిడ్జ్ ని ఒరుసుకుంటూ పోతున్నాయి నీళ్ళు.


చేరువ లో ఒక పెద్ద ఇల్లు ఉంది.Duke కుటుంబానికి చెందినది అది..!ఆ ఇంటి పైన ఉన్న ఒకటో రెండో చిమ్నీల గుండా పొగ వెలువడుతోంది.దాని వెనుక గా అడవి ఉంది.


తమ చెవుల్ని కప్పేవిధం గా ఫర్ కాలర్స్ ని లాక్కున్నారు ఇద్దరూ.ఆ చల్లటి గడ్డి నుండి వాళ్ళు వేసుకున్న రష్యన్ బూట్లు వారి పాదాల్ని సంరక్షిస్తున్నాయి. ఆ Duke యొక్క ఇల్లు నలుచదరంగా,చక్కగా ఉంది.ఒకటే ఇల్లు అక్కడ.నిశ్చలంగా,దీనంగా,దానికదే అన్నట్లుగా..!


"ఇపుడు Duke ఎక్కడ ఉండి ఉండవచ్చు" అడిగింది Ella.


" ఎక్కడైనా ఉండవచ్చు,బహుశా ఏ విదేశం లోనో,సంపద పుష్కలంగా దొరికే చోటికి వెళ్ళి ఉండవచ్చు" అంది Lucille.  


కారు హారన్ వినబడింది ఇంతలో,రోడ్డు మీది నుంచి..!


"ఏయ్ రండి,ఎంతసేపు!మనం ఆ Head దాకా వెళ్ళాలి.అక్కడినుంచి Amberdale కి వెళ్ళి టీ తాగాలా వద్దా? అలా వెళ్ళే మాటయితే తొందరగా కదలాలి" Leo అరిచాడు.


అంతా కారు లో ఎక్కారు.పాదాలు అంతా చల్లగా అయిపోయాయి.ఇపుడు వాళ్ళ కారు ముందుకు సాగిపోతూన్నది. పెద్ద శిఖరం తో ఉన్న ఓ చర్చ్ ని దాటేసింది.బ్రిడ్జ్ మీది నుంచి Woodlinkin గ్రామం లోకి వచ్చారు.పడిన వర్షం వల్ల బురద గా అయింది.అక్కడ అన్నీ రాతి తో నిర్మించిన ఇళ్ళు,వీధులు. ఒక నది కూడా పారుతున్నది.అలాంటిచోట కాసేపు ఆగి ఆనందించారు.ఆ లోయ ప్రాంతం లో రొద చేసుకుంటూ సాగుతున్నది నది.మరో వేపున పొడవాటి రాతి గుట్టలో,దట్టమైన చెట్లో కలగిలిసి మరోవైపున.


అలాంటి దట్టమైన చెట్ల మధ్య నుంచి పైకి వెళుతున్నారు.కారు మెల్లిగా బురద ని చీల్చుకుంటూ సాగుతూంది.Bolehill గ్రామం ముందు రాబోతున్నది.అక్కడ ఆ రోడ్డు చీలే దగ్గర కొద్దిగా పల్లం గా వెళితే ..అక్కడే చక్కని టీ,కేక్ ల సువాసన వస్తూంది.ఇంకొద్దిగా పోయి,ఆ చెట్ల గుండా పోతే ఖాళీ గా ఉన్న సువిశాల ప్రదేశం,కొద్దిగా కిందికి దిగితే అటూ ఇటూ ఉండీ లేనట్లు ఉన్న పచ్చిక ఉంది.రాతి తో కట్టిన గోడల నిర్మాణాలు కనిపిస్తున్నాయి.Head వేపు పురోగమిస్తున్నారు.


అంతా కాసేపు నిశ్శబ్దం గా ఉన్నారు.రోడ్డు కి అటూ ఇటూ పచ్చిక.ఆ కింది దాకా అలాగే రాతి తో నిర్మించిన గోడలు.ఒక ఎత్తైన గుట్ట వద్ద పెద్ద మలుపు తీసుకున్నది కారు.


" కాసేపు ఆగుదామా ఇక్కడ" Leo అడిగాడు.


"ఓ...అలాగే "అనారు అమ్మాయిలంతా.


తోసుకుంటూ కిందికి దిగారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి.అది వాళ్ళకి తెలిసినదే గాని Head గ్రామం దగ్గరకి వస్తే ఇది చూడవలసిందే.


ఆ పర్వతాలన్నీ చేతికి ఉన్న కణుపుల్లా ఉన్నాయి.ఆ వేళ్ళ కి కింద ఉన్నట్లుగా లోతైన ,చీకటి లోయలు. ఆ లోతున ఎక్కడో పొగలు కక్కుకుంటూ ఒక రైలు ఉత్తరదిక్కు కి పోతున్నది.ఇదొక చిన్న అధో ప్రపంచం.రైలు ఇంజన్ చప్పుడు పైకి ప్రతిధ్వనిస్తోంది.ఎక్కడో క్వారీ ని తొలుస్తున్న డు,శబ్దాలు.


Leo ఇక వేగంగా కదిలాడు,కారు ని ముందుకు దూకించడానికి.


"మరి కదులుదామా,Amberdale దగ్గర టీ తాగుతారా లేదా? లేదా మరో దగ్గిరా ?" ప్రశ్నించాడు Leo.అందరూ Amberdale కే ఓటేశారు.


"సరే...వెనక్కి వెళ్ళాలి గదా,ఎలా వెళదాం..Codnor,Crossbill మీదినుంచా  లేదా Ashbourne మీదినుంచా" అడిగాడు Leo.


అదొక డైలమా ఎప్పుడూ.Codnor మీది నుంచే వెళదాం అన్నారు అందరూ.కారు ముందుకి కదిలింది.ప్రపంచం పై నున్నట్లుగా ఉందిప్పుడు.ఒక వేపు స్వర్గం లో ఉన్నట్లుగానూ,మరోవేపు కిక్కిరిసిన పచ్చదనం మధ్య ఏదో లాగానో ఉంది.పొలాలకి సరిహద్దులు గా ఉన్న రాతి ఫెన్సింగ్ లు,మైనింగ్ జరిగిపోయిన తర్వాత మిగిలే వ్యర్ధాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఓ కుగ్రామం.కొన్ని Farms లో నల్లని గొర్రెలు మేస్తున్నాయి.పరమనిశ్శబ్దం గా ఉంది వాతావరణం.ఇదే ఇంగ్లాండ్ యొక్క పై ప్రాంతం. రాతిమయం ఇంకా నిస్సారం గా ఉంది.ముందుకు పొతుంటే చిన్న పల్లెలు.


"ఏయ్ చూడండి...అంతా రంగురంగులు గా" అరిచింది Yvette.అక్కడ రంగు రంగులు గా ఏమీ లేవు గానీ,ఎక్కడినుంచో కాకుల వంటి పక్షులు (Rooks అని ఇవి స్కాండినేవియా నుంచి,తూర్పు,పశ్చిమ యూరపు అంతటా కనిపించే ఒక రకం పక్షులు) వెనక గా ఫాలో చేస్తూ వస్తూన్నాయి.నడుస్తూ,పొలాల్లోని మొక్కల్ని ముక్కులతో కొట్టుకుంటూ వస్తున్నాయి.పొలాల్లో ఎరువు వేసినట్లుగా ఉంది.ఇపుడు కారుకి ఓ వేపున పచ్చిక,మరోవేపున రాతి గోడలు కనిపిస్తున్నాయి.


యువబృందం అంతా నిశ్శబ్దం గా ఉన్నారు.దూరంగా ఆకాశం కింద ఉన్న రాతి ఫెన్సింగ్ ల్ని,కిందికి దిగి వెళ్ళే మలుపుల్ని,కింద ఉన్న లోయల్ని గమనిస్తున్నారు.


కొద్దిగా ముందుకు చూస్తే ఒక బండి వెళుతోంది.తేలికైన బండి అది.ఆ బండికి ఓ పక్కన ఒక స్త్రీ నడుస్తోంది.పెద్ద వయసు లాగే ఉంది గానీ బలం గా ఉంది.ఆమె ఒక మూట వంటిది వెనక తగిలించుకుంది.ఆ బండి లో ఉన్న వ్యక్తి ఈమె తో మాట్లాడుతున్నాడు.పక్కపక్కనే పోతున్నారు.


రోడ్ ఇరుకుగా ఉంది.Leo హారన్ కొట్టాడు.బండి ని నడిపే వ్యక్తి వెనక్కి చూశాడు.ఆ స్త్రీ మాత్రం వెనక్కి చూడకుండా నడుస్తూనే ఉంది.బండిలోని మనిషి చూడబోతే జిప్సీ లా ఉన్నాడు.కొద్దిగా నల్లగా ఉన్నాడు.బాగానే ఉన్నాడు.తన Cap కింది నుంచి కారు లో ఉన్నవారి వేపు చూశాడు.


(సశేషం)  


        POST NO:10

----------------------------


నిర్లక్ష్యం గా ఉంది అతని చూపు. సన్నని,కొనదేలిన ముక్కు,వాటి కింద నల్లని మీసాలు.ఎరుపు,పసుపు రంగు తో ఉన్న పెద్ద హేండ్ కర్చీఫ్ ని మెడ చుట్టూ కట్టుకున్నాడు.అతని పక్కనే నడుస్తున్న స్త్రీ తో ఏదో చెప్పాడు. ఆమె క్షణం పాటు అలాగే ఆగి,కారు లో ఉన్న యువబృందం కేసి చూసింది.ఇపుడు కారు దగ్గరిగా వచ్చింది.


Leo అదే పని గా హారన్ కొట్టాడు.గోధుమ,తెలుపు రంగు హేండ్ కర్చీఫ్ ని మెడలో కట్టుకున్న ఆ స్త్రీ తీక్ష్ణం గా చూసింది.ఆ కారు కి దగ్గరి గా నడుస్తోందామె. ఆ బండి నడుపుతున్న జిప్సీ యువకుడు వెనక్కి వాలి కూర్చున్నాడు.గుర్రాపు కళ్ళేలు అలాగే పట్టుకున్నాడు.పక్కకి తొలుగుతున్న జాడ లేదు.


Leo కారు బ్రేకులు నొక్కి గట్టిగా హారన్ కొట్టడం మొదలెట్టాడు.ఆ జిప్సీ వ్యక్తి వెనక్కితిరిగి చూసి నవ్వాడు.అతని గ్రీన్ కలర్ టోపీ ఒకటి..!తను ఏదో అన్నట్లుంది గాని వినబడలేదు.చేతిని గాలిలో ఊపుతూ సైగ చేశాడు.నల్లని మీసాలకింద అతని తెల్లని పళ్ళు బయట పడ్డాయి , నవ్వుతుంటే..!


" ఏమిటది..దారి ఇవ్వు" అరిచాడు Leo.


సమాధానం గా అతను కళ్ళేన్ని లాగి బండిని ఒక వార గా నిలిపాడు. ఆ బండికి కట్టిన అశ్వం మంచి శ్రేష్టమైనదే.బండి రంగు ముదురు ఆకుపచ్చ లో ఉంది. 


Leo కి మండి పోయింది.బ్రేక్ నొక్కి వదిలాడు.


"కారు లో ఉన్న యువతులు ఎవరూ జాతకాలు చెప్పించుకోరా?" బండి ని నడుపుతున్న జిప్సీ అడిగాడు.కళ్ళ తోనే నవ్వుతూ..!అందరీ చూస్తూ,తన కళ్ళు Yvette దగ్గర ఆగిపోయాయి.ఆమె అతని వాలకం గమనించింది.Bob,Leo ల పట్ల అతను చూపే నిర్లక్ష్య వైఖరి కి ఆమె కి లోన మండిపోయింది.వాళ్ళ కంటే బలంగా ఉన్నానని తన ఆలోచనేమో..!


" మేము చెప్పించుకుంటాం జాతకాలు" Lucille గట్టిగా అరిచింది.


"ఔను,మేము కూడా" అన్నారు మిగతా ఆడపిల్లలు.


"ఇప్పుడు టైం ఎంత అవుతోందో తెలుసా?" Leo కోపంగా అరిచాడు.   


"అదెప్పుడూ ఉండేదే" Lucille అంది.


" ఇలాగయితే ఎప్పుడూ తిరిగి వెళ్ళేది?" Leo వీరావేశం తో అన్నాడు.


ఆ జిప్సీ బండి కి ఓ వేపు వేలాడుతున్నట్టుగా కూర్చున్నాడు.కాసేపాగి మెల్లిగా  కిందికి దిగాడు.సుమారు ముప్ఫై ఎళ్ళు ఉండవచ్చునేమో అతనికి.నడుముదాకా వచ్చే షూటింగ్ జాకెట్,నల్లటి ట్రవుజర్స్,నల్లటి బూట్లు,గ్రీన్ టోపీ ని ధరించి ఉన్నాడు.    


అతని ఆహార్యం తనదైన వింత అందం గా ఉంది. పరాయి వాళ్ళని పెద్దగా పట్టించుకుండా తన మానాన తను బండి లో పోతూనే ఉన్నాడు.అయితే ఇపుడు బండి ఆగడానికి సిద్ధమవుతోంది.


రోడ్డుపక్కనే ఉన్న రెండు సంచార గుడారాలు కనబడ్డాయి , పొగ వస్తోంది అక్కడినుంచి..! Yvette కారు లోనుంచి దిగింది.ఆ రోడ్డుని ఆనుకుని కింద ఉన్న ప్రదేశం లో చూస్తే,తవ్వకం ఆపేసిన క్వారీ ఒకటి కనబడింది.ఇంకా బాగా చూస్తే,మొత్తం మూడు సంచార గుడారాలు ఉన్నట్లు తేలింది.అవి గుండ్రంగా,రోడ్డు కేసి మొఖం పెట్టినట్లు ఉన్నాయి.కింద నేల మీద రాతి గులకలు,మధ్యన అక్కడక్కడ పెరుగుతున్న గడ్డి ఉన్నాయి.ఇదొక బయటకి కనబడని శీతాకాల విడిది లా ఉంది.


ఇంతలో భుజాన మూట వేసుకొచ్చిన స్త్రీ ఒక గుడారం లోకి వెళ్ళిపొయి తలుపు మూసింది.దాంట్లోనుంచి ఇద్దరు చిన్నపిల్లలు తల బైటి కి పెట్టి చూస్తున్నారు.నల్ల్టి తల వెంట్రుకలు.

 జిప్సీ యువకుడు చిన్నగా ఎవర్నో పిలిచాడు.వయసు లో పెద్ద గా ఉన్న ఓ వ్యక్తి వచ్చి బండిని విప్పుతున్నాడు.

ఆ యువకుడు ఇంకో గుడారం లో ప్రవేశించి తలుపు మూసుకున్నాడు.అక్కడే ఉన్న కుక్క Leo,Bob లని చూసి చిన్నగా గుర్రుమని శబ్దం చేసింది.అది తెల్లగా ఉంది,అక్కడక్కడ లివర్ రంగు లో ఉన్న మచ్చలున్నాయి దాని ఒంటిమీద..!


ఇంతలో పింక్ కలర్ శాలువ నో, పెద్ద కర్చీఫ్ నో తలచుట్టూ ధరించిన ఒక స్రీ వచ్చింది.ఆమె కి ఉన్న చెవి రింగులు పెద్ద గా ఉన్నాయి.లూజు గా వేలాడుతున్న గ్రీన్ కలర్ స్కర్ట్ వేసుకుంది.అందం గా, ధైర్యం గా ఉన్నది.కొంత తోడేలు లక్షణమూ కనిపిస్తోంది.    

ఇంకో విధం గా చెప్పాలంటే స్పానిష్ జిప్సీ మాదిరి గా ఉంది.


"గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్" అన్నదామె, ఆ అమ్మాయిల వేపు తినేసేట్లు చూస్తూ.ఆమె మాట వేరే ప్రాంతం ది అనేది తెలుస్తూనే ఉన్నది.


"గుడ్ ఆఫ్టర్నూన్" అన్నారు ఆడపిల్లలంతా.


" ఏ అందాల రాశి జాతకం చెప్పించుకోబొయేది, చెయ్యి ఒకసారి ఇటివ్వండి " అన్నదామె. 

ఆమె ఎత్తరి గానూ చూడటానికి భయం కలిగించేలా ఉంది, తల ముందుకు పెట్టి మాటాడుతున్నపుడు.ఆమె కళ్ళు తనకి కావాలసిన దాన్ని నిర్దయ గా వెతుకుతున్నట్లు ఉన్నాయి.ఆమెకి భర్త లా ఉన్న వ్యక్తి అనుకుంటా,గుడారం మెట్లు దిగి వస్తున్నాడు.పైప్ కాలుస్తూ.అతని చేతి లో చిన్నపిల్లవాడు ఉన్నాడు.కొంచెం దూరం లో కూర్చుని చూస్తున్నాడు.అతని చూపు వింత గా ఉంది. Yvette కి అతడిని చూస్తే భయం అనిపించింది గాని ఆ విషయం పట్టించుకోనట్లు గా మరోవైపు అంటే ఆ తెలుపు,మచ్చల కుక్క వైపు ఆసక్తి కలిగినట్లు చూడసాగింది.


(సశేషం)  


POST - 11

------------------

         

"మేం అందరం కలిపి జాతకాలు చెప్పించుకుంటే ఎంత అవుతుంది?" అడిగింది Lottie Framely అనే అమ్మాయి.


"అంటే అమ్మాయిలు,అబ్బాయిలు అందరూనా" ఆ జిప్సీ స్త్రీ ప్రశ్నించింది. 


"మీరు చెప్పించుకోండి,నాకేం వద్దు" గట్టిగా అన్నాడు Leo.


"నాకూ వద్దు,అమ్మాయిలూ మీరు చెప్పించుకోండి" Bob కూడా Leo బాటలోనే నడిచాడు.


"హ్మ్..అయితే నలుగురు అమ్మాయిలు అంతేనా...ఒక్కొక్కరూ షిల్లింగ్ చొప్పున ఇవ్వండి.మీకు అదృష్టం కలిసిరావాలంటే కొద్దిగా అదనం గా ఇస్తే మరీ మంచిది" నవ్వుతూ చెప్పింది జిప్సీ స్త్రీ.ఆ నవ్వులో అనునయం కంటే మోసకారితనమే ఉంది.ఆమె మాటలు పైకి మెత్తగా ఉన్నా  కనబడని కాఠిన్యం తో ఉన్నాయి.


" సరే...కానీ...తలా ఒకరికి షిల్లింగ్,అంతేగా...ఎక్కువసేపు వద్దు,త్వరగా తేల్చాలి " అన్నాడు Leo.


" నువ్వు మరీనూ...మొత్తం జాతకం చెప్పించుకునే వస్తాం" అరిచింది Lucille.ఆ స్త్రీ రెండు స్టూళ్ళని తీసుకొచ్చి బండి చక్రాల దగ్గిర వేసింది.Lottie Framely ని ఒకదాని మీద కూర్చోబెట్టింది.తను ఒక దాని మీద కూర్చొని ఆ అమ్మాయి చెయ్యి తీసుకుంది చెప్పడానికి.   


" అన్నట్టు నీ జాతకం అందరూ విన్నా ఫర్లేదా" Lottie మొఖం లోకి చూసి అన్నది ఆ జిప్సీ స్త్రీ.ఆ అమ్మాయి కొద్దిగా నెర్వస్ గా ఫీలయింది.


" ఫర్వాలేదులే" అంది చివరకి.


ఆ జిప్సీ స్త్రీ ఆ అమ్మాయి చేతిని పరిశీలనగా చూసింది.దానిలోని రేఖల్ని వాటిని.బాగానే అనిపించాయి.ఆమె తాపీగా చెప్పసాగింది, జాతక విశేషాల్ని..! మిగతా మిత్రబృందం ఆటపట్టిస్తున్నట్లుగా కామెంట్లు చేయసాగారు.


ఎట్టకేలకు Lottie జాతకం అయిపోయింది.తర్వాత Ella అనే అమ్మాయి వంతు.చాలా జాగ్రత్తగ వింటోంది. ఇంతలో Lucille పరిసరాల్ని గమనిస్తుంటే- సంచార గుడారం మెట్లపైనుంచే ఆ జిప్సీ అతను ఏ భావమూ లేకుండా చూస్తున్నాడు.అతను Yvette వైపే తదేకం గా చూస్తున్నాడు.ఆమె బుగ్గలు,మెడ వాటిని చూస్తున్నటుగా అనిపించింది.మళ్ళీ చూసే ధైర్యం చేయలేదు. Framely అతని వైపు చూసినపుడు,తిరిగి చూస్తున్నాడు. అందమైన ఆ జిప్సీ కళ్ళ లో కనబడని ఓ గర్వమూ ఉన్నట్లు తోచింది.అదొక వింత చూపు.


ఇక్కడ సమాజానికి దూరం గా ఉండే,ఒక వినమ్రమైన సముదాయం వీరిది.కాని అతని చూపు చట్టానికి బద్దులైన వారికి విసిరే సవాలు లా ఉంది.అతను అక్కడే ఉన్నాడు,ఓ చిన్నపిల్లవాడిని చేతుల్లో ఎత్తుకుని,తనకేం సంబంధం లేనట్లు గా ఉన్నాడు.   

ఇప్పుడు Lucille వంతు వచ్చింది, జాతకానికి.


" నువ్వు సముద్రం దాటి ప్రయాణం చేస్తావు.అక్కడ గోధుమ రంగు తలవెంట్రుకలున్న ఓ వ్యక్తిని కలుసుకుంటావు.అయితే అతను వృద్ధుడు " చెప్పుకుపోతోంది జిప్సీ స్త్రీ. 


" ఓహ్..అలాగా" గట్టిగా అంది Lucille, Yvette మాత్రం ఇదేమీ గమనించకుండా తన ధ్యాస లో తాను ఉన్నది.


"కొన్ని ఏళ్ళ తర్వాత -అంటే ఓ నాలుగేళ్ళ తర్వాత నీకు పెళ్ళవుతుంది.పెద్దగా ధన యోగం లేదు గాని ఫర్వాలేదు లోటైతే ఉండదు.దూర తీరాలు వెళతావు"  చెప్పుకుపోతోంది ఆ స్త్రీ.


"అంటే భర్తతో నా, లేకపోతే విడిగానా" అడిగిది Lucille.


"అతనితోనే" చెప్పిందామె.


ఇపుడు Lucille వంతు వచ్చింది. ఆ జిప్సీ స్త్రీ సీరియస్ గా ఈ అమ్మాయి మొహాన్ని పరిశీలించింది.  


" నా జాతకం ఇక్కడ వద్దు,అందరూ వినడం నాకిష్టం లేదు" అంది Lucille.


"అంటే నువ్వు దేనిగురించో భయపడుతున్నావు,అంతేనా" అంది ఆ స్త్రీ.


"ప్చ్..అది కాదు" 


" ఏదో సీక్రెట్ ఉందిలే,అవునా? నాకు తెలుసు,సరే పదా..ఆ గుడారం లోకి,అక్కడ చెబుతా నీకు" 


Yvette కూడా కొంచెం తిక్కది,అది ఆమె మొహం లో నే కనబడుతోంది.


"అలా చేద్దం పద" అంది.


మొత్తానికి ఆ సంచార గుడారం లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారిపుడు.ఆ మెట్ల మీద ఉన్న జిప్సీ అతనికి ఏదో చెప్పింది.అతను లోనికి వెళ్ళి మళ్ళీ బయటకి వచ్చి చిన్న పిల్లాణ్ణి ఎత్తుకుని కొంత దూరం కి వెళ్ళాడు.ఒక పెద్ద వయసు లో ఉన్నతను గుర్రాన్ని మేపుతున్నాడు,అక్కడికి వెళ్ళి నిలబడ్డాడితను.పైనున్న చెట్ల కొమ్మలు నీడనిస్తున్నాయి వాళ్ళకి.కింద ఉన్న కంకర లాంటిది చప్పుడు చేస్తోంది నడుస్తుంటే.అతను వెళ్ళేటప్పుడు Yvette కేసి చూశాడు.అతని పట్ల ఒక వింత భావం కలిగింది.


గుడారం లోకి ఇరువురూ వెళ్ళారు.Yvette యొక్క Well-cut tan coat మోకాళ్ళ దాకా వేలాడుతోంది.లోపల లేత ఆకుపచ్చ రంగు డ్రెస్ వేసుకుంది.ఆమె కాళ్ళు పొడవు గా ,స్లిం గా ఉన్నాయి. Fine wool తో తయారైన Pale and fawn stockings ని ధరించింది.


" ఎక్కువసేపు ఉండనులే" ఆ మెట్ల మీద నుంచే తన నేస్తాల తో అన్నది. ఆ జిప్సీ స్త్రీ ఏం చెప్పిందో ఏమోగాని సమయం కాస్త ఎక్కువ గానే తీసుకుంది.చీకటి పడబోతున్నది.చలి బాగా ఉన్నది.ఏదో వండుతున్నట్లు ఉంది, ఆ రెండో గుడారం దగ్గర నుంచి పొగ వస్తోంది,దానితో పాటు మాంచి వాసన కూడా..!


(సశేషం) 

        

POST NO :12

----------------------

చివరికి ఆ సంచార గుడారం యొక్క తలుపు తెరుచుకుంది.Yvette ఇంకా జిప్సీ స్త్రీ కొద్దిగా వంగుతూ దానిలోనుంచి బయటకి వచ్చారు.అంతా పరమ నిశ్శబ్దం,కాసేపు..!


"కొద్దిగా ఆలశ్యం అయినట్లుంది.మీకు బోరు కొట్టలేదుగా,ఇక వెళదామా మరి" అంది Yvette,ప్రత్యేకించి ఎవరివేపూ చూడకుండా.


"సరే,నేను డబ్బులిస్తాను గాని నువు కారెక్కు" అన్నాడు Bob.ఆ జిప్సీ స్త్రీ Jade-green రంగు లో ఉన్న పొడవైన స్కర్ట్ వేసుకుంది.మెట్లు దిగిన తరవాత ఆమె ఎత్తు ఇపుడు తెలుస్తోంది.ఏదో విజయం సాధించినదానివలె ఉంది. పింక్ రంగు కాశ్మీర్ కర్చీఫ్ జుట్టుకి ఓ వైపున కట్టుకుంది.దానిమీద పూల డిజైన్ ఉంది. ఆ మలిసంధ్య వేళ యువబృందం కేసి గీర గా చూసింది.


Bob ఆమె చేతి లో రెండు half crowns పెట్టాడు.


" ఏమిటి...ఇవేనా...ఇంకొద్దిగా ఇవ్వవచ్చుగా,ఆ అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది.కనీసం ఓ వెండి నాణెం అదనంగా...మీ అదృష్టం కోసమే చెప్తుంటా..." అదే పనిగా నస పెట్టింది ఆ జిప్సీ స్త్రీ. 


" ఆ దానికేగా షిల్లింగ్ చొప్పున ఇచ్చింది.ఆ మాత్రం చాలులే" అనేసి Bob నిశ్శబ్దం గా కార్ దగ్గరకి వచ్చాడు.మరి Yvette కి ఏమనిపించిందో ఏమోగాని ఉన్నట్లుండి కారు ఎక్కుతున్నదల్లా వెనక్కి తిరిగి ఆ జిప్సీ స్త్రీ చేతి లో ఇంకొంత డబ్బులు పెట్టింది. 

" అందాల రాశి కి అంతా మంచే జరగాలి. ఈ జిప్సీ దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి." అంది ఆ స్త్రీ. బర్ బర్ మంటూ కార్ ఇంజన్ శబ్దం చేసింది.Leo కార్ లైట్లు వేశాడు.ఆ క్వారీ ని, ఆ జిప్సీలు ఉండే ప్రదేశాన్ని దాటుకుంటూ రాత్రి ని చీల్చుకుంటూ సాగిపోయింది కారు.


" గుడ్ నైట్" అరిచి చెప్పింది Yvette.


"నీకు జాతకం ఏమి చెప్పింది,ఆ సంగతులు మాకు చెప్పాలి" అంది Lucille.


" గొప్ప థ్రిల్లింగ్ విషయాలు ఏమీలేవు.అన్నీ మామూలే,ఒక నల్ల మనిషి వల్ల మంచి జరుగుతుందని...ఒక తెల్లవాని వల్ల చెడు అని...కుటుంబం లో ఓ చావు జరుగుతుందని,23 వ ఏట పెళ్ళవుతుందని,పిల్లలతో అన్నీ ఐశ్వర్యాలతో తులతూగుతానని చెప్పింది,అన్నీ శుభమే " జవాబిచ్చింది Yvette.


"మరెందుకు ఇంకొంచెం డబ్బులిచ్చావు" 


" ఏదో వాళ్ళ దగ్గర కొద్దిగా గొప్పగా ఉండాలని ,అంతే " చెప్పింది Yvette.


PART-4

--------


చర్చ్ కి సంబందించిన "విండో ఫండ్" గూర్చి ఆ రెక్టరీ అంతా రచ్చ రచ్చ గా ఉంది.యుద్ధానంతరం, చనిపొయిన వాళ్ళ జ్ఞాపకార్ధం గా చక్కటి గ్లాస్ విండో ని ఒకదాన్ని చేయించాలని సంకల్పించారు.దీనికి నాయకత్వం వహించేది Cissie ఆంటీ. ఈ ఫండ్ ని కలెక్ట్ చేయడానికి ఆమె చాలా ప్రచారం కూడా నిర్వహించింది.


Yvette కి కూడా ఒక బాక్స్ ఇచ్చింది.డబ్బులు కలెక్ట్ చేయడానికి.అమ్మాయిలందర్నీ చేరదీసి నాటక ప్రదర్శనలు ఇప్పించింది.Yvette సైతం ఓ పాత్ర పోషించింది దాంట్లో.ఆ నాటకం పేరు "Mary in the mirror"  .అమ్మాయిలందరికీ తలా ఓ బాక్స్ ఇచ్చింది విరాళాలు అడగటానికి,అలాగే Yvette కి కూడా..!


విరాళాలు సరిపోయినన్ని వచ్చి ఉండవచ్చు అనే నమ్మకం తో ఉన్నట్లుండి Yvette ని అడిగింది.విరాళం మొత్తం ఈ అమ్మాయి దగ్గర కేవలం 15 షిల్లింగ్ లు మాత్రమే ఉన్నాయి.ఆంటీ నివ్వెరపోయింది.


" అదేమిటి,మిగతా డబ్బులు ఏమయ్యాయి?" అడిగింది ఆంటీ.


" అవసరం ఉండి తీసుకున్నాను,అయినా అదేమంత పెద్ద పైకం కాదులే" అంది Yvette.


"Mary in the mirror  నాటక ప్రదర్శనకి గాను నీ వంతు గా వచ్చిన మూడు పౌండ్ల పదమూడు షిల్లింగులు ఉండాలిగా,దాని లెక్క చెప్పు నాకు" ఆంటీ కోపం తో హుంకరించింది.


" తీసుకున్నానని చెప్పానుగదా,మళ్ళీ ఇచేస్తాలే" జవాబిచ్చింది Yvette.


Cissie ఆంటీ కి మామూలు గా మండలేదు.ఉగ్రరూపం దాల్చింది ఒక్కసారిగా..! Yvette భయం తో వణికిపోయింది.     తండ్రి కూడా సీరియస్ గా మొహం పెట్టాడు,ఇది విని.


" నీకు డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయావా? అవసరమన్నప్పుడు నేను ఎప్పుడైనా ఇవ్వలేదా?" అన్నాడాయన.


"అది పెద్ద విషయం కాదనుకున్నాను" తడబడింది Yvette.


" మరి ఆ డబ్బులన్నీ ఏమి చేశావ్" 


" అవి ...ఖర్చు పెట్టేశాను" ఆమె కి కన్నీళ్ళు వచ్చాయి.


"వేటి కోసం ఖర్చుపెట్టావ్" 


"నాకు అవన్నీ గుర్తు లేదు,దుస్తుల కోసమో..దేనికోసమో" 


పాపం Yvette.గొప్పకి పోయి అక్కడ ఇచ్చిన డబ్బులు ఇంతకు తెచ్చింది.తండ్రికి కోపం పెరిగింది.మొహం అంతా అదోలా పెట్టుకున్నాడు.కూతురు వంక చీ అన్నట్లు గా చూశాడు.లేచిపోయిన భార్య గుర్తు కు వచ్చింది.దాని లక్షణాలన్నీ దీనికి  వచ్చినయి అనుకున్నాడు.


"ఇతరులకి సంబందించిన డబ్బు ని అలా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయవచ్చా?" చాలా కోపంగా అన్నాడు.అతని హృదయం లో నమ్మకం అనేది పోయింది.దేనిపట్ల గర్వించేటట్లు లేదు.Yvette మొహం దీనం గా పెట్టింది. నా పట్ల నమ్మకమే లేదీయనకి,నేనంటే ఓ సిగ్గుపడవలసిన అంశం గా అయిపోయా అనుకుంది తనలో తాను..!

(సశేషం)    


POST NO :13

-----------------------


ఆమె పట్ల తన తండ్రి కి గల అపనమ్మకానికి కోపం వచ్చింది.ఒక్క మాట లో చెప్పాలంటే చాలా కోపం వచ్చింది.మరో వైపున ఆ తండ్రి కూడా ఏమిటి నా కుమార్తె ఇలా అవుతోంది అని చెప్పి భయపడ్డాడు.లోపల బాధ గా తోచింది.


"అయితే ఏమి చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు..?" అడిగాడు తండ్రి.


ఏమి చెప్పాలో పాలుపోక తప్పు చేసినట్లు గా తండ్రి వైపు చూసింది.ఆమె తల్లి ఎలా అయితే స్థాణువు అయిపోయి భయపడ్డట్లు చూసేదో ఈ అమ్మాయి అలాగే అనిపించింది తనకి..!అతని హృదయం లో ఓ పురుగు తోలిచిన వేదన.మళ్ళీ మరో వైపు అదెవరికైనా తెలుస్తుందేమోనని కూడా అతని ఫీలింగ్.


"హ్మ్..సరే..నేను నీకు కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇస్తాను.ప్రతి నెల నాలుగు శాతం వడ్డీ.అప్పు ఉంటే ఎలా అయినా తీర్చాల్సిందేగా.ఇదే విధంగా మరెప్పుడూ చేయకు.నిజాయితీ లేకపోవడం అనేది చాలా చెడు ప్రవర్తన కింద లెక్క" చెప్పాడు తండ్రి.


Yvette కి తల కొట్టేసినట్లయింది.తనని తాను తిట్టుకుంది,ఆ డబ్బులు ఎందుకు వాడానా అని..!


కుంచించుకు పోయింది.ఎందుకు,ఎందుకు తీశాను ఆ పైకం అని..! అవును నేను అలా చేసి ఉండకూడదు.తండ్రి కోపపడటం లోనూ అర్ధం ఉంది అనిపించింది.శరీరం ఆనారోగ్యం పాలయినట్లు తోచింది.


ఇహ తన సోదరి Lucille తనకి ఓ ఉపన్యాసమే ఇచ్చింది.


"అక్కడ ...ఆ జిప్సీ వాళ్ళ కి నువు ఇచ్చిన డబ్బులు అవేగదా...నాకు ముందు చెబితే నేను ఏర్పాటు చేసేదాన్ని గదా..ముందు ముందు పర్యవసానాలు ఎలా ఉంటాయో నువు ఊహించలేదు గదూ...ఒకవేళ అమ్మ ఉన్నా ఈ పనిని ఖండించేది ...అదే విధంగా Cissie ఆంటీ ఏదో అన్నది..అంతే" అండి Lucille.


ఎప్పుడు ఏ తప్పు జరిగినా వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది.దానితో బాటు వాళ్ళ నాన్న కి లోనున్న అసహనం పెల్లుబుకుతుంది.ఆ తర్వాత మొత్తం Saywell కుటుంబం మీదనే అసహ్యం మొదలవుతుంది.సరే..వాళ్ళమ్మ సంగతి...అది పెద్ద సంగతి.నీతి బాహ్యత తో,స్వార్ధం తో కూడుకున్న వ్యవహారం అది.అవమానం కన్నా కోపమే ఎక్కువ కలుగుతుంది.అసలు ఈ కుటుంబం లోనే ఏదీ లక్ష్యపెట్టని ఓ ధరణి ఉంది.ఆమె వెళ్ళిపోయినా ఈ పిల్లలు మాత్రం తండ్రి తోనే ఉన్నారు.ఆమె ని అంత త్వరగా క్షమించరు.


Yvette నిస్త్రాణ గా, గందరగోళం గా అయిపోయింది.తండ్రి ఆ డబ్బుల్ని Cissie ఆంటీకి ఇచ్చాడు.ఆమె లో అప్పటికే కోపం బాగా రగులుతోంది.అలా ఇవ్వకపోయినట్లయితే ...వాళ్ళ Parish magazine లో Yvette చేసిన ఈ తప్పు ని ఎడాపెడా ఏకిపారేస్తుంది.ఆమె దృష్టి లో ఇదో క్షమించరాని స్వార్ధం.


తండ్రి, తన కుమార్తె Yvette కి  లెక్కలన్నీటిని ఓ కాగితం మీద పదిలం గా రాసి ఇచ్చాడు.ఇక మీదట అతను ఇచ్చే పాకెట్ మనీ లో తాను ఇచ్చిన పైకం,దాని పైని వడ్డీ ని నెల నెలా మినహాయించుకుంటాడన్నమాట.మరి లెక్క అంటే లెక్కే.కుమార్తె చేసిన తప్పు కి ఈ తీరున అతడు చెల్లిస్తున్నాడు.


మొత్తానికి ఇలా కానిచ్చి నా భారం నేను దించేసుకున్నానని అతను లోలోన నవ్వుకున్నాడు.నిజానికి అతను డబ్బు విషయం లో మరీ అంత జిడ్డు కాదు.ఉద్దరాం గానే ఉంటాడు.అయితే దానిలోనూ ఓ పద్ధతి ఉండాలనేది అతని పాలసీ.అంతటి తో దాన్ని వదిలేశాడు.ఈ సంఘటన గమ్మత్తు గా అనిపించింది.ఎటొచ్చి తను ఇలా బటపడ్డాడు.


Cissie ఆంటీకి కోపం ఇంకా త్వరగా తగ్గలేదు.ఓ రాత్రిపూట తన సోదరి బయటకి వెళ్ళినపుడు,ఈ ఆంటీ తన గది లోకి గభాలున వచ్చి చెడామడా తిట్టింది.కాస్త అలసట గా ఉండి విశ్రాంతి తీసుకుందాము అనే లోపు  ఈమె వచ్చేసి"ఏయ్...అబద్ధాలమారి దానా...నువు దొంగవి,స్వర్ధం నిండిన జంతువా" అని తిట్టింది.ఆమె లో కోపం బుసలు  కొట్టింది.Yvette కి పూనకం వచ్చింది,అంతే లేచి జవాబు ఇచ్చేలోపులో ఆ Cissie ఆంటీ  అంతే వేగం తో దభాలున తలుపు వేసేసి వెళ్ళిపోయింది.Yvette ఒక్కసారిగా స్థాణువై పోయింది.అహం దెబ్బతింది.మళ్ళీ ఓ వైపు నవ్వు వచ్చింది. చ్హ... అనుకుంది. 


తాను కూడా ఓ జిప్సీ అయి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది.ఆ సంచార గుడారం లో ఉండవచ్చు.ఈ Parish లో అడుగు పెట్టే అవసరమే ఉండదప్పుడు. ఈ వాతావరణం అంటేనే అష్యం కలిగింది.ప్రతి ఒక్కరు కట్టిపడేసే వాళ్ళే.ఆ నాయనమ్మ దగ్గరనుంచి ఈ పనిమనుషుల దాకా..!ఆ జిప్సీలకి ఏ బాత్ రూం లు ఉండవు,ఏవీ ఉండవు.ఏ దుర్వాసన నిండిన నీటిని బయటకి పంపించే ఏర్పాటూ ఉండదు.ఇక్కడకంటే అక్కడ పరిశుభ్రమైన గాలి, ఆ మనుషుల తీరు అంతే...అనిపించిది.


(సశేషం)       

    

POST NO: 14

----------------------


ఆమె హృదయం ఆ విధంగా ఆలోచనల తో ఎగసిపడింది.అలాగే పడుకుండిపోవడం వల్ల అవయవాలు స్థబ్ధం గా అయిపోయాయి.అక్కడ జిప్సీ స్త్రీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.


"కాస్త నల్లగా ఉన్న ఓ వ్యక్తి ఉంటాడు.అతను ఎప్పుడూ మీ ఇంట్లో నివసించిన వాడు కాడు.నిన్ను అతను ప్రేమిస్తున్నాడు.నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు.ఆ నల్లని పురుషుడు నీలో జ్వాల ని రగిలిస్తాడు.చాలా మంచి జ్వాల,నీకే తెలుస్తుంది అది" అల్లా చెప్పింది.


ఆమె చెప్పినదానిలో కొంత అతి ఉండవచ్చునేమో.కాని అది పెద్ద గా లక్ష్యపెట్టవలసింది కాదు.జీవితం లో దుర్గందం నింపుకున్న ఈ రెక్టార్ కి కుమార్తె గా ఉండటం అనేది అసహ్యం గా తోచింది. ఆ జిప్సీ స్త్రీ కి చెవులకి గల పెద్ద బంగారు రింగులు ,నల్లటి కురులపై గల పింక్ స్కార్ఫ్ ,వత్తుగా ఉన్న పై దుస్తులు,ఊగిసలాడే స్కర్ట్ అన్నీ Yvette కి బాగా నచ్చాయి.


ఆమె వదనం తోడేలు కి మల్లే ఉంది.ఆమె చేతుల పట్టు ఉడుం పట్టే.Yvette వి మాత్రం సున్నితమైనవి.నిర్భీతి గా,లోపల ఏదో దాచుకున్న దానిలా ఉంది.చాలా గర్వంగా ఏ నీతి ని లక్ష్యపెట్టని దాని లా ఉంది.ఆమె ని వంచేదేది లేదు.Yvette కి ఈ రెక్టరీ లోని ఈ నీతి నచ్చలేదు.మరో వేపు వింతైన నాయనమ్మ.ఆ ఇద్దరి కొడుకుల పట్ల కూడా ఏదో సీరియస్ గా ఉంటుంది ఎప్పుడూ.కాపలా ఉన్నదానిలా..!

ఆ జిప్సీ యువకుడు గుర్తుకు వచ్చాడు.అతని విశాలమైన కళ్ళు తనని దహించే కోరిక తో చూసినాయి.ఆమె చలించినట్లయింది కాసేపు.ఏదో మత్తు జల్లినట్లు అశక్తురాలయింది.


ఆ జిప్సీ స్త్రీ కి రెండు పౌండ్ల ఇచ్చినట్లు తాను ఎవరికీ చెప్పలేదు.అది తండ్రికి గానీ ఆంటీ కి గాని తెలిస్తేనో..!పక్కమీద వేగంగా కదిలింది Yvette.ఆ జిప్సీల ఆలోచన తో కొత్త వేగం పుంజుకున్నాయి అవయవాలు.


తన బెడ్రూం లోకి Cissie ఆంటీ వచ్చి తిట్టిన వైనం ని తన సోదరి Lucille కి చెప్పింది.ఆమె కాసేపు ఉద్విగ్నమైంది. "ఆ పోనీలే...ఈ పాటికి ఆమె కూడా వదిలేసి ఉంటుంది లే.ఆమె ఎక్కడి నుంచో దిగివచ్చిందా...అదంతా డాడీ చూసుకుంటాడులే ఆమె కి ఆమే చల్లబడనీ" అన్నది Lucille.అదీ నిజమే..!రెక్టార్ దాన్ని వదిలేశాడు.Yvette ని ..పోనీలే అన్నట్లు చూస్తున్నాడు.ఇది Cissie ఆంటీ కంటికి నచ్చడం లేదు.Yvette అసలు మామూలు గానే ఎవర్నీ లెక్కపెట్టదు.ఈ వైఖరి కూడా ఆంటీ కి పిచ్చెక్కించింది. తల్లి లేని ఈ పిల్ల నా కింద ఉండి కూడా నన్ను లక్ష్య పెట్టదా అని ఆమె భావన.

Lucille కి ఈ తతంగమంతా చిర్రెత్తేలా చేస్తోంది.అసలే టౌన్ లో ఉద్యోగం చేసి ఇక్కడకి తిరిగి వస్తే రాగానే ఇవన్నీ అని..!చాలా బాధ్యత గా ఉంటుంది తను.తమ రెక్టరీ కి కావలసిన డాక్టర్ లు,మెడిసిన్స్,ఇతర సేవకులు ..ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటుందీమె.ఇదంతా చేసినా ఆ నాయనమ్మ సణుగుళ్ళూ,ప్రశ్నలు బేలన్స్ తప్పించుతుంటాయి Lucille ని.


ఆ విండో ఫండ్ వ్యవహారం అసంతృప్తి జ్వాల ని రేకెత్తించింది ఆమె లో.వాతావరణం వేడి గా అయింది.అందుకని సగం పూట లీవ్ తీసుకుని ఇంటివద్ద ఉండిపోయింది.చేసేది ఏమీ లేదు అలాగని.ఆ రెక్టార్ స్టడీ లో ఉన్నాడు.Yvette ఏదో బట్టలు కుడుతోంది.ఫ్రెంచ్ మెటీరియల్,బ్లూ రంగు లో ఉంది.కుట్టడం పూర్తవ్వబోతున్నంత లో మరింత మెరుగ్గా కుట్టమని చెప్పింది Lucille.దానితో Yvette నెర్వస్ గా అయింది.


"ఏయ్..Lucille ...ఇది బాగానే ఉందిగా,మరీ భయపెట్టకు నువ్వు" అంటూ అరిచింది సోదరిని.


"సగం పూట సెలవు పెట్టి బట్టలు కుట్టడం లో నీకు సాయపడుతున్నానా లేదా..?ఏం ...అదే నా కోసం చేసుకునేదాన్ని గా" అంది Lucille.


"మంచిది.నిన్నేమీ అడగలేదు నేను.నన్ను సూపర్ వైజ్ చేయనిదే నీకు ఏమీ తోచదు ,అంతేనా" అద్దం లో భుజాల్ని చూసుకుంటూ చేయి లేపుకుంటూ అన్నది Yvette.


"ఔనౌను,నువు ఏమీ అడగలేదు ...ఏమీ తెలీనట్టు చెప్పకు.ముక్కుతూ మూల్గుతూ " అంటూ గయ్ మంది Lucille.


"ఏమిటి నేనా...ఎందుకు...దేనికి ఎవరి గూర్చి ముక్కుతూ మూల్గింది...?" 


"అది నీకు తెలుసులే" 


"నాకా...నాకేమీ తెలీదు.అల్లా ఎప్పుడు జరిగింది" Yvette అడిగింది,ఆమె కి నొప్పి గా అనిపించింది ఆ మాట.


"ఇదిగో, ఇక నీ ఫ్రాక్ ని అసలు ముట్టను.దీనికి ఏ పనీ చేయను.నువు మంచిగా ఉండకపోతే.." కోపంగా అంది Lucille.


"ప్రతిదానికీ సాధిస్తుంటావు..నువ్వొకటి.."  సీరియస్ గా లేచింది Yvette.


" ఏయ్ Yvette..ప్రతి ఒక్కరి తో ఎందుకని టెంపర్ గా విసిగిస్తుంటావ్" అంది Lucille.


"నాకు అలాంటిది ఏమీ లేదు.తెలుసు నాకది" అలా అని Yvette,మళ్ళీ ఆ ఫ్రాక్ ని కుట్టడానికి చేతి లోకి తీసుకుంది.


(సశేషం)   


  POST-15

---------------------

 ఆమె కోపం గా , టేబుల్ దగ్గరే కూర్చుంది. ఆ సాయంత్రం మందకొడి గా ఉంది. Yvette బ్లూ కలర్ లో ఉన్న ఆ డ్రెస్ ని కుట్టసాగింది. ఆ గది అంతా ఓ వైపు కత్తిరించిన వస్త్రపు ముక్కల తో నిండి ఉంది.మరో చోట కత్తెర పడిఉంది.ఆ టేబుల్ మీద కూడా అన్నీ చిందరవందర గా ఉన్నాయి.పియానో మీద పెట్టిన ఆ రెండో అద్దం కూడా కిందపడి పగిలేలా ఉంది.


నాయనమ్మ కునికిపాట్లు పడుతోంది.అప్పుడప్పుడు గురక తో శబ్దం చేస్తోంది.మెత్త గా ఉన్న కోచ్ మీద పడుకుందా లేదా అన్నట్లు గా ఉంది. తల మీద కేప్ మాత్రం చక్కగా పెట్టుకుంది.


"కాస్త మధ్యానం అలా కునుకు తీద్దామంటే లేదు గదా..! " ఆమె తెల్లని తల వెంట్రుకలు నిమురుకుంటూ అంది నాయనమ్మ.


ఏదో బ్యాగ్ ని వెతుక్కుంటూ లోనికి వచ్చింది అంతలోనే Cissie ఆంటీ. దాంట్లో చాకెలెట్లు పెడుతుంది ఆమె.


"ఏమిటి ఆ చెత్తంతా...చూడలేకపోతున్నా..!Yvette ...ఆ చెత్తంతా శుభ్రం చెయ్యి ముందు" అంది ఆంటీ.


"అలాగే...ఓ నిమిషం లో..!" బదులిచ్చింది Yvette.  


"అంటే నీ ఉద్దేశ్యం ..ఆ పని చేయనని...అంతేగా..!" అంటూ Cissie ఆంటీ గబగబా అక్కడున్న కత్తెరని మిగతా వస్త్రపు ముక్కల్ని ఎత్తివేయసాగింది.


కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. Lucille ఏదో బుక్ చదువుతోంది. మరోవేపు ఈ తతంగాన్ని గమనిస్తూనే తలవెంట్రుకల్ని నిమురుకుంది.


"ఏయ్...Yvette...నువు వెంటనే చేయాలి నేను చెప్పిన పని" రెట్టించింది Cissie ఆంటీ.


"టీ తాగడానికి ముందు చేస్తాలే..." తాను కుడుతున్న ఆ బ్లూ డ్ర్స్ ని తల మీదుగా తిప్పుకుంటూ అంది Yvette. తర్వాత అద్దం దగ్గరకి వెళ్ళి భుజాల్ని వాటిని చూసుకోసాగింది.అదే పనిగా చేయసాగింది. అల్ల చేస్తూనే పియానో మీద ఉన్న అద్దాన్ని చప్పుడు వచ్చేలా కిందకి పడేసింది.అదృష్టం కొద్దీ అది పగల్లేదు.మిగతా వాళ్ళకి మాత్రం అదోలా అనిపించింది.


" ఆ ...ఆ అద్దాన్ని పగలగొట్టేసింది.." Cissie ఆంటీ గట్టిగా అరిచింది.


"అద్దం పగిలిందా...ఏ అద్దం, ఎవరు పగల గొట్టారు"  అంటూ నాయనమ్మ అందుకొంది.


"నేను దేన్నీ పగలగొట్టలేదు,నిక్షేపం లా ఉందది" Yvette నింపాదిగా అన్నది.     


"అయినా ఆ పైన ఎందుకు పెట్టావు దాన్ని" Lucille అంది.


Yvette అసహనం గా భుజాలెగరేసింది.ఆమె దాన్ని మరో చోట పెట్టాలని చూసింది,కాని వీలు పడలేదు.


"ఏదైనా కుట్టుపని చేయాలన్నా చేయనివ్వరు ఈ మంద...ఈ గది లో ఉండాలంటేనే నిప్పుల్లో ఉన్నట్లుంది"  అంది Yvette గీర గా.


"ఏ అద్దం గురించి నువు అన్నది" అంటూ నాయనమ్మ మళ్ళీ అడిగింది.


"ఇంకేది,మనదే...ఆ Vicarage నుంచి తెచ్చింది" అంది Yvette.


"ఎక్కడినుంచైనా గానీ...ఈ ఇంట్లో అద్దం మాత్రం పగలగొట్టకు" అన్నది నాయనమ్మ.


ఆ పిల్లల యొక్క తల్లి కి సంబంధించిన ఫర్నీచర్ అంటేనే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికీ అయిష్టమే.అందుకనే చాలామటుకు వాటిని కిచెన్ లోనూ,సర్వెంట్ల పడక గదుల్లోనూ వేసిపారేశారు.


"నాకు అద్దం పగిలితే ఏదో అవుతుందనే మూఢనమ్మకం లేదు" అంది Yvette.


"నీకు ఉండకపోవచ్చు.బాధ్యత లేని నీ లాంటి వారికి ఏమీ ఉండదులే.." బదులిచ్చింది నాయనమ్మ.  

(సశేషం)


 POST-16

-------------------

     "ఎవరి గురించా,నీకు తెలుసు వాళ్ళు ఎవరో...ఈ మృగప్రాయమైన ఇంట్లో ఆ మనుషుల గురించి నీకు బాగా తెలుసు" మండిపోయింది Yvette.


"కనీసం సగం నైతికత కూడా లేనివాళ్ళ గురించి ఏం మాట్లాడతాం.."అంది నాయనమ్మ.


ఆ మాట Lucille లో అగ్నికీలలు రగిల్చింది.జివ్వున లేచింది.ఇది రెండోసారి...ఇలాంటి నిప్పురవ్వల్లాంటి మాటలు ఆమె వదలడం..!


"నోరు ముయ్ .." అంది Lucille వాళ్ళ నాయనమ్మ ని. ఆ ముసలావిడ గుండె లో ఒక్కసారి గా ఉద్వేగం పెల్లుబికింది.  ఆ పై వాడికే ఇంకా లోపల ఎంత జరిగిందో..!


" ముందు నువ్వు అవతలికి పో..ఆ రూం లోకి పో" అంటూ Cissie ఆంటీ గాయ్ న లేచింది. కోపం తో రగిలిపోయే ఆ అమ్మాయి కి వేరే దారి లేక పై నున్న రూం లోకి దారి తీసింది.


"ఆ పెద్దావిడ కి నువు క్షమాపణ చెప్పాలి,అందాక నువు ఆ రూం లో నే ఉండు " అంది ఆంటీ. 


"క్షమాపణా..నేను అసలు చెప్పను" ఆ రూం లోకి వెళ్తూ ఖచ్చితం గా చెప్పేసిందిLucille.


Yvette ఇదంతా గమనిస్తూ నిర్ఘాంతపోయింది.ఆమె చేతి లోని డ్రెస్ సగం కుట్టి ఉంది.తల్లి గూర్చి నాయనమ్మ చేసిన వ్యాఖ్య ఈమె లో కూడా కోపం కలిగించింది.


"నేను ఏమి తప్పు మాట అన్నానని..తప్పేం అనలేదుగా..." నాయనమ్మ గునిగింది.


"అనలేదా..?" రెట్టించింది Yvette.


"మేం ఇంకా చెడిపోలేదు అన్నాను,అద్దం పగల గొట్టడం మంచిది కాదని నా అర్ధం" అంది ముసలావిడ.


Yvette కాసేపు తన చెవుల్ని తాను నమ్మలేకపోయింది.ఇంత వయసు వచ్చిన నాయనమ్మ అంత అబద్ధం ఆడవచ్చునా అనిపించింది.చాలా తెలివి గా తనని కవర్ చేసుకుంది.


అంతలోనే తండ్రి వచ్చాడు.


"ఏమిటి..ఏం జరిగింది..?" అడిగాడు అతను.


"ఆ..ఏమీ లేదు, Lucille కి కోపం వచ్చి నాయనమ్మ ని నోరు ముయ్ అన్నది.అందుకని ఆమె ని ఆంటీ ఓ రూం లోకి పంపించి వేసింది" చెప్పింది Yvette.


ఆ ముసలావిడకి Yvette చెప్పేది పూర్తి గా వినబడలేదు.కాని అంతలోనే కలగజేసుకుని అన్నది" Lucille కి కోపం మైఇ ఎక్కువ అవుతోంది.అద్దం కింద పడితే మంచిది కాదని నేను Yvette కి చెప్పాను.ఈ పాడు ఇంటి లో అన్నీ మూఢ విశ్వాసాలే అన్నది.అప్పుడు నేను ఈ ఇంట్లో వాళ్ళు ఇంకా పాడవలేదు అని అన్నాను.నేను అన్నది కేవలం అద్దం గురించే,దానికి Lucille రగిలిపోయి నన్ను నోరు ముయ్ అన్నది,ఈ పిల్ల వైఖరి చూస్తే చాలా అవమానం గా ఉంది.." అంటూ తన ఆవేదన వెళ్ళగక్కింది ముసలావిడ.


అంతలోనే ఆంటీ వచ్చింది. కాసేపు నిశ్శబ్దం గా ఉండి తరవాత నోరు విప్పింది.


"క్షమాపణ చెప్పేదాకా Lucille ని గది లోనుంచి బయటకి రావద్దని చెప్పాను " అన్నది ఆంటీ.


"ఆమె క్షమాపణ చెప్పడం నాకు అనుమానమే" అంది Yvette.


"నాకు ఎవరి క్షమాపణా వద్దు.అయినా ఇంత చిన్న వయసు లో అంత తెంపరితనం ఉందే...అది మాత్రం మంచిది కాదు.అది ఎక్కడికి దారి తీస్తుందో అన్నదే నా బాధ, అది సరే...అబ్బాయి కి టీ ఇవ్వు" అంది ముసలావిడ.


Yvette తను కుట్టే డ్రెస్ ని అలా కొనసాగిస్తూనే పై రూం లోకి వెళ్ళసాగింది.ఏదో కూని రాగం తీసుకుంటూ..!లోపల భయం గానే ఎటు పోయి ఎటు వస్తుందో అని.


"ఏమిటి సరికొత్త డ్రెస్సా" అడిగాడు తండ్రి కుమార్తె కుట్టే ఆ వస్త్రాన్ని చూసి.


"అవును" అని బదులిచ్చి ఆమె పై రూం లోకి వెళ్ళసాగింది.పైకి వెళ్ళి సోదరి ని ఓదార్చాలనేది ఆమె ఆలోచన.తను కుడుతున్న డ్రెస్ ఎలా ఉందో కూడా అడుగుతుంది.


పోతూ...పోతూ...పైనున్న కిటికీ లో నుంచి బయటకి చూసింది. రోడ్డు,బ్రిడ్జ్..!ఎవరో ఒకరు అక్కడనుంచి ఆనందం గా పాడుకుంటూ వస్తున్నటుగా తాను ఎప్పుడూ ఊహించుకుంటూ ఉంటుంది.లేకపోతే ఆ పక్కనే ఉన్న నది దగ్గర అలాంటిది ఏదో జరుగుతుందని తను ఊహిస్తూ ఉంటుంది.


(సశేషం)  


    POST NO:17

-------------------------


టీ వేళ అది..! మంచు బిందువులు కురుస్తున్నాయి ఇంటి బయట..! తోటమాలి పూలమొక్కలకి నీళ్ళు పెడుతున్నాడు.పాదుల మొదళ్ళ లోకి నీటి పాయలు చేరుతున్నాయి.అవతల రోడ్డు బయట చూస్తే కొద్దిగా బురద గా ఉంది.రాతి బ్రిడ్జ్ ఒంపు తిరిగే దగ్గర ,దారి కాస్తా ఎత్తు లో ఉన్నట్లు గా ఉంటుంది.ఇళ్ళు అక్కడక్కడ గుంపులు గా ఉంటాయి.రాతి నేల అక్కడక్కడ కనిపిస్తుంది. పొగచూరినట్లుండే ఓ గ్రామం అది,ఉత్తరాది గ్రామం. కొన్ని మిల్లులు కూడా ఉన్నాయి,అవీ రాతి తో నిర్మించినవే. వాటికి ఉన్న చిమ్నీలు చాలా ఎత్తు గా ఉన్నాయి.


ఆ రెక్టరీ అంతా ఎత్తు గా, లోయ లాగా ఉండే ప్రదేశం లో ఉంటుంది.కొద్దిగా కింది కి వస్తే ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది.గ్రామానికి ఆవలి ఓ వేపు మరో ఒడ్డు..!రకరకాల పొదలు,మొక్కలు...వాటి వెనుక నుంచి అక్కడున్న రోడ్డు కనుమరుగవుతుంది.వీళ్ళ ఇంటి ముందునుంచే ఆ నది ప్రవహిస్తుంది.ఆ ప్రవాహం ఉన్న ఒడ్డు కాస్త పొడుచుకు వచ్చినట్లుగా ఉండి పొదల తోనూ వాటితోనూ నిండి మళ్ళీ కిందికి దిగినట్లుగా ఉంటుంది.దట్టంగా ఉండే వన వృక్షాలు,రాతి దిబ్బలు అక్కడక్కడ..!


Yvette అక్కడున్న పొదలవంక ,ఆ రోడ్డు ఒంపు తిరిగే దగ్గర చూసింది కిటికీ లోనుంచి..! ఆ Papplewick గ్రామం లో ఆ మొదట్లో కొన్ని ఇళ్ళు గుంపులు గా ఉంటాయి.అక్కడ నుంచి ఎవరైనా వస్తారా,ఏదైనా జరుగుతుందా అని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది.ఎప్పుడైనా ఒక బండి వస్తుంది. లేదా ఓ మోటారు బండి లేదా శ్రామికుల్ని రాతి క్వారీ ల్లోకి తీసుకెళ్ళే లారీలు కనిపిస్తాయి.కోయిల మాదిరి గా తీయని పాట పాడుకుంటూ ఆ నది పక్కనుంచి ఎవరూ రారు.ఆ రోజులు పోయినట్లున్నాయి.     

అయితే ఈరోజుతల ఊపుతున్నాడు గాలికి..! రోడ్డుకి ఆ మూల మలుపు నుంచి ఓ గుర్రపు బండి వస్తూన్నట్లు గా అగుపించింది. బండి తోలే అతను Capపెట్టుకొని ఉన్నాడు.ముందు వేపున ఓ వార గా ఉన్నాడు.కుదుపులకి అటూ ఇటూ కదులుతున్నాడు.ఆ మధ్యానం డల్ గా ఉంది.ఈవేళప్పుడు ఈ గుర్రపు బండి ఎవరిదబ్బా..! బండి వెనుక చీపురుకట్టలు ఉన్నాయి.వాటి చివరలు గాలికి ఊగుతున్నాయి.Yvette కిటికీ కర్టెన్ ని అవతలకి జరిపి చూసింది.


ఆ బండి బ్రిడ్జ్ లోతట్టు కి చిన్నగా దిగుతోంది.టక్ టక్ మని గుర్రపు అడుగుల చప్పుడు.ఆ చీపురు కట్టల లాగే,బండి ముందు కూర్చున్నతను!కల మాదిరి గా ఉంది.ఇపుడు బండి బ్రిడ్జ్ చివరిని దాటేసింది.రెక్టరీ గోడ వార గా నడుస్తోంది. గేటు కి అవతలవేపు గంభీరం గా ఉన్న రాతి భవంతి ని చూశాడతను.కొండకి కిందిగా ఉందది.Yvette సర్దుకుంది. ఆ Cap చివరి నుంచి అతను ఈమెని చూశాడు.  

ఆ తెల్లని గేటు ని తీశాడు. పైకి చూశాడు.కిటికీ వేపు.Yvette వెంటనే కిటికీ లోనుంచి చూసింది.అతను తల పంకించాడు చూసినట్లుగా..!గుర్రపు బండి ని ఓ పక్కగా నిలిపాడు.గడ్డి ఉన్న చోట. రెండు మూడు చీపురు కట్టలు బండి లోనుంచి తీసుకొని ఇంటి వేపు వస్తున్నాడు.అతను Yvette వేపు చూసి గేటు తీశాడు.


ఆ..అన్నట్లుగా తలాడించింది Yvette.ఆ వెంటనే బాత్ రూం లోకి వెళ్ళింది.బట్టలు మార్చుకోవడానికి. తను,ఇంట్లో పనిమనిషి ఒకేసారి ముందు గది లోకి వచ్చారు.


"చీపురు అమ్మే మనిషే కదూ తను" అంటూ తలుపు ని తెరిచింది Yvette.


"ఆంటీ ...చీపురు అమ్మే మనిషి వచ్చాడు..." అంది మళ్ళీ తనే.


"ఎలాంటతను.." అడిగింది Cissie ఆంటీ. ఆమె రెక్టార్ తోనూ ,తల్లి తోనూ కలిసి టీ సేవిస్తోంది.


"బండి మీద వచ్చాడు" అంది Yvette.


"జిప్సీ మనిషి" అంతలోనే అంది పనిమనిషి.


ఆంటీ లేచి వచ్చింది.ఆ జిప్సీ అతను కొద్దిగా తలుపు కి అవతల నిలుచున్నాడు.ఓ చేతి లో చీపుర్లు,మరో చేతి లో తళ తళ లాడే రాగి ఇత్తడి పాత్రలు పట్టుకుని నిల్చున్నాడు.చాలా శుభ్రంగా ఉన్నాయవి. తలమీద పెట్టుకున్న టోపీ ఆకుపచ్చ రంగు లో ఉంది.అదే రంగు చెక్ కోటు వేసుకున్నాడు.మర్యాద గా ,ప్రశాంతం గా ఉన్నాడు.అదే సమయం లో కొంత అతిశయం గానూ ఉన్నాడు.


"ఏవైనా కావాలా మేడం ఈరోజు" Cissie ఆంటీ వేపు చూస్తూ అడిగాడు. అతడిని చూసి ఆమె కలవర పడింది.సాధారణం గా రఫ్ గా ఉండే మగవాళ్ళని చూస్తే ఆమె వెంటనే తలుపు మూసి వేస్తుంది.మొత్తానికి ఇతని వాలకం ఈమె కి నచ్చినట్లుంది.తడబాటు పడింది. 

" ఆ Candlestick బాగుంది కదూ..నువ్వే చేశావా..?" అడిగింది Yvette. చాలా అమాయకత్వం నటిస్తూ అడిగింది.


"అవునండీ" అన్నాడతను. ఏదో మంత్రం వేసినట్లు క్షణకాలం పాటు చూసి..!


"బావుంది.." గొణిగింది Yvette.


Candlestick యొక్క మొదలు కాపర్ తో చేయబడింది.కింద దానికి రెండు పాత్రలు అమర్చినట్లు ఉన్నది.అతను Yvette వేపు చూడకుండా చాలా మర్యాద గా మసలుతున్నాడు.ఆ గుమ్మం దగ్గర నిలబడి Yvette అలానే చూడసాగింది. Cissie ఆంటీ లోపలికి వెళ్ళగానే Yvette గభాలున అడిగింది " నీ భార్య వాళ్ళు ఎలా ఉన్నారు" అని..!

ఆంటీ లోపలికి వెళ్ళి మిగతావాళ్ళకి ఆ Candlestick చూపించి దాని గురించి అడుగుతోంది.


(సశేషం)    


    POST NO:18

-------------------------


ఆ జిప్సీ వ్యక్తి Yvette వేపు చూశాడు.అతని పెదాల పై ఓ చిరు దరహాస రేఖ కదిలింది. కళ్ళు మాత్రం నవ్వలేదు. వాటిలోని వేడి ఆ చూపు లో ఘనీభవించింది.


"ఆమె బాగానే ఉంది.అన్నట్టు మళ్ళీ అటువేపు ఎప్పుడు వస్తున్నావు?" గొణిగినట్లు అన్నాడు.


"ఏమో నాకు తెలీదు" Yvette వినీవినబడనట్లు అంది.


"నేను ఉన్నప్పుడు అదే శుక్రవారం రాకూడదూ" అన్నాడతను.Yvette ఎటో చూస్తున్నట్లు గా అతని భుజం పైనుంచి అవతలకి చూసింది.ఇంతలో Cissie ఆంటీ వచ్చింది.డబ్బులు ఇవ్వడానికి..! Yvette ఏమీ ఎరగనట్లు గా ఏదో కూనిరాగం తీసుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది.


ఆ కిటికీ వద్దనే నిల్చుని,అతను వెళుతుండగా చూసింది.తన మీద అతని జాలమేదైనా పనిచేస్తోందా ...ఏమైనా కానీ...అతను వెనుదిరిగి చూడకుండా ఉంటేనే బాగని తలచింది.


చీపుర్లు,పాత్రలు అన్ని తన బండి లో ఒద్దిక గా సర్దుకున్నాడు.వాటి మీద టార్ఫలిన్ కప్పాడు.బండి ముందు కి వెళ్ళి గభాలున పైకి దూకి కూర్చున్నాడు.గుర్రం కదిలింది. చక్రాలు శబ్దం చేస్తూ కదిలాయి.అతను వెనుదిరిగి చూడలేదు. అంతా కల లా జరిగిపోయింది.నమ్మలేకపోయింది.


"లేదు,తన మీద అతని జాలమేదీ లేదు" అనుకుంది తనలో తను.ఎవరో ఒకరి జాలం తనపై పనిచేయాలని తన కోరిక.


Lucille దగ్గరకి వెళ్ళింది మాటాడదామని.


"ఏమైందని, నాయనమ్మ నోరు మూసుకో అని నిన్ను అన్నదే అనుకో.ఆమె నిన్ను కావాలని ఏమీ అనలేదులే,దానిలో పెడార్ధాలు తీయడానికి ఏమీ లేదు.సరే...పద...చక్కగా డ్రెస్ చేసుకొని మహరాణుల్లా భోజనానికి వెళదాం" అంది Yvette తన సోదరి తో,అనునయిస్తున్నట్లుగా..!  


 ఇపుడు Yvette వదనం వింతగా ఉంది.తెలియని ఏదో ఆనందం. Lucille కి కూడా విచారం కరిగిపోసాగింది. మొత్తానికి Lucille ని విజయవంతం గా కరిగించింది చెల్లాయి. ఇద్దరూ చక్కని డ్రెస్ లు వేసుకున్నారు. అక్కా గ్రీన్ సిల్వర్ లో ఉన్న డ్రెస్,చెల్లి లిలియక్ కలర్ డ్రెస్ లు వేసుకున్నారు.మంచి పౌడర్ ఇంకా చక్కని స్లిప్పర్ లు ...ఏదో విందుకి అన్నట్లు తయారయ్యారు.స్వర్గలోకపు తోట విరబూస్తున్నట్లుగా ఉంది.Yvette కూనిరాగం తీస్తోంది.అన్నివిధాలా ఓహో అన్నట్లు ఉన్నారు.


"సరే..బాగానే ఉన్నాను నేను,ఇంకా నువ్వు కూడా.ఏదో కోపం లో ఉన్నట్లున్నావు. నువు గంభీరం గా ఉంటావు ,ఆ ముక్కు వల్ల..! మొత్తానికి కోపం గా ఉన్నా సూపర్ అనుకో..ఒప్పుకున్నావా లేదా" Lucille వైపు తిరిగి అంది Yvette.


అవును తను సింపుల్ గా ఉంటుంది.వేరే విధంగా కనబడగూడదనే ఫీలింగ్ ఆమెలో ఉంది.ఆమె లోని అంతహ్ సౌందర్యం అది రహస్యమైనది.చక్కగా డ్రె వేసుకొని ముస్తాబైంది.ఆ జిప్సీ వ్యక్తి ప్రభావం అనుకుంటాను.బలీయమైన ఆమె కన్యత్వాన్ని అతను పరికించిన వైనం అది.మిగతావన్నీ కాదు.


ఇద్దరూ కిందికి దిగివచ్చారు.భోజనాలకోసం. వాళ్ళ తండ్రి ఇంకా అంకుల్ మాటలు వినబడి వాళ్ళు ఆగారు.Yvette ముస్తాబయి యువరాణి లా ఉంది.ఏదో మతిమరుపు లా ఉంది.Lucille సిగ్గు తో ఉన్నట్లు గానూ ఆనందబాష్పాల తోనూ అగుపించింది.


"ఏమిటి ఎక్కడికి వెళుతున్నారు...చక్కగా తయారయ్యారు. ఆ డార్క్ బ్రౌన్ స్పోర్ట్స్ కోటు ల లోనే ఉన్నారు.ఏమిటీ విషయం..?" అన్నది ఆంటీ.


"కుటుంబం అంతటితో కలిసి భోజనం చేస్తున్నాం,మీ గౌరవార్ధమే ఈ డ్రెస్ లు" అన్నది Yvette అమాయకంగా.


తండ్రి నవ్వాడు,పెద్దగా.


"కుటుంబం అంతా గౌరవంగా ఫీలవుతోంది" అన్నాడు అంకుల్.   


ఇద్దరు పెద్దలూ ఆనందించారు. Yvette కి కావాలసింది అదే.


"ఏదీ మీ డ్రెస్ ల్ని నన్ను చూడనివ్వండి, ఇంతమంచి డ్రెస్ చూడక పోతే ఎలా" అంది నాయనమ్మ.


"ఈరోజు భోజనాలకి మన స్వహస్తాల తో వీళ్ళ ని గౌరవం గా నడిపించుకెళదాం,సరేనా" అన్నాడు Fred Uncle. ఆంటీ తో..!


"తప్పకుండా,అన్నిటికన్నా ముందు యూత్ అండ్ బ్యూటీ" అంది నాయనమ్మ. తండ్రి సంతోషించాడు. Lucille ని తండ్రి ,Yvette ని అంకుల్ చెయ్యి పట్టుకుని మరీ తీసుకెళ్ళారు.


భోజనం ఎప్పటిలాగానే ఉంది. Lucille ఉత్సాహం గా ఉండాలని ప్రయత్నించింది. Yvette ఎప్పుడూ అలానే ఉంటుంది. 


"ఏమిటో మేమూ ఈ ఫర్నిచర్ లో ఓ భాగమే అనిపిస్తోంది తప్పా ఏదీ ఓ పట్టానా నచ్చడం లేదు మాకు" తనలో తను అనుకుంది Yvette. 


ఇక్కడనే కాదు చర్చ్ లో ఉన్నా,పార్టీ లో ఉన్నా,సిటీ లో డాన్స్ కార్యక్రమం లో మనసు లో ఇదే ప్రశ్న బుడగ లా ఉబికి వస్తుంది.తాము ఎవరికీ ముఖ్యం కాదు అనే భావన -చాలా చికాకు కలిగిస్తుంది.


జిప్సీ గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు.పెద్దగా పట్టించుకోవలసిన వ్యక్తి కాదు తను.


"శుక్రవారం దగ్గరకి వస్తోంది.ఆ రోజు ఏం చేయబోతున్నాం మనం..?" Lucille ని అడిగింది.


"చేసేది ఏమీ లేదు" అన్నదామె. Yvette కి అలిసిపోయినట్టనిపించింది. శుక్రవారం వచ్చింది.ఆమె ప్రమేయం లేకుండానే 'బోన్సెల్ హెడ్' కి ఆవల ఉన్న క్వారీ వేపు వెళ్ళడం గూర్చి ఆలోచిస్తున్నదామె.అక్కడకి వెళ్ళాలని ఉంది.అదీ గాక ఇప్పుడు మళ్ళీ వాన పడుతోంది.రేపు Lambley Close వద్ద జరిగే పార్టీకి వేసుకోబోయే బ్లూ డ్రెస్ కుట్టడం పూర్తయింది.ఆ దేశ సంచారం చేసే బండ్ల మధ్య ,ఆ క్వారి, ఆ జిప్సీ ల మధ్య ...అక్కడే తన మనసు తిరుగుతోంది. శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నది.


రేపు జరగబోయే పార్టీ లో తాను లియో కి ప్రియమైన వ్యక్తి కాబోతున్న ఆలోచన ఆమెకి లేదు.Ella Framely నుంచి తను అతడిని తన్నుకుపోతున్న సోయీ లేదు. ఆమె అక్కడ Pistachio ice తింటూండగా అతను ఇలా అన్నాడు.


"మనం ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోకూడదు Yvette..?  అది సరైన విషయం ఇద్దరికీనూ"


లియో మంచి స్థితిమంతుడు. Yvette కి కూడా అతనంటే ఇష్టం.కాని ఎంగేజ్మెంట్ అనేసరికి సిల్లీ గా అనిపించింది. ఆమె సిల్క్ అండర్వేర్ జత ని అతనికి బహుమతి గా ఇస్తున్నట్లు గా అనిపించింది.


"నీకు Ella యే సరి అయిన జోడియేమో.." అంది Yvette.


" కావచ్చు.కాని నీకు ఆ జిప్సీ జాతకం చెప్పినదగ్గరనుంచి...నీకు నేను...నాకు నువు ...అలా అనిపిస్తున్నాయి నువు చేసే పనులు.."


నిజంగానా" ఆశ్చర్యం గా అందామె.


"నీకు అలా అనిపించడం లేదా.." అన్నాడు లియో.


"నిజమా" చేప లా మెత్త గా రొప్పుతూ అన్నదామె.


"నీకు కొద్దిగా అలానే అనిపిస్తోంది,కాదంటే చెప్పు"


"అంటే దేని గూర్చి" 


"నీ గురించి నేను ఎలా ఫీలవుతున్నానో నా పట్ల నువు అంతే గదా" అన్నాడతను.


(సశేషం) 

      

         POST NO:19

--------------------------


" ఏమిటి...అంటున్నది..? ఎంగేజ్మెంటా...నాతోనా..? అలాంటిది కలలో కూడా ఊహించలేను" అంది Yvette. అతను ఏమనుకుంటాడు అనేది పట్టించుకోకుండా ఓ నిజాయితీ తోనే అన్నది.


"అందుకలా అంటున్నావు?" Leo బాధపడినట్లుగా అన్నాడు.


"నీ ఉద్దేశ్యం ఇప్పుడనేనా?" అన్నదామె. చాలా మెత్తగా, తన తీరు లో తాను చెప్పింది.తనకి ఎవరు మిత్రులైనా,శత్రువులైనా ఆ ధోరణి వల్లనే..!మ్యూజిక్ ప్రారంభమయింది.అతను ఆమె కేసి చూశాడు.


"నేను ఇప్పుడు ఇక డాన్స్ కి రాలేను" జనాల వేపు చూస్తూ మొహం అటు తిప్పుకుంది. ఏమిటో అర్ధం కాని వైఖరి ఆమెది.సున్నితం గా,నిరాసక్తం గా ఉన్న ఆమె మోము తండ్రి ని గుర్తుకు తెచ్చేలా ఉంది.


"అఫ్కోర్స్...నువు డాన్స్ చేయడానికి ఇంకెవరినన్నా పిలువు.." కొద్దిగా గీరగానే అంది Yvette. 


Leo కోపం గా లేచి గదిలోకి వెళ్ళిపోయాడు.


Leo ఆమెకి ప్రపోజ్ చేయడం అనేది ఆశ్చర్యమనిపించింది.ఒక న్యూ ఫౌండ్ లాండ్ కి చెందిన కుక్క ప్రపోజ్ చేసినట్లు గా అనిపించింది.అసలు ఎంగేజ్మెంట్ అనేది...అది ఎవరితో అయినా గాని...తన ఊహలో అది హాస్యాస్పదమైనది.  


ఆ వెంటనే ఆమెకి జిప్సీ గుర్తుకు వచ్చాడు.కోపంగా ఫీలయింది. అతడినా...చీ...చీ...అసంభం అనుకుంది.ముమ్మాటికీ అది జరగనిది.డాన్స్ చేస్తోన్న యువకుల్ని చూసింది.ధ్యాస రకరకాలుగా పోయింది.ఆమె సమస్య ఏమిటో ఆమెకే అర్ధం కావడం లేదు. వాళ్ళ ...ఆ యువకుల వాటమే తనకి నచ్చడం లేదు. వాళ్ళ వంటి పై నీటుగా ఉన్న కోట్లు ధరించారు.


" నాకు సంబందించిన ఒక విషయం మాత్రం వీళ్ళకి ఎపుడూ అర్ధం కాదు..." తనలో తను అనుకుంది.పోనీలే జీవితం ఇలా ఉంది అని రిలీఫ్ గా అనిపించింది.


ఊహల్లో తేలియాడింది.డార్క్ గ్రీన్ జెర్సీ,బ్లాక్ ట్రవుజర్స్ వేసుకున్న జిప్సీ ని ఊహించింది.చక్కని ,చురుకైన కటి భాగము,అతని కళ్ళని తలచింది.అవన్నీ బాగా అనిపించాయి.వాటితో పోలిస్తే ఈ డాన్స్ చేసే యువకులు ఏదో మాంసం ముద్దల్లా ఉన్నారు. Leo కూడా అంతే..!కాని తనని తాను మెర్గైన డాన్సర్ గా ఊహించుకుంటాడు.


కొసదేరిన ముక్కు,సుతారం గా కదిలే పెదాలు...అంతే ఇదిగా అనిపించే నల్లటికళ్ళు,ఇవన్నీ కలిసి ఆమెని ఎక్కడో బలమైన చోట తాకాయి.


ఆమెకి కోపం వచ్చింది.అలా తనవేపు చూడటానికి ఎంత ధైర్యం..?డాన్స్ చేస్తున్న వాళ్ళ వేపు కోపం గా పరికించింది.వీళ్ళంతా ఏమిటో...చికాకు లేచింది.జిప్సీలు కాని వారంటే ఆ జిప్సీ స్త్రీలకి ఎంత చిరాకో...!

వీళ్ళంటే తనకి ఎందుకు నచ్చడం లేదు..? ఇంటి కుక్క నచ్చదని అంటారే...అలానా?


సుతారం గా ఉన్న ముక్కుని ఎగబీల్చింది.పుష్పం లా ఉన్న ఆమె మోము పై మెత్తటి ఆమె జుట్టు నాట్యం చేస్తోంది. అచ్చమైన కన్య లా,వినోదం చూస్తోంది.ఒక బారు గా ఉండే అమ్మాయే కాదు ఒక మంత్రగత్తె కూడా ఉంది తనలో..!అది చూస్తే ఇంటి కుక్కలకీ సిగ్గేనేమో..ఊహించలేని విధం గా మారిపోయింది తను..!


ఈ courting వల్లనే అనుకుంటా ఒంటరి అయినట్లుగా అనిపిస్తోంది.Leo డాన్స్ నుంచి తిరిగి వచ్చాడు.మంచి ఉత్సాహం గా ఉన్నాడు.


"నువ్వు కొద్దిగా ఆలోచించాలి.ఆ అవసరం ఉందా లేదా" ఆమె ప్రక్కనే కూర్చుంటూ అడిగాడు Leo. అన్ని విధాలా తను సరైన వాడు అని అతని నమ్మకం.మోకాళ్ళ దాకా లాగిన అతని ప్యాంట్ ఆమెకి చిరాకు పుట్టించుతున్నది.కాళ్ళు మామూలు గా ఉంటాయి.మిగతావి ఓకే,కుర్చీ లో కూర్చుంటే ఫర్లేదు.


"నేనా...దేని గురించి" అన్నదామె అస్పష్టం గా.


"నువ్వు నిర్ణయించుకున్నావా " అడిగాడతను.


"దేని గురించి" అమాయకం గా అంది. నిజం గానే తను పరధ్యానం లో ఉంది.


"మన ఎంగేజ్మెంట్ గురించి" సర్దుకుంటూ అన్నాడు.


"అదా..అసంభవం..అలాంటివి ఏవీ నన్ను అడగకు" చిన్నపిల్ల నొక్కి చెప్పినట్లు గా అన్నది.        

"అంటే అంత ఇదిగా ఉందా? వృద్ధ మహిళ గానే చనిపోతావా ఏమిటి..?" ఒకలా నవ్వుతూ అన్నాడు Leo.


"అలా అయినా బాధ లేదు" అన్నదామె.


"కాని నాకలా కాదు" అన్నాడు.


అతనివేపు తిరిగి ఆశ్చర్యం గా చూసింది.తర్వాత అంది. "నాకు నచ్చినట్లు నేను ఉంటే నీకేమిటి బాధ " అని.


"చాలా ఉన్నాయి" అర్ధవంతమైన చిరు నవ్వుతో అన్నాడు.


మరీ ఆమె ని ఇబ్బంది పెట్టేలా చూడకుండా ...పైపైన నవ్వుతో నిగూఢార్థం వచ్చేలాన్నాడు.ఒకవేళ తను రూడ్ గా పోతే దాని ఫలితం ఆమె కోపాన్ని మళ్ళీ చవి చూడటమే అవుతుంది.


"అవతల నీ కోసం అరడజను అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు.నీ పొగడ్తలకి పొంగిపోను.ఇది ఎవరికైనా తెలియడం కూడా నాకు అసహ్యం...అక్కడ Ella ..లాంటి వాళ్ళు ఉన్నారు గదా" అన్నది Yvette. అలా అనేసి మొహం తిప్పుకొని Ella Framely వేపు నాజుకు అయిన పుష్పం లా జారుకుంది.Leo కోపంగా గ్లోవ్స్ ని టప టప శబ్దం చేశాడు విప్పి. "Dirty bitch 

మనసు లో తిట్టుకున్నాడు.

 (సశేషం) 


 POST NO:20

-----------------------


ఆ తర్వాత వారం మళ్ళీ కుండపోత వాన ..! ఆ విధంగా ఉంటే Yvette కి చిర్రెత్తుకొస్తుంది.కనీసం వారాంతం లో అయినా వాతావరణం బావుంటుందని ఆశించింది.ఎందుకు అలా అంటే మాత్రం తాను చెప్పలేదు.


గురువారం సగం పూట సెలవు.ఎప్పటిలాగానే Leo కారు వేసుకుని వచ్చాడు.ఆమె కి ఎందుకో అతనితో కలిసి వెళ్ళాలని అనిపించలేదు.


" నో..థాంక్స్...నాకు ఎక్కడికీ వెళ్ళాలని అనిపించడం లేదు" అంది ఆమె.


తను తనలాగానే ఉండటం ఇష్టం..!ఆ తర్వాత మంచుతో కూడిన ఆ గుట్టల వైపు నడుచుకుంటూ వెళ్ళింది.ఆ వేపునే నల్లటి బండరాళ్ళూ ఉంటాయి.ఆ తర్వాత రోజు కూడా అలాగే ఉంది. మంచు కురుస్తూ,కొద్దిగా ఎండ గానూ..!ఇది ఫిబ్రవరి నెల,అయినప్పటికీ ఈ ఉత్తర భాగం లో ఉన్న ఈ ప్రదేశం లో మంచు పూర్తి గా కరిగిపోలేదు.Yvette ఇంట్లో చెప్పింది,తాను సైకిల్ మీద అలా బయటకి వెళుతున్నానని. లంచ్ కూడా తీసుకువెళుతోంది కాబట్టి మధ్యానం దాకా తిరిగిరాకపోవచ్చునని కూడా తెలిపింది.


నింపాదిగా బయలుదేరింది.మంచు ఉంటేనేమి,సూర్యుని ప్రభావం చేత వసంతం వచ్చినట్లు గా అనిపించింది.దూరంగా ఆ పార్క్ లో ఓ లేడి నిలబడి ఉంది.సూర్య తాపాన్ని ఆస్వాదిస్తున్నది.ఇంకో లేడి చుక్కల ఒళ్ళుది,మెల్లిగా నడుచుకుంటూ దగ్గరకొస్తోంది.


Yvette సైకిల్ తొక్కుతూనే మరోవేపు చేతుల్ని కాస్తా వేడిగా చేసుకోవాల్ని అనుకుంది,రుద్దుకుని..!కాని ఎలా కుదురుతుంది...ఆమె వొళ్ళు అయితే వెచ్చగానే ఉంది.ఆ గుట్ట పైకి వెళ్ళాలి తను,అక్కడ అయితే ఈదురుగాలి ఉండదు.


ఆ పైన అదంతా వేరే లోకం లా ఉంటుంది. ఇంకో స్థాయికి ఎక్కింది.ఆ సైకిల్ తోనే మెల్లిగా..!ఆ బండలు అవీ వంకలు వంకలు గా ఉండటం తో తప్పిపోతానేమో అని భయపడింది.ముందుకు అలానే వెళ్ళినతర్వాత ఎవరో పాత్రల్ని సుత్తి తో కొడుతున్నట్లు శబ్దం మంద్రం గా వినబడింది.


ఆ జిప్సీ అతనే. బండి కి వెనక ప్రాంతం లో కింద కూర్చుని ఉన్నాడు. తను రాగి పాత్రని సుత్తి తో బాగు చేస్తున్నట్లుంది. నెత్తి మీద టోపీ లేదు ,సూర్య కాంతి లో అలాగే కూర్చుని ఉన్నాడు.గ్రీన్ జెర్సీ మటుకు వేసుకున్నాడు.ఆ గుర్రాలు ఉన్న దాపునే చిన్నపిల్లలు ఆడుకుంటూ కనిపించారు.ఒక ముసలావిడ కట్టెల పొయ్యి వద్ద కూర్చుని ఏదో వండుతోంది.తల చుట్టూ రుమాలు వంటిది కట్టుకుంది.ఆ సత్తు రాగి గిన్నె మీద చిన్నగా శబ్దం చేస్తూ అదే పైనిగా కొడుతూనే ఉన్నాడు సుత్తి తో..!


ఆ జిప్సీ అతను ఈమె ని చూశాడు.Yvette సైకిల్ దిగింది. అయితే తను ఉన్నచోటునుంచి మాత్రం అతను కదల్లేదు,సుత్తి తో కొట్టడం మటుకు ఆపాడు. విజయదరహాసం వంటిది అతని మోము లో విరిసింది. మాసిన బూడిద జుట్టు ఉన్న ఆ ముసలావిడ అటూ ఇటూ తీక్ష్ణం గా చూసింది. ఆ జిప్సీ అతను ఆ ముసలావిడ తో మెల్లిగా ఏదో అన్నాడు.ఆమె పొయ్యి కేసి ఓ మారు చూసి మళ్ళీ Yvette కేసి చూసింది.


"ఎలా ఉన్నారు మీరంతా" మర్యాద గా అడిగింది ముసలావిడ. 

(సశేషం)


POST NO: 21

---------------------


"ఆ...అలా కూర్చో ఓ నిమిషం" అంటూ ఆ జిప్సీ అతను బండి కింద ఉన్న స్టూల్ ని Yvette కోసం వేశాడు. ఆ అమ్మాయి తన సైకిల్ ని ఆ క్వారీ పక్కనే పెడుతుండగా,కొద్దిగా సౌండ్ తగ్గించి సుత్తి తో పాత్రని మెల్లిగా కొడుతున్నాడు.


తన చేతుల్ని వేడి చేసుకుందుకు పొయ్యి దగ్గరకి వెళ్ళింది Yvette.


"ఏమిటి...వండుతున్నారు...రాత్రి భోజనానికా" అక్కడే వుండి చేతులు వేడికి కాచుకుంటున్న ఓ ముసలి జిప్సీ ని అడిగింది Yvette.చలి తో ఎర్రగా అయిపోయి నున్నగా వెడల్పుగా ఉన్నాయి ఆమె అరచేతులు.


"అవును... పిల్లలకి, అతనికి..." అన్నదా జిప్సీ.కొద్ది దూరం లో మాసిన దుస్తులలో ఉండి, ఆడుకుంటున్న ముగ్గురు పిల్లల వేపు చూపిస్తూ. వాళ్ళు శుభ్రంగా అగుపిస్తున్నారు.ఎటొచ్చి ఈ ముసలి జిప్సీ ఆవిడ లోనే కాస్త శుభ్రత లోపించింది.ఆ క్వారీ పరిసరాల్ని శుభ్రంగానే ఉంచారు.   

Yvette చేతులు వేడి చేసుకుంటూ అలాగే కూర్చుంది. కొద్ది గా ఆగి ఆగి సుత్తి తో గట్టిగా కొడుతూ తన పని చేసుకుంటున్నాడు జిప్సీ వ్యక్తి. ఆ ముసలి జిప్సీ ఆవిడ మెల్లిగా సంచార బండి లోనికి వెళుతోంది. పిల్లలు వాళ్ళ లోకం లో వాళ్ళుగా ఆడుకుంటున్నారు.


"వాళ్ళు అంతా నీ పిల్లలేనా" ఆ జిప్సీ వ్యక్తి వేపు తిరిగి అడిగింది Yvette. అతను ఆమె కళ్ళలోకి చూసి తలాడించాడు.


"మరి నీ భార్య ఎక్కడ..?" 


"వాళ్ళంతా అమ్మకాల కోసమని బండి మీద బయటకి వెళ్ళారు. నేను ఏమైనా సామాన్లు చేయడం వరకే.అమ్మడం అనేది నేను చేయట్లేదు. ఎప్పుడైనా బాగా అవసరం పడినప్పుడు మాత్రం వెళుతుంటాను"  


 "ఏమిటి...ఈ రాగి,ఇత్తడి సామాన్లు అన్నీ నువ్వే తయారు చేస్తావా..?" అడిగింది Yvette. అతను తల ఊపి, కూర్చోడానికి మళ్ళీ స్టూల్ చూపించాడు.ఆమె కూర్చుంది.


"నువ్వు శుక్రవారం రోజు ఇక్కడ ఉంటాను అన్నావు గదా,అందుకే ఇటుగా వెళుతూ వచ్చాను, చాలా బాగుంది ఇక్కడ" అన్నదామె.


"చాలా బాగుంది ఈరోజు"అన్నాడతను.మంచు వల్ల ఆమె బుగ్గలు పాలిపోయినట్లుగా కనిపించాయి.ఎర్రటి చెవి మీద మెత్తటి ముంగురులు తారాడుతున్నాయి.చేతులు మోకాళ్ళ పై ఉన్నాయి.


"సైకిల్ మీద వచ్చావా, ఈ చలి లో"అడిగాడు ఆ జిప్సీ అతను.


"ఏదో ...కొద్దిగా చేతులు" నీరసం గా చేతుల్ని నులుముకుంటూ అన్నదామె.


"ఏమిటి...గ్లోవ్స్ వేసుకోలేదా" 


"ఉన్నాయి,నాకెందుకో మంచిగా అనిపించలేదు" 


"మరి చలి అనిపించదూ " అన్నాడతను.


"చలి ఉంటుంది" బదులిచ్చింది.

ఇంతలో ఆ ముసలి జిప్సీ ఆవిడ బండి లోనుంచి రెండు కంచాలు పట్టుకుని మెల్లిగా కిందికి దిగింది.


"వంట అయింది గదా..?" జిప్సీ వ్యక్తి అడిగాడు మెల్లిగా.


ఆ ముసలి జిప్సీ ఆవిడ కంచాల్ని పొయ్యి దగ్గర లో పెడుతూ అతనితో ఏదో గొణిగింది.మండుతున్న కట్టెల పైన రెండు పాత్రలు కాగుతున్నాయి,అవి అడ్డంగా ఉన్న ఇనుపసువ్వ కి తగిలించబడి ఉన్నాయి.అవి మాత్రమే గాక ఇంకో చిన్న పాత్ర కూడా నిప్పుల మీద కాగుతూంది.ఆ వెలుతురు లో దానిలోపల నుంచి వచ్చే ఆవిరి,వేడి అనుభూతమవుతూనే ఉన్నాయి.


ఆ జిప్సీ వ్యక్తి తను చేసే పని ని విడిచిపెట్టి పైకి లేచాడు.


"అవునూ...నువు కూడా మాతో పాటూ కొద్దిగా తినకూడదూ?" Yvette ని అడిగాడతను,ఆమె వైపు చూడకుండానే.


"నేను నా లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను" అన్నది Yvette.


"పోనీ..కొద్దిగా కూర వేసుకోకూడదూ..?" అంటూ ఆ జిప్సీ ఆవిడ వేపు సైగ చేశాడు.ఆమె మెల్లిగా ఏదో చెబుతూ కూర ఉన్న పాత్రని అతని వేపు జరిపింది.


"కొద్దిగా బీన్స్,కొద్దిగా మటన్...అంతే" అన్నాడతను.


"చాలా థాంక్స్,అయితే ఒకటి...కొద్దిగా వేస్తే చాలు,మరీ ఎక్కువ తినలేను" అంది Yvette.


   (సశేషం)


POST NO: 22

---------------------


ఆమె తన లంచ్ తెచ్చుకోవడానికి సైకిల్ వద్దకి వెళ్ళింది.జిప్సీ వ్యక్తి తమ బండి లోకి వెళ్ళి, వస్తూ ఓ టవల్ ని తీసుకొచ్చాడు.


"నీ చేతులు కడుక్కుంటావా..?" అని అడిగాడు తన చేతుల్ని తుడుచుకుంటూ.


"నా చేతులు శుభ్రంగానే ఉన్నాయి,వద్దులే" అంది Yvette.


పెద్ద ఇత్తడి జగ్ లో ఉన్న నీళ్ళు పారబోసేసి, మళ్ళీ క్లీన్ గా ఉన్న నీళ్ళు తీసుకురావడం కోసం,ఆ దగ్గరలోనే ఉన్న చెలెమ దగ్గరకి వెళ్ళాడు.నీళ్ళని ఓ కప్ తో తోడి దానిని నింపాడు.


తిరిగివచ్చి ఆ జగ్ ని,కప్ ని పొయ్యి కి దగ్గర లో పెట్టాడు.తను ఓ చిన్న కర్ర మొద్దు ని దగ్గరకు జరుపుకున్నాడు కూర్చోడానికి..!పిల్లలు ఆ దగ్గర లోనే కూర్చుని ఆ బీన్స్ కూరని,మాంసం కూరని తింటున్నారు వేళ్ళతోనూ,చెంచాల తోనూ..! జిప్సీ వ్యక్తి ఏదో ఆలోచన లో ఉన్నట్లుగా నిశ్శబ్దం గా తింటున్నాడు.జిప్సీ స్త్రీ ఆ తర్వాత కాఫీ పెట్టింది.ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దం గా ఉంది.Yvette స్టూల్ మీద కూర్చుని,ఆ తర్వాత తన టోపీ ని తీసి పక్కన పెట్టి తల వెంట్రుకల్ని సూర్యరశ్మికి విరబోసింది.  


"నీకెంతమంది పిల్లలు..?" ఉన్నట్టుండి అడిగింది Yvette.


"హ్మ్...అయిదుగురు" చిన్నగా చెప్పాడతను ఆమె కళ్ళ లోకి చూస్తూ.


ఆమె హృదయం లో ఏదో పక్షి దిగాలు పడి చచ్చినంత పని అయింది.ఇంతలో కాఫీ కప్ వచ్చింది.అందుకుంది.కల లా అనిపిస్తోంది.ఆ కర్ర మొద్దు మీద నీడ లా కూర్చున్న అతడినే గమనించసాగింది.ఎనామిల్ కప్ లోని కాఫీ ని తాగుతూ..!తన మీద అతని ప్రభావం విస్తరిస్తున్నట్లుగా అయింది.


అతను మాత్రం తన కాఫీని ఊదుకుంటూ ఒకటే సోయి లో ఉన్నాడు.మార్మికమైన ఆమె యవ్వనం ఇంకా ఆమె లోని లేతదనం..! 


తాగేసి తన కాఫీ కప్ ని పక్కన పెట్టాడు. ఆమె కాఫీ తాగుతుంటే ముంగురులు మొహం మీదకి వస్తున్నాయి.ఆమె మోము ఏదో మగత ఉన్నట్లుగా,విరబూసిన తొలివయసు మార్మిక పుష్పం లానిపించింది.  


ఆ జిప్సీ అతను ఆమె ని ఒక నీడని గమనిస్తూన్నట్లుగా చూస్తున్నాడు. ఆ క్షణం అలానే ఉండాలన్నంత ఇదిగా అడిగాడు.


"మా బండి లో వెళ్ళి అక్కడ చేతులు కడుక్కుంటావా" అని.


పిల్లదనం,మగత గా ఉన్న ఆమె లోని పూర్ణ యవ్వనం అతని ని గమనిస్తూనే ఉన్నది.తన ప్రమేయం లేకుండానే అతని యొక్క వింత జాలం తన మీద పనిచేస్తున్నది.


"అలా చేస్తేనే మంచిదేమో" అన్నదామె.  

(సశేషం)


POST NO:23

--------------------


ఆ జిప్సీ వ్యక్తి నిశ్శబ్దం గా లేచి,ముసలావిడ తో ఏదో చిన్న గొంతు లో మాట్లాడాలని ఆమె వేపు తిరిగాడు.మళ్ళీ అంతలోనే Yvette వేపు చూశాడు.తన శక్తి ని ఏదో ప్రసరించాడా అనిపించింది.తను చేయగలిగింది ఏమీ లేదు.


"ఇలా రా" అన్నాడతను.


ఆమె మెల్లిగా అతడిని అనుసరించింది. మంత్ర ముగ్ధ లా..!


అతను బండి కి పై మెట్ల మీద ఉన్నాడు.ఆమె కొద్దిగా కిందికి కూర్చుంది.అంతలోనే ఏదో శబ్దం వినిపించసాగింది.అక్కడే లేచి నిలబడింది. మోటారు కారు శబ్దం అది.జిప్సీ వ్యక్తి కూడా లేచి వింత గా చూస్తున్నాడు.ముసలావిడ ఏదో కోపంగా అంది , అంతలోనే  దగ్గరగా వచ్చింది మోటారు కారు. 


క్వారీ కి కొద్దిగా అవతలకని కారు ఆగింది. అంతలోనే ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది.జిప్సీ వ్యక్తి తన సంచార బండి కి గల తలుపు వేసి కిందికి దిగి వచ్చాడు.


"నీ టోపీ పెట్టుకుంటావా" Yvette ని అడిగాడతను.


పొయ్యి కి దగ్గర లో ఉన్న స్టూల్ మీద గల తన టోపీ ని తీసిపెట్టుకుందామె.అతను తన పనిముట్లను తీసుకుని యధాప్రకారం పనిచేసుకోసాగాడు.ఈ సారి సుత్తి తో టక్ టక్ మని వేగంగా కొడుతుంటే ఏదో చిన్న తుపాకి పేల్చిన శబ్దం లా వినిపిస్తోంది.అంతలోనే ఆ స్త్రీ గట్టిగా అరుచుకుంటూ వస్తోంది.


"అన్నట్టు మీ పొయ్యి దగ్గర కాస్తా చేతులు వేడిచేసుకోవచ్చా..?" అడిగింది ఆ వచ్చిన స్త్రీ.ఆమె సేబుల్ ఫర్ తో చేసిన కోటు వేసుకుంది. పెద్ద బ్లూ కోటు వేసుకున్న మగ మనిషి ఆవిడ వెనకాలే వచ్చాడు.తన చేతులకి ఉన్న ఫర్ గ్లోవ్స్ తీసివేశాడు,అలాగే నోట్లో ఉన్న పైప్ కూడా..! 


"ఇక్కడ బలే ఉంది" ఒక రకమైన అతిశయం తో అన్నది ఆ స్త్రీ. ఆమె వేసుకున్న సేబుల్ ఫర్ కోటు ని తయారించడానికి ఎన్ని చిన్ని సేబుల్ ప్రాణులు బలి అయ్యాయో..! ఎవరూ ఏమీ మాట్లాడలేదు, ఆమె అన్న మాటకి. 


ఆ స్త్రీ మంట కి చేరువ గా వచ్చింది.కోటు లో ఉన్నా కొద్దిగా చలి తో వణికింది ఆమె.వాళ్ళు ఓపెన్ కారు లో వస్తున్నారు.


మనిషి చూపులకి చిన్న గా అనిపించిది.ముక్కు మాత్రం పెద్ద గా ఉంది యూదు మనిషి లాగా..!ఆ పెద్ద కోటు వేసుకోవడం వల్ల లావు గా అనిపిస్తోంది.ఆవిడ బూడిద కళ్ళు చూస్తే కోపం గానూ అనిపించాయి.ఆ ధరించిన ఖరీదైన దుస్తులవల్లనేమో అలా..!

మంట దగ్గరే వంగి కూర్చుంది.ఆమె చేతుల్ని వేడికి పెట్టి కాచుకుంటోది,బుల్లిగా ఉన్నాయవి. ఆ చేతులకి ఉన్న నగల్లో డైమండ్ లు, ఎమరాల్డ్ లు తళుక్కుమన్నాయి.


"ఓహ్..అసలు ఓపెన్ కార్ లో రాకుండా ఉండవలసింది.ఏదీ మా ఆయన చెప్పనిస్తేనా ఈ చలి గురించి"నలువేపులా చూస్తూ అన్నదామె.బాగా ధనికురాలైన యూదు స్త్రీ లా అనిపించింది,ఆ కళ్ళ లో ని పొగరు వగరు చూస్తే..!


చూడటానికి ఈమె ఈ కనిపించే "బ్లాండ్" వ్యక్తి తో ప్రేమ లో ఉన్నట్లుంది.అతగాడి కళ్ళు నీలి రంగు లో ఉన్నాయి.వెనకాలే నిలబడి ఉన్నాడు.కనురెప్పలు ఉన్నాయా అన్నట్లున్నాడు.చిన్నగా నవ్వాడు గాని దానిలో ఏ భావమూ లేనట్టు అనిపించింది.


స్కయింగ్,స్కేటింగ్ లాంటి ఆటలు ఆడే వ్యక్తి లా అనిపించాడతను.పైప్ ని తీసి దానిలో మెల్లిగా పొగాకు కూరుకోసాగాడు.


(సశేషం)  

 

POST NO:24

-------------------


ఆ యూదు స్త్రీ అతని ప్రతిస్పందన ని గమనించింది.అతను చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.ఏ భావమూ లేదు దానిలో.మళ్ళీ మంట వైపు తిరిగి కనుబొమలు మిటకరిస్తూ ఆమె తెల్లని బుల్లి చేతుల్ని వేడికి కాచుకోసాగింది.


బరువు గా ఉన్న కోటు ని విప్పాడతను.పసుపు,బూడిద రంగు లో ఉన్న అందమైన జెర్సీ లో ఉన్నాడు ఇపుడు.నల్లని ప్యాంట్ వేసుకున్నాడు.మొత్తం మీద ఇద్దరి దుస్తులు ఖరీదైనవే.అతను చూడటానికి ఆకర్షణీయం గా,క్రీడాకారుని లాగా ఇంకా విశాలమైన ఛాతి తో ఉన్నాడు.మంట ని చక్క గా ఎగదోస్తున్నాడు, కేంపింగ్ లో అనుభవం ఉన్న సైనికుని లా..!      


"మంట ఇంకా చక్కగా రావడానికి మా దగ్గర ఉన్న కొన్ని కర్ర ముక్కల్ని వేస్తే వాళ్ళకి ఏమైనా అభ్యంతరమా..?" యూదు స్త్రీ తో వచ్చిన ఆ వ్యక్తి అడిగాడు Yvette ని,అంతలోనే ఓ చూపు జిప్సీ వ్యక్తి వేపు చూస్తూ.ఆ జిప్సీ వ్యక్తి తన పనిలో తాను నిమగ్నమయి సుత్తి తో పాత్రని కొడుతున్నాడు. 


"దానిదేముంది,వాళ్ళూ ఇష్టపడవచ్చు" అంది ఆమె ,ఇప్పుడిప్పుడే జిప్సీ ఆలోచనల నుంచి బయటకి వస్తోన్నది Yvette.


దానితో అతగాడు కారు దగ్గరకి వెళ్ళి ఓ బస్తా లో ఉన్న కర్రముక్కల్ని తీసుకొచ్చి కొన్ని కొన్నిగా మంట లో వేయసాగాడు.


"మీకు ఫర్లేదుగా మంట వేస్తుంటే" అతను జిప్సీ ని అడిగాడు.వినబడకపోతే మళ్ళీ అడిగాడు.


"కానివ్వండి" అన్నాడు జిప్సీ.


ఎర్రగా మండుతున్న కొరకంచుల మీద తను తెచ్చిన కర్ర ముక్కల్ని శ్రద్ధ గా వేస్తున్నాడు.ఒక దాని తర్వాత ఒకటి అంటుకొని మంచి మంట ఎగిసింది,ఎర్ర గా ...చక్కని వాసన తో..!

 "ఓ లవ్లీ...లవ్లీ..." చాలా ఆనందం గా అరిచింది ఆ యూదు స్త్రీ.తనతో వచ్చిన ఆ వ్యక్తి ని చూస్తూ.సూర్యరశ్మి మంచు మీద పడినట్లు అనువుగా ఆమె వేపు చూశాడు తను.


"అలా మంట ఉంటే నాకు ఇష్టం,నీకు అంతేనా" ఆ యూదు స్త్రీ Yvette ని అడిగింది. అవతల సుత్తి శబ్దం వల్ల అరిచినట్లుగా అడిగింది.ఆ శబ్దం ఆమె కి చిరాకు గా ఉన్నది.అటు ఇటు చూస్తూ కనుబొమలు ముడివేస్తోంది.ఎవరైనా ఆపమని చెబుతారా అన్నట్లుగా..!ఆ జిప్సీ వ్యక్తి కాళ్ళు బార్లా జాపి తన పని తాను చేసుకుంటున్నాడు,సుత్తి తో పాత్రల్ని కొట్టుకుంటూ

ఆమె కి కొద్దిగా దూరం లో ఉన్నాడతను.


ఆ యూదు స్త్రీ తో వచ్చిన వ్యక్తి మెల్లిగా జిప్సీ అతని వద్దకి వెళ్ళాడు.నిశ్శబ్దం గా చూస్తున్నాడు,తన నోట్లో పైప్ పెట్టుకుని.రెండు మగ కుక్కలు వాసన చూసుకుంటున్నట్లుగా..!


" మేము హానీమూన్ లో ఉన్నాము" యూదు స్త్రీ ,Yvette వంక గీర గా చూస్తూ అన్నది. తాను ఏదో ఉన్నతురాల్ని అనే ధోరణి లో ఉంది ఆమె స్వరం. 

"నిజంగా నా" అంది Yvette.


"ఔను,పెళ్ళికి ముందర..! అన్నట్లు సైమన్ ఫాసెట్ అనే పేరు విన్నావా..?అతని భార్యని నేను...అయితే త్వరలోనే నాకు తను విడాకులివ్వబోతున్నాడు." అంది ఆ యూదు స్త్రీ. ఆ ఫాసెట్ అనే అతను మంచి స్థితిపరుడైన ఇంజనీరు.Yvette వేపు అలక్ష్యం గా చూసింది ఆమె.


"నిజంగా నా" అంది Yvette.


బూడిద రంగు కళ్ళతో చిన్నపిల్ల లా ఉన్న ఆ యూదు స్త్రీ ఎందుకు అలా గర్వంగా,అలక్ష్యం గా ఉందో అర్ధమైంది Yvette కి..!ఆమె లో నిజాయితి ఉన్నా, అది మరీ హేతుబద్ధం గా ఉంది.ఒక రకంగా ఆమె సైమన్ ఫాసెట్ మరో కోణాన్ని చూపించడానికి అన్నట్లుగా ప్రయత్నించింది.అప్పటికీ అతని మీద చెడు ముద్ర ఉంది కొన్ని విషయాల్లో..!


"విడాకులు తీసుకున్న తర్వాత,ఇదిగో ఈ మేజర్ ఈస్ట్ వుడ్ ని పెళ్ళాడబోతున్నాను" అన్నదామె.


(సశేషం) 


POST  NO:25

------------------------


ఆమె విషయాలన్నీ తేటతెల్లం చేసింది. ఇక మోసం చేసేందుకు ఏమీ లేదు.ఆమె కి వెనక ఇద్దరు మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు.దానిలో ఒకరైన జిప్సీ కేసి అలాగే చూస్తుండి పోయింది,అటూ ఇటూ పరికిస్తూ..!


ఆ జిప్సీ అతను తనకి ఎదురుగా ఖరీదైన వేషధారణలో,నోట్లో పైప్ తో ఉన్న ఈస్ట్ వుడ్ ని కొద్దిగా సిగ్గరితనం తో చూస్తున్నాడు.


"అయితే గుర్రాల్ని ఆ ప్రదేశం నుంచి వెనక్కి తరలించారా..?" జిప్సీ అతను మెల్లిగా అడిగాడు.అసలు విషయం ఏమిటంటే యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఈ మేజర్ ఈస్ట్ వుడ్ కి సంబందించిన రెజిమెంట్ లో తను సేవల్ని అందించాడు. 


"నేను చేసుకోబోయే వ్యక్తి బావున్నాడు కదా..?"  యూదు స్త్రీ ప్రశ్నించింది Yvette ని. ఆవిడ దృష్టి లో జిప్సీ వ్యక్తి అతి సామాన్యుడు. 


"చాలా బావున్నాడు" అంది Yvette.


"ఏమిటి...నువు సైకిల్ తొక్కుతూ వచ్చావా..?" యూదు స్త్రీ ఆశ్చర్యం గా అడిగింది.


"అవును,మా వూరు ఆ కింద ఉన్న పేపల్ విక్. మా నాన్న పేరు మిస్టర్ సేవెల్ ,రెక్టార్ గా ఉన్నారు" అంది Yvette.  


"ఓహ్...ఆయనా...మీ నాన్న గారు..!నాకు తెలుసు,మంచి తెలివైన వారు ,రచయిత కూడా...నేను చదివాను ఆయన రచనలు" యూదు స్త్రీ తెలిపింది.


కర్ర ముక్కలు బాగా కాలిపోయాయి.బాగా కుప్ప లా అయి,కిందకి పడుతూ ఎర్ర గా నిప్పులు కనిపిస్తున్నాయి.ఆ నడిమధ్య వేళకే మబ్బులు కమ్ముకుంటున్నాయి.బహుశా సాయంత్రం కల్లా మంచు కురుస్తుంది.


మేజర్ తన కోటు వేసుకున్నాడు. ఇవతలికి వచ్చాడు.


"ఇతను తెలిసిన మొహమే...మా రెజిమెంట్ లో గుర్రాల్ని తోలేవాడు" మేజర్ ఈస్ట్ వుడ్ అన్నాడు.


"అన్నట్లు నువూ మాతో కారు లో రాకూడదూ..!మేము స్కోర్స్ బై లో నివసిస్తున్నాము.మీ ఇంటికి దగ్గర లో దింపేస్తాము.నీ సైకిల్ ని కారు వెనక కట్టేద్దాం" అన్నది ఆ యూదు స్త్రీ Yvette తో..! 


"అలాగే" అంది Yvette.  


"ఏయ్ ...ఇలా రండి..." అంటూ చిన్న పిల్లల్ని పిలిచి వారికి ఇవ్వడానికి అన్నట్లు షిల్లింగ్  తీసి పట్టుకుంది యూదు స్త్రీ.ఈ లోగా సైకిల్ని కారు వెనక సర్ది కట్టేశాడు ఈస్ట్ వుడ్. 


జిప్సీ అతను తన పని ఆపి బండి లోకి వెళ్ళాడు.ఆ లోపలినుంచే జిప్సీ స్త్రీ పిల్లల్ని ఉద్దేశించి ఏదో అరిచింది.ఇద్దరు పిల్లలు నాణేలు తీసుకోవడానికి యూదు స్త్రీ దగ్గరకి వెళ్ళారు.ఆమె రెండు సిల్వర్ నాణేల్ని,ఓ షిల్లింగ్ ని,ఓ ఫ్లొరిన్ ని తన పర్స్ లోనుంచి తీసి పిల్లలకి ఇచ్చింది. ఆ జిప్సీ స్త్రీ ఆ లోపల నుంచే ఏదో అంటోంది పిల్లని ఉద్దేశించి.


ఇంతలో జిప్సీ అతను బండి దిగి ఆరిపోయిన  మంట దగ్గరకి వచ్చాడు.యూదు స్త్రీ చాలా గర్వంగా అతని వేపు చూసింది.


"అయితే మేజర్ ఈస్ట్ వుడ్ రెజిమెంట్ లో నువు పనిచేశావా యుద్ధ సమయం లో..?" ప్రశ్నించింది యూదు స్త్రీ.


"అవునండి" అన్నాడు జిప్సీ వ్యక్తి.


"మీ ఇద్దరు ఇక్కడ ఉండగానే మంచు కురిసేలా ఉంది,ఊహించుకో ఓ సారి" ఆకాశం కేసి చూస్తూ అంది ఆమె.


"కాసేపు ఆగితే మంచు పడవచ్చు" పైకి చూస్తూ అన్నాడు జిప్సీ వ్యక్తి.


(సశేషం)    

 

  POST NO:26

---------------------


ఆ జిప్సీ కూడా అందుబాటు లో ఉండడు. అతని జాతి పురాతమైనది. బయట సమాజం తో దానికి ఎపుడూ ఒక వింతైన యుద్ధం జరుగుతుంటుంది.గెలవాలనే భావం ఏమీ ఉండదు.అయితే అప్పుడప్పుడు మాత్రం గెలుస్తూనే ఉంటారు.


ఆ యుద్ధం మొదలైన దగ్గరనుంచి ఈ దాహం తీరుతున్నట్లుగానే ఉన్నది.లొంగడం అనేది మాత్రం ఉండదు.ఆ జిప్సీ అలాగే ఎటో చూస్తున్నట్టుగా ఉన్నాడు,నదురూ బెదురూ లేనట్లుగా..!ఇంతసేపూ ఉన్న దగ్గరితనం పొయినట్లుగా ఉన్నది.అతని లోనే ఒక యుద్ధం జరుగుతున్నది.


  అతను Yvette వేపు చూశాడు.


"నువు ఆ కారు లో వెళుతున్నావా..?" అడిగాడు.


"అవును...వాతావరణం కూడా బాగా లేదు గదా..!" సమాధానమిచ్చింది.


"వాతావరణం బాగాలేదా.." అతను ఆకాశం కేసి చూసి అన్నాడు.


ఆమె కి లీల మాత్రమైన తెలియదు అతనిలో ఏమి జరుగుతోందీ..!అది అంత ఆసక్తికరమైన అంశం కూడా కాదు. ఇద్దరు పిల్లలు ఉన్న ఈ యూదు స్త్రీని..! చూసిన తర్వాత ఆమె పట్ల ఓ ఆసక్తి కలిగింది.మొదటి భర్త అయిన ఆ యింజనీరు నుంచి విడిపోయి,వచ్చే ధనం అంతా ఈ చిల్లిగవ్వ లేని యువ మేజర్ అదే ఈస్ట్ వుడ్ కి ధారబోస్తోంది. ఇతను ఆమె కన్నా అయిదారేళ్ళు చిన్నవాడు కావచ్చును. 


ఇంతలోనే ఆ రాగిజుట్టు మేజర్ వచ్చాడు.


"చార్లెస్, ఓ సిగరెట్ ఇవ్వు" అంది యూదు స్త్రీ.కొద్దిగా నలత గా ఉన్నట్లుగా అరిచింది.


చాలా సుతారం గా కేస్ తీసి, ఎంతో జాగ్రత్తగా సిగరెట్ ని ఆమె కి అంటే కాబోయే భార్య కి ఇచ్చాడు.ఇంకో సిగరెట్ ని Yvette కి అందించాడు.ఏదో ఇతరుల్ని చూసి నొచ్చుకున్నట్లు గా ఫీలయ్యాడు. జిప్సీ వ్యక్తి వేపు చెయ్యి సాచగా కేస్ లో నుంచి అతనో సిగరెట్ తీసుకున్నాడు. తీసుకుని కృతజ్ఞతలు చెప్పాడు.


ఎర్ర గా మండుతున్న కట్టెల దగ్గరకెళ్ళి సిగరెట్ ని వెలిగించుకున్నాడు.


"చలి కాచుకోనిచ్చినందుకు థాంక్స్. సరే...వస్తాం" అంటూ ఆ యూదు స్త్రీ తన సహజమైన గంభీరత తో అన్నది.


"దానిదేముంది,నిప్పు ఎవరికైన ఒకటే" బదులిచ్చాడు జిప్సీ వ్యక్తి. ఇంతలో ఒక చిన్న పిల్లాడు పాక్కుటూ వచ్చాడు.


"సరే...గుడ్ బై...మీకు మంచు బాగా పడదనే భావిస్తున్నా"  అంది Yvette.


"కొద్దిగా మంచు పడినా దాన్ని మేము పట్టించుకోము" అన్నాడి జిప్సీ.


"ఓహ్...అలాగా...నేనలా అనుకోవడం లేదు" అంది Yvette.


"అబ్బే..అదేం ఉండదు" అన్నాడతను.


ఆమె భుజాలమీదుగా స్కార్ఫ్ కప్పుకుంది.ఫర్ కోటు వేసుకుని నడుస్తున్న యూదు స్త్రీ వెంట నడిచింది.ఆ చిన్న పాదాలు గాలిలో కదులుతున్నట్లు అనిపిస్తున్నాయి.


(సశేషం)      


 

POST NO:27

---------------------

ఆ యూదు స్త్రీ ఈస్ట్ వుడ్ ని పిలిచిన విధానం Yvette కి గమ్మత్తు గా అనిపించింది.విడాకులు అవీ సెటిల్ కావడానికి ఇంకో మూడు నెలలు పడుతుంది.స్కోర్స్ బై దగ్గర లో ఈ ప్రేమికులు ఇద్దరూ ఓ కాటెజ్ లో అద్దెకి ఉంటున్నారు.ఆ గుట్టలకి మరీ దూరం ఏమీ కాదది.చలి ప్రస్తుతం విపరీతం గా ఉంది.వాళ్ళ కాటేజ్ లో పని మనిషి కూడా లేదు.అందరి నుంచి విసిరేసినట్లుగా ఉన్నారు.ఆర్మీ నుంచి ఈస్ట్ వుడ్ బయటకి వచ్చేశాడు,అందుకనే మిస్టర్ అనే చెపుతున్నాడు.మేజర్ అని కాకుండా..!బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళు ఇప్పటికే మిస్టర్ అండ్ మిసెస్ ఈస్ట్ వుడ్ ..!


ఈ చిన్నారి యూదు ఆవిడ కి ముప్ఫై ఆరేళ్ళు ఉంటాయి. ఆమె ఇద్దరు పిల్లలు పన్నెండేళ్ళు పైబడిన వారే.ఆ ఇద్దరూ వీరి తోనే ఉంటారు,వీళ్ళ కి పెళ్ళయిన తరువాత. మొదటి భర్త ఆమోదించాడు కూడా ఈ కండిషన్ కి..! 


మొత్తానికి ఈ వింత దంపతులు ...అతిశయం నిండిన పెద్ద  అందాల కళ్ళతో,వంకీలు తిరిగిన నల్లని జుట్టుతో  ఉన్న ఈ యూదు చిన్నారి ఇంకా ఓ రకమైన బూడిద రంగు కళ్ళతో, శక్తిమంతమైన డేనిష్ కుటుంబం నుంచి వచ్చిన ఈస్ట్ వుడ్ ...వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఈ చిన్న ఆధునిక గృహం లో ఉంటున్నారు.వాళ్ళ పనులు వారే చేసుకుంటూ ఈ గుట్ట కి దగ్గరగా ఉన్న ఈ నివాసం లో..! 


ఆ ఇల్లు గమ్మత్తు గా ఉంది. అద్దెకి తీసుకున్న కాటేజ్ నే అది. దానిలో అప్పటికే ఉన్న సామాన్లు కాకుండా ఈ యూదు చిన్నారి తనకి బాగా నచ్చిన ఫర్నీచర్ కూడా తెచ్చుకు పెట్టుకుంది.పద్దెనిమిద శతాబ్ది కి సంబందించిన ఆకృతులు ఉన్నవి అవి.  ఎబోనీ తో చేసిన ఆ ఫర్నీచర్ లో ముత్యాలు,తాబేలు గవ్వలు ఇంకా విలువైనవి పొదిగిఉన్నాయి.ఇంకా ఏమేమో ఉన్నాయి,ఆ దేవుడికే తెలియాలి.ఇటలీ నుంచి వచ్చిన ఎత్తైన వింతైన కుర్చీలు ఉన్నాయి.సముద్రపు రంగు లో ఉండే ఓ రకపు పచ్చదనం లో ఉన్నాయి.


ఖరీదైన ఇటాలియన్ పింగాణీ తో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి.అవన్నీ రకరకాల క్రైస్తవ మహాత్ములవి.పంధొమ్మిదో శతాబ్దపు ముందురోజుల్లో గాని లేదా పద్దెనిమిదో శతాబ్దపు చివరినాళ్ళ లో గాని అవి చేసి ఉండాలి. అద్దాలు ఉన్న ఫర్నీచర్ మీద కూడా వింత చిత్రాలు వేసి ఉన్నాయి. 

అలాంటి అసాధారణమైన ఇంటిలోనికి Yvette వచ్చింది.అనుకోకుండా రప్పించబడింది అనాలి.ఆ కాటేజ్ లో ఎక్కడ ఉండాల్సిన స్టవ్ లు అక్కడ ఉన్నాయి.ప్రతి మూల కూడా వెచ్చగా ఉంది.చక్కటి చిన్న ఫ్రాక్,అప్రాన్ ధరించిన ఆ యూదు చిన్నారి హాం ని ముక్కలుగా తరుగుతూ వంట చేస్తూంది. తెల్ల స్వెటర్,గ్రే ట్రవుజర్స్ వేసుకున్న ఆ మేజర్  ఆమె కి సహకరిస్తూంటాడు.బ్రెడ్ ని కట్ చేస్తూ,మస్టార్డ్ మిక్స్ చేస్తూ..! అది మాత్రమేనా కాఫీ చేస్తాడు,కుందేలు మాంసం కూర చేస్తాడు, ఇంకా వాటి తర్వాత వివిధ రకాల కూరలు,చేపల పచ్చడి...అన్నీ చేస్తాడతను.

ఆ వెండి సామాన్లు,చీనా పింగాణీ వంటివి నిజంగా చాలా విలువైనవనే చెప్పాలి.వధువు కి ఇచ్చే బహుమతి సముదాయం లా ఉన్నాయి. ఇంతలో మేజర్ వెండి మగ్ లో బీర్ పోసుకొని తాగాడు.యూదు చిన్నారి ఇంకా Yvette లు ఇద్దరూ తలా కొద్దిగా షాంపేన్ సేవించారు అక్కడున్న చక్కని గ్లాసుల్లో..!అంతలో మేజర్ కాఫీ చేసి తీసుకొచ్చాడు.


మొదటి భర్త అంటే మహా చిరాకు గా ఉంది యూదు చిన్నారి.అందునా ప్రస్తుతం ఆమె విడాకులు తీసుకున్నట్లే గదా.నైతికం గా నాదేమి తప్పు లేదు అన్నట్లు ఉంది.మేజర్ చూడటానికి అందంగా,బలం గా ఉంటాడు..అదో వింతదనం ఉన్న మనిషి.జీవితం మీద అతనికీ ఏదో తెలియని కోపం. క్రీడాకారుని వంటి అతని దేహం తన కోపాన్ని కనిపించనివ్వదు,ఆ యూదు చిన్నారి పట్ల తనకి ఉన్న మృదుభావం అతను తెచ్చుకున్నదే.ఉత్తరాది ప్రాంతం నుంచి వచ్చే వారిలో ఉండే నైతికత తో కూడిన వింత గాలి అతడిని ఏకాంతం లోకి నెడుతోంది.

మధ్యానం అయింది. వాళ్ళిద్దరూ కిచెన్ లోకి వెళ్ళారు.మేజర్  తన బలమైన చేతుల తో జాగ్రత్త గా కిచెన్ లోని పాత్రలన్నిటినీ కడిగాడు.ఆ కడిగిన వాటిని ఆ యూదు చిన్నారి శుభ్రంగా తుడిచింది. ఇలాంటి పని చేయడానికి మేజర్ కి పెద్ద శిక్షణ తీసుకోవలసిన అవసరం ఏముందని..!ఆ పని అయిపోయిన తరువాత మేజర్ స్టవ్ ల పనితనాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు.ప్రతిరోజు ఎంతోకొంత సమయం వెచ్చించాలి గదా ఇలాటి పని కోసం..!


ఇదంతా అయినతర్వాత మేజర్ తాము వచ్చిన కార్ ని బయటకి తీసి Yvette ని ఎక్కించుకున్నాడు.సరాసరి తీసుకెళ్ళి Yvette వాళ్ళ ఇంటి వెనుక భాగం లో దించాడు.ఆ వెనకున్న చెట్ల వరుస కి మధ్య లోనుంచి వెళితే ,మట్టి మెట్లు వస్తాయి.అవి దాటితే ఇక వాళ్ళ ఇల్లే అది.


ఆ దంపతుల వ్యవహారం Yvette కి గమ్మత్తు గా అనిపించింది.


"నేను ఈ మధ్య చాలా అసాధారణమైన మనుషుల్ని కలిశాను " అంటూ జరిగిన విషయాన్ని Lucille తో చెప్పిందామె.


"ఆ మేజర్ ఇంటి పని చేయడం,అలా తోకాడించుకుంటూ తిరగడం భలే ఉంది.ఇక వాళ్ళ పెళ్ళయినతర్వాత ఎలా ఉంటారో అది తెలుసుకుంటే గనక మరీ గమ్మత్తుగా ఉంటుంది" అంది Lucille.


"ఔనౌను..." అంది Yvette.


(సశేషం)  



 POST NO:28

--------------------


ఆ యూదు చిన్నారి ఇంకా ఆ బూడిద కళ్ళ ఈస్ట్ వుడ్... వాళ్ళిద్దరి మధ్య గల సంబంధం Yvette కి ఎందుకనో జిప్సీ వ్యక్తి ని గుర్తుకు తెచ్చింది.అతని జ్ఞాపకాలు మనసు లో ఎక్కడో ఉండేవి గాని అవి ఒక లాంటి బాధతో చప్పున పైకి వచ్చాయి.


"అసలు Lucille ...మనుషుల్ని కలిపిఉంచేదేమిటి..? ఉదాహరణకి ఈస్ట్ వుడ్ లాంటి వాళ్ళ సంగతి ఇలా ఉంది,కానైతే మరి మన అమ్మా,నాన్న ల బంధం మాత్రం ఒకరికి ఒకరు పొసగకపోవడం..?నాకు జాతకం చెప్పిన ఆ జిప్సీ స్త్రీ...ఇంకా ఆ జిప్సీ వ్యక్తి వాళ్ళూ ఒకరికొకరు బాగానే ఉన్నట్లుంది..! ఏమిటది..?" అడిగింది Yvette.


"నేననుకోవడం ఇద్దరి మధ్య గల సెక్స్ సంబంధం మీద ఆధారపడి ఉంటుందేమో లేదా ఇంకా ఏదైనా కావచ్చు... " అంది Lucille.


"అలాగా...మరి ఒకరి అభిరుచులు ఒకరికి కలవడం..ఒకేలాంటి ఆలోచనలు కలిగిఉండటం ...అలాంటిదేమీ ఉండదా..?" 


"అలా ఉండదేమో...అలా ఉండాల్సిన అవసరం లేదనుకుంటాను" 


"మామూలుగా ...అంటే ఆడవాళ్ళు కొద్దిగా తక్కువ అని ఫీలయ్యే మగవాళ్ళు కొందరుంటారే...వాళ్ళ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరులే గాని...అలాంటివారి విషయం లో ఎవరైనా ఎలాంటి భావం కలిగిఉంటారు..? వాళ్ళు కేవలం పై పై సంగతే చూసేవారు కావచ్చు గాక..." అడిగింది Yvette.


"ఏ రకమైనా గానీ,ఏదీ తక్కువ అని చెప్పలేము.ఫలానా అని చెప్పడం కష్టం.ఈ పై పై మనుషుల్ని చూస్తే నాకు చిరాకు.వాళ్ళని చూస్తే ఏ ఆకర్షణా అనిపించదు.ఇంకో రకం మనుషులంటావా...నేనేమీ చెప్పలేను.నాకెలాంటి శారీరక అనుభవం లేదు కనక" అంది Lucille.


"ఆ మాటకొస్తే నేనూ అంతే.వాళ్ళతో ఎలాంటి శారీరక సంపర్కం ఇద్దరికీ లేకపోవడం వల్ల మనకి కొన్ని తెలియక పోవచ్చును" అది Yvette అభిప్రాయం.


" వాళ్ళతో సంపర్కం అయితేనే కనెక్ట్ అయ్యేది ఉంటే అది నాకు వినడానికే అసహ్యం.ఆ విధంగా నీకు అనిపించడం లేదూ..? సంపర్కం అనేది లేకుండా కేవలం ఆడా,మగ ...కేవలం అలా ఉండటం కుదరదా...అలా ఉండటమే మంచిది" గట్టిగా అన్నది Lucille.   

Yvette ఆలోచించసాగింది.ఆమె మస్థిష్కం లో ఎక్కడో జిప్సీ వ్యక్తి యొక్క రూపం మెదిలింది.వాతావరణం మోసకారిలా ఉంది,అని అతను అన్న మాట అలనాడు కోడి కూసినప్పుడు పీటర్ చెప్పిన విషయం లా తోచింది.ఈ మొత్తం సంగతి లో అతని పాత్ర ని తను కేర్ చేసింది లేదు.ఆమె లో ఒక భాగం దాన్ని అంగీకరించలేదు.మరో భాగం మాత్రం రహస్యం గా దానికి ప్రతిస్పందించింది.ఓ నల్ల కోడి తనని వేళాకోళం చేస్తూ కూసింది.


"సెక్స్ అనేది చాలా బోర్...దాన్ని పొందనప్పుడు అలా అయినా పొందాలని అనిపిస్తుంది.తీరా పొందినప్పుడు అసహించుకోవాలనిపిస్తుంది" ముక్కుని వంకర్లు తిప్పుతూ అంది Yvette.


" ఏమో నాకు దాని విషయం తెలియదు.బహుశా అందు కోసం నేను ప్రేమలో పడాలేమో"  Lucille బిగ్గరగా అన్నది.


"అలాగా... నువు ప్రేమలో పడిఉండవులే  "  


" నీకెలా తెలుసు"  


"అలా అనిపించింది.అంతే...నాకు ఇంకేమీ తెలీదు" 


"ప్రేమలో పడినా...మళ్ళీ దాంట్లోనుంచి బయటకి రావాలి.అదంతా ఓ చికాకు వ్యవహారం" అంది Lucille. 


(సశేషం)     



 POST NO:29

------------------


"ఔను..అది కూడా ఓ సమస్య సుమా" కూని రాగం తీస్తూ అంది Yvette.


"అదో సమస్య కాదు.నిజానికి మన ఇద్దరి లో ఎవరం ప్రేమ లో పడలేదు.పడక పోవచ్చు కూడా..!అలా అనుకోవాలి అంతే..!" అంది Lucille.


"నేను చెప్పలేను,ఏమో నేను భవిషయత్ లో పడొచ్చునేమో"


"అలా కాకపోవచ్చు. వయసు ముదిరినవాళ్ళు అంతా అలా ఆలోచిస్తుంటారు"


Yvette ఆ మాటకి గంభీరం గా చూసింది సోదరి వేపు.కళ్ళలో ఆ భావం మాత్రం లేదు.


"Lucille నువ్వు అలా భావిస్తున్నావా...పాపం అది వారికి సరైనదే,అయినా అవన్నీ వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి..?" 


"ఎందుకా...జనాలు అంటూంటారు గదా...ఇంత వయసు వచ్చినా పెళ్ళి కాలేదని...!" అంది Lucille. 


"అలాంటి వాళ్ళని ఉద్దేశించి కొంతమంది పశువుల్లా ఏదో అంటారు.సిగ్గు చేటైన విషయం" 


"ఆ విధంగా చెప్పాలంటే మనం అదృష్టవంతులం.మన చుట్టూ తిరిగే కొంతమంది ఉన్నారు" 


"అలా అని చుట్టూ తిరిగే వాళ్ళలో ఎవరినో పెళ్ళాడటం నా వల్ల కాదు" అంది Yvette.

    "అది నా వల్ల కూడా కాని పని.అసలు ఇప్పుడు పెళ్ళి గూర్చి ఎందుకు ఆలోచించాలి..? సమయం మంచి గా గడవడానికి,మన చుట్టూ తిరిగే డీసెంట్ మనుషులు ఉన్నారు గదా..!"


"ఔను..!" అంది Yvette.


"సమయం మించింది అనుకున్నప్ప్పుడు అప్పుడు పెళ్ళి చేసుకొని సెటిల్ అవడమే..!" 


" అది బావుంది.." 


Yvette కి అక్కడినుంచి వెళ్ళాలనిపించింది.Lucille వైఖరి కి కొద్దిగా అదోలా అనిపించి,అలా అని పెద్ద కోపం ఏమీ లేదు.తన సోదరి కళ్ళ కింద చారికలు,ఏదో విషాదం తో కూడిన అనుభూతుల వల్ల ఏర్పడినట్లుగా..!అన్నివిధాలా ఆమె కి చక్కగా చూసుకునే వరుడు రావాలి అనేది తన కోరిక.


ఈస్ట్ వుడ్ ఉదంతం గూర్చి తండ్రి కి గాని,నాయనమ్మ కి గాని Yvette ఏమీ చెప్పలేదు.తనకి చికాకు లేచే విధంగా ఏదో అంటారు.తండ్రి ఏమీ లక్ష్యపెట్టక పోవచ్చు గాని జనాలు చేసే విషపూరిత ప్రచారానికి అతను సైతం బాధపడతాడు గదా...!


"మీ నాన్న కి తెలియకుండా నువ్వు  ఇక్కడకి రావడం నాకు ఇష్టం ఉండదు" అని ఆ యూదు చిన్నారి అన్నది అప్పటికే.


"తెలిసినా బహుశా ఆయన ఏమీ అనుకోకపోవచ్చు.చెప్పి చూస్తాను.." అంది తను.


వింతగా,ఒక పక్షి లా,ఎలాంటి భావమూ లేకుండా తన వేపు చూశాడు ఆ ఈస్ట్ వుడ్. చూడబోతే ఈమె తోనూ ప్రేమ లో పడే ఉన్నాడు.Yvette లోని నవ యవ్వన తాజాదనము,ఏదో ఆలోచిస్తూన్నట్లు మైమరపు గా ఉండటమూ ఇదంతా అతడిని ఆకర్షించాయి.


(సశేషం)                                   


 POST NO:30

----------------------


ఏమి జరుగుతున్నదో ఆమెకి తెలుసు.కులుకు చూపుతున్న మాదిరి గాలాగే ఉంది. ఈస్ట్ వుడ్ లో ఏదో ఆకర్షించేది ఉంది.అలాంటి చక్కటి అధికారి,మోటారు కారు ఉన్నవాడు, చాంపియన్ ఈతగాడు ఏ హంగామా లేకుండా నిశ్శబ్దం గా గిన్నెలు కడుగుతూ పైప్ తాగుతూ ఉన్నాడు.చూడటానికి గమ్మత్తు గా ఉంది.తను చేసే పని నైపుణ్యం తో చేస్తున్నాడు. ఆటోమొబైల్ పాడయితే ఎంత జాగ్రత్తగా బాగుచేస్తుంటారో అంత చాకచక్యం గానూ ఇక్కడ వంట గది లో కుందేలు మాంసం కూర చేస్తున్నాడు.ఆ చల్లటి వాతావరణం లోనే బయటకి వెళ్ళి కారు ని శుభ్రంగా తుడిచాడు.ఆ తరువాత ఆ యూదు చిన్నదాని తో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ చికాకు వాతావరణం లోనే , తన పైప్ తో కిటికీ దగ్గర కూర్చుని ఏ శబ్దం చేయకుండా అలానే తనలో తాను ఆనందించుకుంటూ గంటల కొద్దీ కూర్చుంటాడు.


Yvette కి అతని వైఖరి నచ్చింది. అంతకు మించి ఏమీ లేదు.అంతే..!


"మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?" ఆమె అడిగింది.


"అంటే...దేని గురించి" నోట్లోని పైప్ తీసి ఆ కళ్ళ తోనే భావరహితం గా నవ్వుతూ ప్రశ్నించాడు.


"అంటే...చేయబోయే ఉద్యోగం గురించి...ఏదో ఉండాలిగదా బాగా సంపాదించాలంటే..." అమాయంగా అన్నట్లుగా అంది ఆమె.


"నాకిప్పుడు ఏమైంది.బాగానే ఉన్నాను గదా...రేపైనా అంతే..!" పట్టించుకోనట్లుగా అన్నాడు ఈస్ట్ వుడ్. ఆమె ని పరిశీలిస్తున్నట్లుగా చూశాడు తర్వాత.

" అసలు ఉద్యోగం ...అదీ అంటే నాకు ఇష్టముండదు" అంది ఆ యూదు చిన్నారి. ఆమెకి రాబోయే డబ్బు ఉంది గదా ఎలాగూ..!దానికి అతను ఏమీ స్పందించలేదు.అయితే లోలోపల కోపం ఉంది.కనబడకుండా..!


ఏదో ఏ దిగులూ లేని తాత్వికమైన అంశం మాటాడుదాం అన్నట్లుగా ఉంది వారి ప్రవర్తన.ఆ యూదు చిన్నది వాడినట్లుగా అయిపోయింది. ఆమె లో కొంత అమాయకత్వమూ ఉంది.అతను తన సొంతం అనే భావమూ ఉన్నట్లు లేదు.Yvette తో మామూలు గా నే ఉంది.కొంత డల్ గా,ముభావం గా..!


అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవడం మంచిది అనిపించింది ఆమెకి.


" జీవితం కష్టం గా ఉంది కదూ .." తనే అంది


"జీవితమా.." ప్రశ్నించింది యూదు చిన్నారి.


"అదే ప్రేమలో పడటము...పెళ్ళి అలాంటివి" అంది Yvette ముక్కుని వంకర తిప్పుతూ.


" అంటే అలాంటివి ఏవీ నువ్వు చేయవా..?" ఆశ్చర్యపోతున్నట్లుగా కళ్ళింత జేసి అన్నది యూదు చిన్నారి.


"కోడి పెట్ట ల్ని కమ్మేసినట్లు గా ఉండటం...అలా నాకిష్టం ఉండదు" అంది Yvette.


"అయితే ప్రేమ గురించి నీకు తెలియదన్నమాట" బిగ్గరగా అంది యూదు చిన్నారి. 


"నీకు తెలుసా ..?" అంది Yvette.


"నాకా..నాకు తెలియదా..?" ఈస్ట్ వుడ్ కేసి చూస్తూ అంది యూదు చిన్నారి.అతను పైప్ తాగుతూ ఉన్నాడు.అతని చక్కని ముఖం లో ఏవేవో తెలియని భావాలు కదలాడాయి.ఏ వాతావరణం లోనూ పాడవని శరీరం లా ఉంది తనది,చిన్న పిల్లాడి ముఖం లా.గుడ్రం గా ఉంది.నవ్వుతాలు గా ,వింత సొట్టల తో ...అదే భావం గడ్డకట్టినట్లుగా..!


(సశేషం)    


   POST NO: 31

----------------------


"అంటే నీకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు అంటున్నావా?" యూదు చిన్నారి రెట్టించింది.


"తెలియదనే అనుకుంటున్నా. నా వయసు కి అది బాగనిపించడం లేదా?" అమాయకం గా అడిగింది Yvette.


"ఏ మనిషి నీకు వేరే లా అనిపించలేదా.." అలా అడిగి, యూదు చిన్నారి ఈస్ట్ వుడ్ కేసి పెద్ద కళ్ళ తో చూసింది.అతను తనకేమి పట్టనట్లు గా పైప్ తాగుతున్నాడు.


"అలా ఎవరూ అనిపించలా...అయితే గియితే ఆ జిప్సీ వ్యక్తి కొద్దిగా" గంభీరం గా ఎటో చూస్తూ అంది Yvette.


"ఏ జిప్సీ ..." అరిచినంతగా ప్రశ్నించింది యూదు చిన్నారి. 


"అదే...మేజర్ ఈస్ట్ వుడ్ రెజిమెంట్ లో గుర్రాల్ని వాటిని చూసిన కిరాయి సైనికుడు..." ప్రశాంతం గా అంది Yvette.


ఆ యూదు స్త్రీ నమ్మలేనట్లుగా చూసింది.


"అయితే అతనితో నువు ప్రేమ లో లేవా..?" అడిగిందామె.


"ఏమో...తెలియదు.కొద్దిగా నాకు వేరేలా అనిపించింది అతను మాత్రమే" జవాబిచ్చింది Yvette.


"అంటే ఎలా...తను నీతో ఏమైనా చెప్పాడా..?" 


"లేదు...లేదు" 


"మరెలా...ఏమి చేశాడు ?"  


"నావేపు చూశాడంతే" 


"ఎలా"


"చెప్పలేను...కాని ఒక వేరే లా...చాలా వేరే లా ...మిగతా వాళ్ళు చూసిందానికి వేరే లా" 


"ఏ విధంగా చూశాడు.." రెట్టించింది యూదు చిన్నారి.


"నా మీద కోరిక ఉన్నట్లు గా...అలా..ఎందుకని" Yvette ప్రశాంత వదనం పూ మొగ్గ లా ఉన్నది.


"ఆ వెధవ నిన్ను అలా చూడటం ఏమిటి...వాడికి ఏం హక్కు ఉంది ?" కోపంగా అంది యూదు చిన్నారి.


"రాజు గారి మొహాన్ని పిల్లి కూడా చూడవచ్చునేమో..దానిదేముంది" మధ్య లో కల్పించుకుని అన్నాడు ఈస్ట్ వుడ్.అతని మొహం లో పిల్లి నవ్వులే కనిపించాయి.


"అంటే...అతను చూడగూడదా అలా " Yvette ఈస్ట్ వుడ్ వేపు తిరిగి అంది.


"అవును ...చూడనే గూడదు.ఆ జిప్సీ అతని వెనుక పనికిమాలిన స్త్రీలు అరడజను మంది పడుతుంటారు. వాడు నీ వైపు అలా చూడనే  గూడదు" యూదు చిన్నారి అరిచింది.


"వింత సన్నివేశం అది. నా జీవితం లో ఓ భిన్నమైన అంశం అది" అంది Yvette.


"కోరిక కలగడం ఎవరికైన ఓ అపురూప విషయమే...అలా కలిగినపుడు ఎక్కడో మిద్దె ఎక్కిన అనుభూతి కలుగుతుంది. అలాంటి వాళ్ళని చూస్తే నాకు అసూయ నే కలుగుతుంది" పైప్ నోట్లో పెట్టుకుంటూ అన్నాడు ఈస్ట్ వుడ్.


(సశేషం)  



POST NO:32

------------------


ఆ యూదు చిన్నారి ఈస్ట్ వుడ్ కేసి నిర్ఘాంతపోయినట్లు చూసింది.


"కాని...ప్రతి అడ్డమైనవాడు అలా చూడడమేనా.." గట్టిగా అన్నది.


అతను మళ్ళీ పైప్ తీసి నోట్లో పెట్టుకున్నాడు.


"ఏదో కుతి కొద్దీ చూసి ఉండొచ్చును" అన్నాడతను.


"జిప్సీ వ్యక్తి ఎలాంటి వాడని మీ ఉద్దేశ్యం ...మంచోడనేనా.." Yvette ప్రశించింది. దానికి ఈస్ట్ వుడ్ ఏమో అన్నట్లు భుజాలెగరేశాడు.


"నేనే గనక నీ స్థానం లో ఉంటే ఇలాంటివి ఇతరుల్ని అడగను" అన్నాడు ఈస్ట్ వుడ్.


"కావచ్చు..కానీ" అంటూ ఆగిపోయింది Yvette.


"నువు చెప్పేది బాగ లేదు.అతనెలా సరిపోతాడు.ఈ అమ్మాయి అతడిని పెళ్ళాడి ఆ సంచార బండి లో ఊరూరూ తిరుగుతుందా..?" తన ప్రియుడిని అడిగింది యూదు చిన్నారి.


"నా ఉద్దేశ్యం పెళ్ళి అని కాదు" అన్నాడు ఈస్ట్ వుడ్.


"అంటే ప్రేమ వ్యవహారమా...మరీ దారుణం...ఆమెని గూర్చి ఆమె ఏమనుకోవాలి...అది ప్రేమ కాదు.వ్యబిచారం వంటిది అది" అంది యూదు చిన్నారి.


ఆమె ప్రియుడు ఈస్ట్ వుడ్ అలాగే పొగ పీలుస్తూ ఉండిపోయాడు.


"ఆ జిప్సీ వ్యక్తి ఆ రోజుల్లో మా రెజిమెంట్ లో  గుర్రాల్ని చూసేవాడు.మంచి మనిషి.ఓ సారి న్యూమోనియా వచ్చి పోయాడని అనుకున్నాము. అయితే ఆరోగ్యవంతుడయ్యాడు మళ్ళీ.మరోసారి నేను ఓ ఆపద లో చిక్కుకున్నాను.అంటే మంచు లో కూరుకుపోయాను.దాదాపు ఇరవై గంటలు.ఆ సమయం లో తను నన్ను కాపాడాడు.." చెప్పాడు మేజర్ ఈస్ట్ వుడ్.


ఒక్కసారిగా అందరూ మాటల్లేని వాళ్ళలా అయిపోయారు.


"జీవితం ఎంత అద్భుతం" అంది Yvette.


"అనుకోకుండా ఆ గోతి లోనుంచి తవ్వి తీశారు నన్ను" అన్నాడు ఈస్ట్ వుడ్.


" నిజంగా తలరాత అంటే అదే.." నెమ్మెది గా ఏదో యోచిస్తున్నట్లు గా అంది Yvette.


అతను ఏమీ మాటాడకుండా ఉండిపోయాడు.


(సశేషం)       


 

POST NO:33

------------------


Yvette తండ్రి కి తెలిసింది ఈమె ఈస్ట్ వుడ్ వాళ్ళ తో సన్నిహితం గా ఉంటుందని.తండ్రి ఈ విషయాన్ని పెద్ద గా పట్టించుకోడులే అనుకుంది.ఇలాంటప్పుడు హాస్యం గా ఏదో అనడం చేస్తుంటాడు.మరీ వెనకటి మనిషి లా కాకుండా ఈజీ గా తీసుకుంటుంటాడు తనకి తెలిసినంతవరకు..!


రెక్టార్ స్థానం లో ఉన్న ఆ తండ్రి తను కన్సర్వేటివ్ అనార్ఖీ అని చెప్పుకుంటాడు.బయట కనబడే చాలామంది లాగే ,దేన్నీ నమ్మనివాడే..!అనార్ఖీ అనేది మాత్రం అతడిమాటల్లో,రహస్య ఆలోచన ల్లో ఉంటుంది.


ఆ అనార్ఖీ తెచ్చిపెట్టే ఫలితాల పట్ల ఉండే భయం తో తన ప్రతీ చర్య నీ కంట్రోల్ చేసుకోవడానికి కన్సర్వేటివ్ గా ఉంటాడు.అతడి ఆలోచనలన్నీ భయం కలిగించేవి గా నే ఉంటాయి.అందుకనే అతని జీవితం లో అన్ కన్వెన్షనల్ అనే దానికి బాగా భయపడతాడు.

అలాంటి కన్సర్వేటిజం,భయం ఎక్కువైనపుడు మాత్రం కుక్క మోర ఎత్తి కోపం గా ఉన్నట్లుగా అయిపోతాడు.

"సగం విడాకులు తీసుకున్న ఆ మిసెస్ ఫాసెట్ ఇంకా ఆ ఈస్ట్ వుడ్ ...అదే ఆ చారల సముద్రపు చేప గాడు నీకు ఈ మధ్య ఫ్రెండ్స్ అయ్యారని విన్నాను" అన్నాడు రెక్టార్, కుమార్తె Yvette తో.

"ఆ చారల సముద్రపు చేప ఎవరా అని ఆమె కి మొదట అర్ధం కాలేదు.కాని తండ్రి కోరల్లోని విషాన్ని కనిపెట్టింది.

"తెలిసిన వాళ్ళు...అంతే !వాళ్ళు చాలా మంచి వాళ్ళు,ఒక నెల లోపు పెళ్ళి చేసుకోబోతున్నారు" అంది Yvette.రెక్టార్ ఆమె అమాయకపు మొహం కేసి అసహ్య భావం తో చూశాడు.లోపల ఎక్కడో అతనికి భయం..!

పుటక తోనే తను భయస్తుడు.అలాంటి భయస్తులు సహజం గానే బానిస మనస్తత్వం కలిగి ఉంటారు.వాళ్ళ మెడకి ఉన్న ఇనుప కచ్చడం ఎప్పుడో ఒకప్పుడు విరిగిపోతుందని లోపల ఏదో భయం.

ఈ కారణం చేతనే ఆ రెక్టార్ ఏ ఇది లేకుండా ముడుచుకుని ఉండేవాడు.తన భార్య సింథియా అంటే ఏమిటో తెలిసే వరకు...!తన బానిస మనస్తత్వమే దానికి కారణం.ఓ బానిసకి సహజం గానే స్వేచ్చ గా ఉండే వారి పట్ల ఉండే ఓ కోపం లాంటిదన్న మాట.

Yvette కూడా స్వేచ్చ లో జన్మించినదే...ఏదో ఓ రోజున ఈ ఇనుపకచ్చడాన్ని పగలగొట్టే పని చేస్తుందని అనుమానమే.

"వాళ్ళూ నీ లాంటి వాళ్ళే అనుకుంటా.." అనాడు రెక్టార్ అవహేళనగా నవ్వుతూ..!

"వాళ్ళు చాలా నిజాయితీ గలవారు" అంది ఆమె అంటీ ముట్టనట్లుగా..!

"నిజాయితీ అనే పదానికి నీ బుర్ర లో వేరే అర్ధం ఏదో ఉందనుకుంటా.ఆ ఈస్ట్ వుడ్ ..వాడు తన కంటే పెద్ద దైన దానితో..ముఖ్యంగా దాని డబ్బుల కోసం...వీడి పాట్లు...హాయిగా బతికేయవచ్చు తేరగా అని...మరి దీంట్లో ఏమి నిజాయితీ కనిపించిందో నీకు. నాకైతే అలాటిది ఏమీ కనిపించలేదు.వాళ్ళు నీకు ఎక్కడ పరిచయం అయ్యారు..?" అడిగాడు రెక్టార్.   

"నేను సైకిల్ మీద వస్తున్నపుడు...వాళ్ళు కారు లో వస్తున్నారు. అలా మాట్లాడటం జరిగింది.నేను పొరబాటు చేశానని అనుకోవడం లేదు.ఆ స్త్రీ నిజాయితీ గా తోచింది." అంది Yvette.పాపం ఆమె బాధ ఆమెది.

"అప్పటినుంచి ఎన్నిసార్లు ఎన్ని సార్లు కలిశారు" 

"మహా అయితే రెండుసార్లు"

"ఎక్కడ"

"స్కోర్స్ బై దగ్గర ఉన్న కాటేజ్ వద్ద" 

ఆమె ని చంపేంత అసహ్యం గా చూశాడు రెక్టార్.స్టడీ రూం లోని కిటికీ కర్టెన్ల్ వద్ద కి వెళ్ళాడు.ఎలుక తప్పించుకున్నట్లు.అతని మనసు లో కుమార్తె ఏదో తప్పు చేసిందనే భావం.భార్య సింథియా జ్ఞాపకం వచ్చింది.లోపల మంట గా ఉంది.అశక్తుడవుతున్నాడు.ఆమె ప్రవర్తన భయభక్తులు లేనిది తన దృష్టిలో.కుమార్తె భయపడుతూ నిల్చుంది.అతనిలో పాత సెగలన్ని రేగి అతని అందమైన మొహం లో కోరలు సాచిన వైనం తోచింది.

(సశేషం)  



POST NO: 34

------------------


"అయితే మొత్తానికి వాళ్ళు నీకు తెలుసు,అవునా..? అబద్ధం ఆడటం అనేది  నీ రక్తం లోనే ఉంది. అది నా నుంచి వచ్చిందయితే కాదు" అన్నాడు రెక్టార్.


Yvette తల అవతల కి తిప్పుకుంది. మొహం అదోలా పెట్టుకునే నాయనమ్మ గుర్తుకు వచ్చింది.ఆమె మౌనం గా ఉండిపోయింది.


"వాళ్ళ చుట్టూ నువు తిరగడం ఏమిటి..? అంతకంటే మంచి వాళ్ళు ఎవరూ దొరకలేదా మాట్లాడటానికి..? వీధిలో తిరిగే కుక్క వా నువు,అలాంటి దంపతులతో మాట్లాడటానికి..?అబద్ధం ఆడటం కంటే ఇంకా నీచమైనది ఏమైనా ఉందా నీ రక్తం లో..? అసహ్యం గా మొహం పెట్టి అన్నాడు రెక్టార్.


"అలాంటిది ఏముంటుంది నాలో..?" అంది Yvette.చాలా బాధ కమ్ముకుంది.తను అందరి లాంటిది కాదా..? కొంత నేరతత్వం ఉన్నదా తనలో..? ఈ ఆలోచన ఆమె ని బాధించింది.


రెక్టార్ దృష్టి లో ఆమె ఏదో పెద్ద తప్పు చేసినదాని లా అయిపోయింది.తాజాదనం నిండిన పక్షి లాంటి ఆమె వదనం వెనుక అలాంటిదేదో ఉందని అతని భావన.సింథియా చేసిన పని జ్ఞాపకం రాగానే తనలో ఓ శాడిస్ట్ కదలాడాడు.అతనిలో చెలరేగే కామ ప్రేమ కూడా టప్పున చల్లారింది, ఆమె ని తల్చుకోగానే..!ఇక అసలు ఇల్లిగల్ ప్రేమ అనేది ఎలా ఉంటుందో..?

"నువు చేసింది ఏమిటో నీకు బాగా తెలుసు.ఆ పని ఇకనైనా ఆపేయడం మంచిది.నేరం చేసి పిచ్చాసుపత్రి లో తేలకముందే త్వరగా ఆ పని చెయ్యి" అన్నాడు రెక్టార్.


"ఎందుకు,అలాంటి నేనేం చేశానని..?"ప్రశ్నించింది Yvette పాలిపోయిన వదనం తో..!


"అది నీకు,నిన్ను కన్న తల్లి మధ్య లో విషయం.కొన్ని వాటిని సరైన సమయం లో ఆపకపోతే చివరి గా తేలేది అక్కడే.." అన్నాడు.


"అంటే ఈస్ట్ వుడ్ గురించి తెలుసుకోవడమేనా నేను చేసిన తప్పు..?" భయం తో కాసేపు మ్రాంపడి ,తర్వాత అన్నది.


"మిసెస్ ఫాసెట్ ఇంకా పెద్ద వయసు ఆడవాళ్ళని తగులుకునే ఆ ఎక్స్ మేజర్ ఈస్ట్ వుడ్ చుట్టూ వాసన చూసుకుంటూ తిరిగేవాడినా నేను..?..ఏమన్నావ్...ఆ...అవును నువు అనుకున్నదే నా అర్ధం" 


"అతను ముక్కుసూటిగా,సింపుల్ గా ఉండే మనిషి ...అలా అనకూడదు మీరు"


అవును...నీ వంటి వాడే" అన్నాడు రెక్టార్.


"ఒక రకంగా మీకు అతను నచ్చవచ్చునేమో..."మెల్లగా అంది.తను ఏమి అన్నదో ఆమెకి అర్ధమైనట్టు లేదు.


రెక్టార్ కర్టెన్ వెనక్కి వెళ్ళాడు.ఆమె తనని ఏదో భయపెట్టినట్లుగా..!


"చాలు...చాలు...ఇప్పటికే చాలా మాట్లాడావు.ఇక ఏ దరిద్రాన్ని నేను వినదలుచుకోలేదు" అన్నాడు.


"ఏం దరిద్రం..." ఆమె రెట్టించింది. ఆమె అమాయక వదనం చికాకు కలిగించిది.అతన్ని పిరికితనానికి గురిచేసింది.   

"ఎక్కువ మాట్లాడకు.మీ అమ్మకి మల్లే కాకముందే నిన్ను చంపేస్తా" బుసకొట్టాడు రెక్టార్.


స్డడీ రూం లోని కర్టెన్ వెనక్కి వెళ్ళిన అతని వైపు చూసింది.అతని మొహం పసుపు వర్ణం లోకి మారింది.భయం,కోపం తో ఊగిపోతున్న ఎలుక లా ఉందది.మొద్దుబారిన ఏకాంతం ఆమెలో.ఎటూ పాలు పోలేదు,ఈ సంఘటన తర్వాత..!


(సశేషం) 



POST NO:35

------------------


ఆ శూన్యాన్ని ఛేదించడం అంత తేలిక అనిపించలేదు. చివర కి ఆమె రెక్టార్ వైపు చూసింది.తండ్రి పట్ల తనకే అర్ధం కాని ఓ అయిష్టత.అతనికి అది మెడ చుట్టూ బిగిసిన చట్రం లా ఉంది.


"అంటే ఈస్ట్ వుడ్ వాళ్ళ గురించి నీకెందుకు అనా మీ ఉద్దేశ్యం?" అడిగిందామె.


"నీకు కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. అయితే నువు నాయనమ్మ తో గాని,సిస్సీ ఆంటీ తో గాని,లూసీ తో గానీ కలవకూడదు. నీ మూలంగా వాళ్ళకి చెడు పేరు రాకూడదు. మీ నాయనమ్మ మంచి భార్య,తల్లీ కూడా..! ఇప్పటికే ఆమె కి ఓ అవమానం జరిగింది.మళ్ళీ ఇంకొకటా..?" అన్నాడతను.


Yvette వినీ విననట్లు గా వున్నది.


"సరే...ఆ ఈస్ట్ వుడ్ వాళ్ళకి ఓ ఉత్తరం పంపిస్తాను,నేను వారి తో సన్నిహితం గా ఉండడం నీకు ఇష్టం లేది" అంది Yvette.  

" సరే...నీ యిష్టం. ఒకటి జ్ఞాపకం ఉంచుకో. ఇవతల నాయనమ్మ లాంటి మంచివాళ్ళు ఉంటారు.అవతల అలాంటి వాళ్ళూ ఉంటారు.ఎవరు కావాలి అనేది ఎన్నుకోవడం నేర్చుకో.."


మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. ఆమె తండ్రి వేపు చూసింది. ఆమె కి కలవరం కలిగినట్లయింది.ఎక్కడో ఆమె లో ఉన్న స్వేఛ్చా విహంగానికి ఇవన్నీ కంపరం పుట్టిస్తున్నాయి. ఆమె బయటకి ప్రశాంతం గా ఉన్నా,లోపల మాత్రం ఏదో కలత గా ఉంది. 

" సరే... మీ అసమ్మతి ని వాళ్ళకి రాస్తాను.." అన్నదామె. అతను జవాబివ్వలేదు. తను విజయం సాధించినట్లు గాదీని ఫీలయ్యాడు రెక్టార్.


"సరే...నాయనమ్మ కి,సిస్సీ ఆంటీ కి ఈ విషయం చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను.ఇది అందరకీ తెలియవలసిన అవసరం లేదు. నీ పనికిరాని స్నేహాలూ ...అవీనూ.." అన్నాడు.


కాసేపు భయంకరమైన నిశ్శబ్దం.


"సరే...నేను వెళ్ళి ఆ ఉత్తరం రాస్తాను." అందామె.


మెల్లగా ఆమె గది బయటకి వెళ్ళిపోయింది. " ప్రియమైన మిసెస్ ఈస్ట్ వుడ్ ...మీ ఇంటికి నేను రావడం మా నాన్నగారికి ఇష్టం లేదు. క్షమించి,అర్ధం చేసుకోగలరు" అంటూ Yvette ఉత్తరం రాసి దాన్ని ఆ రోజే పోస్ట్ చేసింది. 

ఆమె లోని భావాలు ఆమెకే భయం కలిగించసాగాయి. నాజుకు గా ఉండే ఆ జిప్సీ ఎద పై వాలిపోవాలని తోచింది.అతను తన చెయ్యి ఒక మారు పట్టుకుంటే బాగుండునని అనిపించింది. నీ తండ్రి చెప్పింది తప్పు అని తను చెబితే ఎంత బాగుంటుంది.


భయం తో నీరస పడిన ఆమె కి నడవాలన్నా ఓపిక లేకుండా పోయింది.నడిస్తే కాలికి దెబ్బ తగులుతుందేమో అన్నట్లు అనిపించింది.ఏదో బురద గుంటలో దిగినట్లుగా,మోకాళ్ళ లో బలహీనత తోచింది. ప్రతివారు తనని ద్వేషించుతున్నట్లు ఫీలయ్యింది.


చివరకి ఎలాగో సర్దుకుంది.ఇంట్లో తనని పోషించేవారితో పనికిమాలిన గొడవలెందుకు అనిపించింది.జీవితం నుంచి ఏదో గొప్ప గా పిండుకోవాలనేది కూడా అంత పరిణితి గల ఆలోచన కాదు. తప్పదు...పై పై హంగుల కోసమైనా కొన్ని చేయక తప్పదు మరి.


(సశేషం)   



POST NO:36

-------------------


అమె హృదయం వీటి అన్నిటి తో బండబారింది. అది ఏమిటి అని అంటే లోపల ఎక్కడో మెత్తనిదనం ఉన్నా అలా రూపు దాల్చింది.ఆమె కి గల కొన్ని భ్రాంతులు బద్దలయ్యాయి.అయితే బయటకి చూడటానికి మటుకు యధాప్రకారమే కనిపిస్తుంది.లోపల ఒక తెలియని కసి,ఎవరితో సంబంధమూ లేని స్థితి కి చేరుకున్నది.


బయటకి మాత్రం ఆ పాత వ్యక్తి లానే ఉన్నది. ఆమె ఆడే ఓ ఆట లో భాగం ఇది.పరిస్థితులు అలానే ఉన్నప్పుడు తానూ అలాగే కనిపించాలిగదా. లోపల తాను అనుకునేది వేరు.


ఇపుడు తనచుట్టూ ఉన్నవాళ్ళని చూస్తుంటే కక్ష తీర్చుకోవాలి అన్నట్లు కనిపిస్తున్నారు.రెక్టార్ పైకి ఎంత అందంగా కనిపించినా అతనిలో ఏదో శక్తిహీనత కనిపిస్తోంది. అది తనకి నచ్చడం లేదు.మళ్ళీ ఇష్టపడకుండానూ ఉండలేదు. భావాలు అనేవి కలగాపులగంగా ఉంటాయి.వివరించడమూ కష్టమే.

ఇక నాయనమ్మ ...అందరికంటే ఆమె అంటేనే చిరాకు.ఆ కుర్చీ లో ఏదో ఫంగస్ అతుక్కుపోయినట్టు కూర్చునే ఆ లావుపాటి ముసలామె ...ఆ భుజాల మధ్య చుబుకాన్ని అటూ ఇటూ కదిలిస్తూ ఉంటుంది. Yvette కి ఆమె అంటే అసహ్యం...అలా చేయడం కూడా ఆమెకి ఆనందమే.దాంట్లో దాపరికం ఏమీ లేదు.ఎంత గట్టిగా అసహ్యించుకుంటే అంత ఆనందం.

ఆ లేస్ టోపి పెట్టుకుని ,ఎర్రటి మొహాన్ని కాస్త వెనక్కి వాల్చి కూర్చిని ఉంది ముసలామె.తెల్ల వెంట్రుకలు,చట్టి ముక్కు...అయినా మొండితనం కి సూచన గా ఉంటుందది.ఆ ముసలి నోరు మూసుకున్నప్పుడు వల లాగా ఉంటుంది.ఈ వయసు లో ఎలా ఉంటుందీ అంటే పెదాలు లేని చిరు కప్ప లా ఉంటుంది.దవడలు కదులుతుంటే ఏదో ట్రాప్ చేయడానికి అన్నట్లుగా ఉంటాయి.ఆ కింది దవడ ని పైకి ఆడిస్తుంటే...మహా అసహ్యం గా ఉంటుంది తనకి.ఆ చప్పిడి ముక్కుని పైకి అన్నప్పుడల్లా ఆ మొహం అంతా వెనక్కి పోతుంది కొద్దిగా.ఆ గోడ లాంటి నుదురు కూడా.ఆ దృశ్యం తనకి ఒకసారి చూస్తే ఎవరికైనా భయం గా అనిపిస్తుంది.ఏదో ఆ చిరు కప్ప లేదా తాబేలు జాతి తప్పా మనిషి లా మాత్రం తోచదు.అసలీమె కి మరణమే లేదన్నట్లుగా ఉంటుంది.ఏదో సగం కోమా లో ఉన్నా కీటకం మాదిరిగా అనిపిస్తుంది.     

నాయనమ్మ ...పెద్ద గొప్పేమీ కాదు అని అంటే తండ్రి అసలు ఒప్పుకోడు. కూతుర్ని నువు పిచ్చాసుపత్రి కి తగినదానివి అని భయపెడతాడు.ఎప్పుడూ ఆ మాట తోనే భయపెట్టేది...అదెప్పుడూ ఆయనకి రెడీ గా ఉంటుంది.ఈ ఇల్లు,బంధువులు,ఆ ముసలామె పట్ల గల అయిష్టత అన్నీ కలిపితే ఇంతకంటే ప్రమాదకరమైన పిచ్చాసుపత్రి ఎక్కడ ఉంటుందని..? 

కోపం,నిరాశ ఆవరించినపుడు అనిపిస్తుంది.

"ఎంత మృగప్రాయమై పోయిందీ ఇల్లు.లూసీ ఆంటీ,నెల్ ఆంటీ,అలీస్ ఆంటీ,కాకుల్లా చుట్టూ కూర్చుని స్కర్ట్ లు లేపుకుని చలికాగుతుంటారు.వాళ్ళతో పాటూ ఆ ముసలామె ఇంకా సిస్సీ ఆంటీ. తనని Lucille ని బయటకి పంపి మరీ.మేము ఇక్కడ ఇంట్లో వాళ్ళలా కనిపించడం లేదు."

 తండ్రి ఆమె వైపు ఏమిటీ అన్నట్టు చూశాడు. ఆమె మాటలో కోపాన్ని,బిరుసుతనాన్ని చూపించింది.అలాంటప్పుడు దాన్ని చిన్నపిల్ల చేష్ట లా తీసుకుని అతను నవ్వేస్తాడు.అయితే ఎక్కడో తనకీ తెలుసు ఆమె లో ఎంత కోపం తో ఆ మాటలు పెల్లుబికినాయో.జాగ్రత్త పడ్డాడు.

ఈ Saywells కుటుంబం లో తన జీవితం ఎంత ఒరిపిడి తో కూడుకున్నదో...దాంట్లో తను మునిగిపోయి ఉంది.ఆ విధం గా అయినందుకు రెక్టార్ అంటే రోత లా అనిపించింది.ఎక్కడికీ పోలేదు ,కాని రోత చాలా తీవ్రంగా.దాంట్లోనే ఆమె కుదురుకు పోయింది.ఏవిట్రా బాబూ అనుకుంటూ.అదీ రోత తోనే.

ఈస్ట్ వుడ్ వాళ్ళు ఇపుడు గుర్తుకు రాలేదు. ఏమాటకి ఆ మాట ఆ యూదు చిన్నారి ది ఎంత తిరుగుబాటు ఈ నాయనమ్మ తోనూ,తమ Saywell కుటుంబం తో పోలిస్తే..!భర్త అంటే ఓ సాధారణ విషయం కంటే ఎక్కువ ఏమీ కాదు.కాని కుటుంబం...ఈ ఫంగస్ తో కూడుకున్న,సగం చచ్చిన ముసలామె లాగానే అలాగే అంటుకు ఉంటుంది.ఎలా దీనితో మసిలేది..?

(సశేషం)  


POST NO:37

--------------------


ఆమె పూర్తి గా ఆ జిప్సీ ని మరిచిపోలేదు. అయితే అతని కోసం సమయం కేటాయించే స్థితి కూడా లేదు.చాలా బోరు గా అనిపిస్తోంది.చేయడానికీ ఏమీ లేదు.ఏదీ సీరియస్ గా ఆలోచించే సమయం లేదు.ఏదో జీవితం అలా వెళ్ళిపోతోంది.


ఆమె జిప్సీ ని రెండు సార్లు చూసింది.ఒకసారి వాళ్ళ ఇంటికి సామాన్లు అమ్మడానికి వచ్చినపుడు,కిటికీ లోనుంచి చూసింది గాని కిందికి వెళ్ళలేదు.అతను బండి లో సామాన్లు ఎక్కించుకుంటూ వెనక్కి తిరిగి తనను చూశాడు. చూడనట్టుగానే మిన్నకున్నాడు. తమ సామాజిక జీవనానికి వెలుపల ఉండే వ్యక్తి తను,ఒక కోపం తోనూ..అంతంత బ్రతుకుతెరువు తోనూ.అయితే ఏమిటి చాలా గీర గా ఉన్నట్టు కనిపిస్తాడు ఆ జిప్సీ,మళ్ళీ ఇంకో వైపు ఎందుకైనా మంచిదని జాగ్రత్త గానూ ఉన్నట్టు అగుపిస్తాడు. ఇంగ్లీష్ వారి చట్టాలు కఠినం గా ఉంటాయన అతనికి తెలుసు. అతని ఇష్టానికి వ్యతిరేకం గానే ఆ రోజుల్లో ఇంగ్లీష్ వారి తరపున యుద్ధం లో ఫాల్గొన్నాడు.   

ఇప్పుడు అతను రెక్టరీ పరిధి లో కనిపించాడు.బయట ఆ తెల్ల గేటు దగ్గర తన బండి లో కి మెల్లగా సామాన్లు సర్దుకుంటూ..! బయటి వారెవరికీ లొంగని నైజం ...ఒంటరి గా ప్రశాంత తో పనిచేసుకునే విధానం ఆ వ్యక్తి కి ఒక భయం గొలిపే హుందా ని ఇచ్చింది. ఆమె తనని చూసిందని అతనికి తెలుసు. తను అమ్మే ఈ రాగి పాత్రల్ని ...వీటన్నిటినీ....నలిగిపోయిన దారి గుండా వెళుతుండగా..!   

ఆమె హృదయం రాగిపాత్రల్ని చేసేటప్పుడు కొట్టే సుత్తి దెబ్బల మాదిరిగా కొట్టుకుంటున్నది,ఈ పరిస్థితుల్లో..! పైకి కనీ కనబడనట్లు గానూ,లోపల మాత్రం రహస్యం గానూ..! నిశ్శబ్దం గా, క్లీన్ కట్ గా ఉండే అతని తీరు ఆమె కి నచ్చింది.విజయం వరిస్తుందో లేదో కూడా అతనికి అవగాహన లేదు.అయినా ప్రతికూల పరిస్థితి లో కూడా నిలదొక్కున్నట్లు ఉండే ఓ అతని లోని మార్మికత తనకి నచ్చింది. వింతైన పట్టువిడువనితనం,నెమ్మెదితనం,ఇవి యుద్ధానంతరం వచ్చిన లక్షణాలు. అవును, తను కనక ఎటు వైపు ఉండాలి అనుకున్నప్పుడు అతని తెగ వేపే మొగ్గుతుంది.ఇప్పటికే ఆమె హృదయం అతని తో వెళ్ళిపోయింది. ఒక అంటరాని జిప్సీ స్త్రీ లా అయింది తను.  

కాని తనకి సౌకర్యం గా ఉండటం అంటే ఇష్టం. ఒక ప్రిస్టేజ్ అనేది ఉండాలి. రెక్టార్ కుమార్తె గా తనకి ఓ గౌరవం ఉంది.అలా ఉంటే తనకి ఇష్టం.గుడి స్థంబాలకి ఉండే పిల్లర్లకి వాటి మీద పెచ్చులు ఊడి ఉండవచ్చుగాక.కాని లోపల ఉండే తనకి అవి ఇష్టం.

"ఇరవై ఆరేళ్ళు వచ్చేవరకు వేచి ఉండటం మంచిదో కాదో నాకంత గా తెలీదు.అదే పెళ్ళి చేసుకోవడానికి" అంటుంది Lucille. ఇది ఆమె తనకంటే పెద్ద వయసు స్త్రీల వద్ద తెలుసుకున్నది. ఆ లెక్కన ఇపుడు Yvette కి ఇరవై ఒక్క ఏళ్ళు,అంటే ఇంకో నాలుగేళ్ళు ఆగవచ్చు. ఇరవై ఆరు ఏళ్ళ వయసు అంటే Leo లేదా Gerry లాంటి వాళ్ళు వస్తారు. ఈ లోపులో అనుకుంటే జిప్సీ అవ్వవలసిందే తను. 


కాబట్టి ఏ స్త్రీ అయినా తనది తాను సంపాదించుకోవాలి. అది ఏదయినా..!


తమ Saywell కుటుంబం అంటేనే Yvette కి మహా మండుతుంది. తెలివైన వాళ్ళు,ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు. యువతరానికి ఉండే జ్ఞానం అనేది ఎప్పుడూ వెనకటి తరం కంటే ముందుచూపు తోనే ఉంటుంది.


తాను ఆ జిప్సీ ని రెండవ మారు కలిసింది. అది మార్చ్ నెల, అసలు వర్షం అన్నది లేని సమయం. పొదల్లో Celandines అనే పసుపు పచ్చని పువ్వులు,రాళ్ళ దాపుల్లో Primroses పువ్వులు పూస్తున్న కాలం. ఎక్కడో దూరం గా స్టీల్ సామాను  చేసే పనులు జరుగుతున్నాయేమో సల్ఫర్ వాసన వస్తోంది.

ఇంకా అది వసంత కాలం కూడా..!

Codnor gate వద్ద నుంచి సైకిల్ మీద వస్తోంది Yvette. అది క్వారీ దాటిన తరువాత వచ్చే ప్రదేశం. తన రాతి కాటేజి తలుపు ని తెరుచుకుని వస్తోన్న ఆ జిప్సీ కనబడ్డాడు. అతని బండి రోడ్డు మీద ఆగి ఉంది. తను అమ్మే చీపుళ్ళ ను, రాగి పాత్రల ను దానిలోకి ఎక్కిస్తున్నాడు.

(సశేషం)      


POST NO:38

--------------------


అతడిని చూసి ఆమె సైకిల్ దిగింది. గ్రీన్ జెర్సీ లో తీరు గా కనిపించాడు ఆ జిప్సీ. నిశ్శబ్దం గా అటు తిరిగాడు. ఈ ప్రపంచం లో అతని గూర్చి తనకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరనిపించింది.


"ఏవిటి..? మంచివి, కొత్తగా పాత్రలు ఏమైనా చేశావా..?"  అతని రాగి పాత్రలు చూస్తూ ప్రశ్నించింది Yvette. 


"అలా ఏమీ లేవు.." ఆమె వేపు తిరిగి అన్నాడు.


అతని కళ్ళలో అదే కోరిక ...ఆసక్తికరంగా ప్రతిఫలిస్తూనే ఉంది. అయితే మరీ బాహాటం గా కాదు.ఎక్కడో మూలన..!ఆమె తన రాగి,ఇత్తడి పాత్రల్ని గమనిస్తూండడం చూశాడు.ఆమె తో జాగ్రత్తగా పరిశీలిస్తోంది.


ఒక చిన్న ఇత్తడి ప్లేట్ గుండ్రం గా ఉంది.దాని మీద వింతైన తాడి చెట్టు లాంటిది ముద్రించి ఉంది.


"అది బాగుంది,ఎంత అవుతుంది..?" అందామె.


"నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు.." అన్నాడు తను.


ఆమె కి ఉసూరుమనిపించింది. తనంటే ఎగతాళి నా ఏమిటి..?


"రేటు నువు చెబితేనే బాగుంటుంది" అతని వేపు చూస్తూ అంది.


" నీకు నచ్చినంత ఇవ్వు.." అన్నాడు.


"అలా అయితే ఎలా..? రేటు చెప్పకపోతే నేను తీసుకోను" అంది.


"సరే...రెండు షిల్లింగ్ లు ఇస్తే సరిపోతుంది" అన్నాడు తను.

ఆమె హాఫ్ క్రౌన్ ని తీసి అతని చేతిలో పెట్టింది.ఆమె కి రావలసిన చిల్లర ని జేబు లో నుంచి తీసి ఆమె కి ఇచ్చాడతను. ఆరు పెన్నీలు అది.


"మా ముసలావిడ నీ గురించి చెబుతూంటుంది.." ఆమె వైపు ఆసక్తి తో, వెతుకుతున్నట్లు గా చూస్తూ అన్నాడు.


"నిజంగానా..?...ఏం చెప్పాలని..?" కేక పెట్టి మరీ ప్రశ్నించింది.


"ఆమె చెప్పడం ఏమిటంటే...నువ్వు ధైర్యం గా ఉండాలి లేకపోతే అదృష్టం రాదు. అంటే బయటకి,హృదయం లోనూ రెండు విధాలా అలా ఉండాలని. నీటిని ఓ కంట కనిపెట్టి ఉండాలని కూడా.."


ఆమె ఖుషీ అయింది.


"అంటే ఆ మాటల అర్ధం ఏమిటి..?" ప్రశ్నించింది.


"అడిగాను.అంతే తెలుసు..అంతకు మించి తెలియదంది" అన్నాడతను.


"మళ్ళీ ఓ సారి చెప్పు...ఆమె మాటల్ని" అంది.


అతను అదే మాటల్ని తిరిగి చెప్పాడు.


అతను నిశ్శబ్దం గా ఆమె మృదువైన వదనం ని పరికించాడు.ఏదో సువాసన ఆమె నుంచి తన వైపు ప్రసరించినట్లు తోచింది.


ఆ మాటల్ని నెమరు వేసుకుంది Yvette. "ఇప్పుడైతే నాకు అర్ధం కాలేదు గాని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను"  అనుకుంది.

అతని వైపు అలాగే చూసింది. స్త్రీ అయినా పురుషుడు అయినా లోపల అనేక పొరలు గా ఉంటారు. ఒక కోణం లో జిప్సీ ని ఇష్టపడుతుంది,ఇంకా మిగతా కోణాల్లో తను అతడిని పట్టించుకోదు ఇంకా చెప్పాలంటే అంత ఇష్టమూ కాదు.


"మరయితే ఆ మొదలు దాకా రావట్లేదా..?" అడిగాడు తను, ఆమె అంత పట్టింపు లేనట్లుగా చూసింది.


"మళ్ళీ ఎప్పుడైనా..." అంది తిరిగి.


"మేము తొందర లో ఇక్కడ నుంచి వేరే ప్రదేశం వెళ్ళిపోతున్నాం..వసంత రుతువు ప్రవేశింది గదా.." సూర్యుడి వైపు చూసి చిన్నగా నవ్వాడు తను.


"ఎప్పుడు.." ప్రశ్నించింది.


"బహుశా వచ్చే వారం" 


"ఎక్కడికి" 


ప్రతిగా అతను, తల అలా ఊపి " బహుశా ఉత్తర దిక్కు వేపు"  అన్నాడు.


"సరే..మీరు వెళ్ళే లోపు వచ్చి వీడ్కోలు చెబుతాను...నీ భార్య కి ,జాతకం అదీ చెప్పిన ఆ ముసలావిడ కి.."  అతని వేపు చూసి చెప్పింది.


(సశేషం)  


      

POST NO:39

----------------


Yvette తన అన్న మాట నిలుపుకోలేదు. మార్చ్ మాసం లోని రోజులు చాలా ప్రేమపూర్వకమైనవి. అవి అలా జారి పోయాయి.ఏ పని చేయాలన్నా ఒక లాంటి నిర్లక్ష్యం...ఆవరించింది.ఎవరో తనని చేసేలా చేయాలి.అప్పుడు గాని ఏదీ చేయాలనిపించదు.తన జీవితక్రీడ పట్ల కూడా ఏదో నిరాసక్తత..!  

ఆమె జీవితం మామూలు గా వెళ్ళిపోతోంది.ఫ్రెండ్స్,పార్టీలు ఇంకా లియో తో డాన్స్ లు అలా..!ఆ పై దాకా వెళ్ళి జిప్సీ వాళ్ళ కి వీడ్కోలు చెప్పాలి అనుకుంది. దాన్ని ఆపేదెవరు..? ఎవరూ లేరు.

ఆ శుక్రవారం మధ్యానం వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకుంది.సూర్యుడు ప్రకాశిస్తున్న వేళ...వసంతం లో పూచే క్రొకసస్ పూవులు దారి పొడవునా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. తేనెటీగలు అప్పుడప్పుడే వస్తున్నాయి.ఆ రాతి బ్రిడ్జ్ పై గల ఆర్చ్ ల్ని పెనవేసుకుని పాపల్ తీగలు పాకుతున్నాయి.మెజిరియన్ చెట్ల ఆకుల వాసన తగులుతోంది.  

బాగా లేజీ గా ఉంది ఈ రోజు. నది కి పక్కనే ఉన్న తమ గార్డెన్ లో పచార్లు చేసింది. సగం మగత గానే..!ఈ వసంత కాలం లోని సూర్య రశ్మి కాస్త ... ప్రకాశించగానే బయటకి వెళుతుంది తను. లోపల చూస్తే బామ్మ.నల్లటి దుస్తుల్లో,తెల్లటి లేసు కేప్ పెట్టుకుని చలి కాగుతూంటుంది. 

నెల్ ఆంటీ చెప్పేది వింటూ. శుక్రవారం లంచ్ చేయడానికి వస్తుంది నెల్ ఆంటీ.ఇక ఆ రోజు అంతా ఆమెదే.ఆ నలభై దాటిన విడో, బామ్మ కూతురే...ఇద్దరూ ఏదో గాసిప్ లో మునుగుతారు.ఆ తర్వాత టీ తాగి ఆమె నిష్క్రమిస్తుంది.సిస్సీ ఆంటీ ఈ లోపు ముందుకి వెనక్కి తచ్చాడుతూంటుంది. శుక్రవారం రోజు రెక్టార్ టౌన్ కి వెళతాడు. ఇంటి పనిమనిషి కి కూడా సగం పూట సెలవు.   

Yvette గార్డెన్ లో ఓ చెక్క బెంచి మీద కూర్చుంది. ఉరకలెత్తుతూ సాగే నది కి ఆ ప్రదేశం అతి చేరువ లో అంటే ఒడ్డు కే ఉంటుంది.ఆ చుట్టుపక్కల రకరకాలా పొదలూ అవీ ఉన్నాయి.సిస్సీ ఆంటీ అల్లంత దూరాన ఇంటి చేరువ లో నుంచి అడిగింది,టీ ఏమైనా కావాలా అని..? పక్కన నది చేసే అలల చప్పుడు కి Yvette కి వినబడలేదు. అయినా అర్ధం చేసుకుని ఏమీ వద్దన్నట్లు తల అడ్డంగా ఆడించింది.

ఆ జిప్సీ గురించి తను మర్చిపోలేదు. అలా సూర్య రశ్మి కి కూర్చున్నా..!ఆమె మనసంతా సగం బాధ గానూ,సగం మామూలు గానూ ఉంది.ఎక్కడో తిరుగుతోంది.కొన్ని రోజులు అది ఫ్రేంలీ కుటుంబీకుల వద్ద,కొన్ని రోజులు ఈస్ట్ వుడ్ కుటుంబీకుల వద్ద తిరుగుతుంది.తను అక్కడికి వెళ్ళకపోవచ్చు గాక..!ఈరోజు జిప్సీ ల వద్ద ఉంది. ఆ క్వారీ దగ్గర కి వెళ్ళింది.అక్కడ సుత్తి తో రాగి పాత్రల్ని కొడుతున్నాడు ఆ వ్యక్తి..తలెత్తి రోడ్ వేపు చూశాడు.పిల్లలు గుర్రపు బండి వద్ద ఆడుకుంటున్నారు.బలం గా కనిపించే ఆ జిప్సీ అతని భార్య సామాన్లు తీసుకొస్తున్నది,ఆమెతో బాటు ఆ జిప్సీ ముసలతను కూడా..!తనూ ఈ కుటుంబానికి చెందినదే అనిపించింది.అంటే ఈ జిప్సీ వాళ్ళ  తాత్కాలిక నివాసం,ఈ పొయ్యి,ఈ సుత్తి తో కొట్టే మనిషి, ఈ స్టూలు, ఈ పాత గుర్రం...అన్నీ తనవే అన్నట్లు బలం గా తోచింది. 

తనకి ఏదైనా ప్రదేశం నచ్చితే అలా ఊహించుకోవడం ఆమె యొక్క స్వభావం.ఈ మధ్యానం ఇదిగో ఈ జిప్సీ ల ప్రదేశం.గ్రీన్ జెర్సీ లో ఉన్న ఈ జిప్సీ మనిషి తనకి ఇది ఇల్లు లా చేశాడు. ఈ సంచారం,ఈ పిల్లలు,ఇతర స్త్రీలు అంతా తనకి సహజమే అనిపిస్తోంది. ఇక్కడే పుట్టినట్లు తోచింది.ఇదంతా ఆ జిప్సీ కి తెలుసా..ఏమో..!తను పొయ్యి కి దగ్గర లో స్టూల్ మీద కూర్చున్నప్పుడు...అతను తలెత్తి తనవేపు ఓ గులాబీ ని చూసినట్లు చాడటం...తను మెల్లిగా అటు చూడటం..ఆ గుర్రపు బగ్గీ వేపు...తనకి తెలుసా అది..?

 అలా ఆలోచిస్తూ,తమ ఇంటికి ఉత్తరదిక్కున ఉన్న పొడవాటి లార్చ్ చెట్ల ని చూసింది.రోడ్ మీద కి చూస్తే ఏమీ కనిపించలేదు.ఎక్కడో కొద్దిగా దిగువన ,నది వంపు తిరిగే చోట ఏవో రాళ్ళు తుళ్ళి పడినట్లు గా,అటూ ఇటూ పడినట్లుగా అనిపించింది.గార్డెన్ ని దాటి బ్రిడ్జ్ వేపు కి వరద ఉరవడి గా వచ్చింది. ఏదో ఉపద్రవం వస్తోంది అంటూ మనసు లో అనుకుంది. ఆ చప్పుడు అంతా మనసుదే...కంగారు లేదు అనుకుంది అంతలోనే.

పొంగుతూ వస్తోన్న నది వంపు తిరిగింది.అప్పుడు తను గమనించింది మళ్ళీ.ఆ పళ్ళ చెట్లని,ఇంటి కిచెన్ వెనుక ఉన్న తోట ని దాటి రానే వస్తోంది.నైరుతి వేపు అదిగో..ఎండిపొయిన లార్చ్ చెట్ల తో చిన్న వనం లా ఉండే ఆ వేపు...ఇంటికి కొద్దిగా పై భాగం లో...రానే వస్తోంది.తోటమాలి ఏదో పని చేసుకుంటున్నాడు. 

ఆంటీ సిస్సీ,ఆంటీ నెల్ ఇద్దరూ బయటకి వెళుతూ Yvette వేపు చెయ్యి ఊపి గుడ్ బై చెప్పారు.సిస్సీ ఆంటీ చెప్పింది పూర్తిగా అర్థం కాలేదు గాని "లోపల బామ్మ ఒక్కతే ఉంది చూడు" అన్నట్లు గా అనిపించింది.

"సరే" అంది Yvette అన్య మనస్కం గా. 

మళ్ళీ ఆమె బెంచ్ మీద కూర్చుంది,వెళ్ళిపోతున్న వాళ్ళిద్దర్ని చూస్తూ.ఆ బ్రిడ్జ్ దాటి కొద్దిగా ముందు కి ఉన్న స్లోప్ వేపు వెళుతున్నారు.నెల్ ఆంటీ చేతి లో పెట్టె ఉంది,వచ్చేటప్పుడు బామ్మ కి ఏవో తెస్తుంది,మళ్ళీ వెళ్ళేటప్పుడు కూరగాయలు అవీ తీసుకుపోతుంది.ఆ ఇద్దరూ కనుమరుగయ్యారు.సిస్సీ ఆంటీ దిగబెట్టడానికి అన్నట్లు అలా నడిచినంత దూరం నడిచి వచ్చేస్తుంది.

సూర్యుడు తన వెలుతురు ని మెల్లిగా తగ్గించుకుంటున్నాడు.అయ్యో...అయితే ఇక లోపలకి వెళ్ళిపోవలసిందేనా...ఆ పాత గదులు...ఆ బామ్మ..! మళ్ళీ సిస్సీ ఆంటీ అవే నా ఇక..! అయిదు గంటలు దాటింది. అందరూ టౌన్ నుంచి తిరిగి వస్తుంటారు. ఆరు దాటితే,మహా చికాకు గా ఉంటుంది.

(సశేషం) 


POST NO:40

-----------------


నీటి ప్రవాహ శబ్దం తో బాటు అటువేపునుంచి లార్చ్ చెట్లు ఉన్నవేపు నుంచి ఏదో బండి వస్తోన్న అలికిడి అనిపించింది. ఏవిటా అన్నట్లు తిరిగిందామె. తోటమాలి కూడా అటే చూస్తున్నాడు.లోపలికి వెళ్ళడం ఇష్టం లేక అక్కడే ఆ నది పక్కనే పచార్లు చేసింది.సిస్సీ ఆంటీ వస్తోందా అని రోడ్డు వేపు చూసింది.ఆమె గనక చూసే మాటయితే లోపలికి వెళదాం అనుకుంది.


ఎవరో అరుస్తున్నారు.తల తిప్పి చూసింది.ఆ లార్చ్ చెట్ల దగ్గర రోడ్డు మీద అల్లంత దూరాన జిప్సీ కనబడ్డాడు.తోటమాలి కూడా ఆందోళనగా పరిగెత్తుకొస్తున్నాడు.ఉన్నట్లుండి ఒక పెద్ద శబ్దం చెవులు చిల్లులు పడేలా వినబడింది. జిప్సీ చేతి తో సైగలు చేస్తున్నాడు.వెనక్కి తిరిగి చూసింది.


చాలా భయంకరంగా పెద్ద అలలతో వరద వచ్చేస్తున్నది. ఆశ్చర్యం గా అనిపించింది.అంత పెద్ద శబ్దానికి మిగతావేవీ ఆగడం లేదు.కొట్టుకొస్తున్నాయి.బలహీనం గా,నిశ్చేష్టురాలైంది.ఏం చేయాలో తోచని ఆమె అలాగే ఉండిపోయింది.


ఇంతలోనే ఆలోచించేలోపే నీటి అలలు పర్వతం మాదిరి గా గర్జిస్తూ వచ్చేశాయి. భయం తో స్పృహ తప్పినట్లు అవుతోంది.ఆమె కి అంతలోనే జిప్సీ అరుపు వినిపించింది.దగ్గరగా వచ్చేశాడతను.తన నల్ల కళ్ళతో సైగ చేస్తూ అన్నాడు.


" పరిగెత్తు..త్వరగా" అంటూ ఆమె చెయ్యిని పట్టుకున్నాడు.


అప్పటికే మొదటిగా ఉరికి వచ్చిన అల ఆమె కాళ్ళని తాకింది.సుడులు తిరుగుతూ,శబ్దం చేస్తూ.ఒక్కసారిగా ఆ వరద తోట మొత్తాన్ని మింగేయడానికి వచ్చినట్లుంది. వింతగా ఓ నిశ్చల చిత్రం గా అనిపించింది.మరి కారణం తెలియదు,అలా అనిపించింది అంతే. భయంకరమైన నీటి ప్రవాహం వస్తూనే ఉంది.


ఆ జిప్సీ ఎంతో కష్టం మీద ఆ వరద ని నిలదొక్కుకుంటూYvette ని కూడా తనతో పాటు ఇంటి సమీపానికి తీసుకువచ్చాడు. అప్పటికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆ ఇంటికి చుట్టూ గార్డెన్,దాన్ని ఆనుకుని పచ్చిక తో కూడిన ఒడ్డు ఉంది.మొత్తానికి ఆమె ని ఎలాగో లాక్కుని వచ్చాడు. కిటికీలు దాటి ఇంటి ముందు ఉన్న మెట్ల దగ్గరకి చేర్చాడు. ఈ లోపు మళ్ళీ ఒక పెద్ద వరద ప్రవాహం దూసుకొచ్చింది. చెట్లని వాటిని ముంచేస్తూ..!


ఆమె కి ఏదో జిల్లుమనే చల్లదనం తో కూడిన ప్రవాహం లో పోతున్నట్లుగా అనిపిస్తోంది.జిప్సీ యొక్క చెయ్యి ఆమె నడుము ని గట్టిగా పట్టుకుని ఉంది.అలాగే మునకలేస్తూ ఓ దరికి చేర్చాడు ఆమెని..!ఆమె కి ఎక్కడో గాయం అయినట్లుగా అనిపిస్తోంది.  


గోడకి పాకిన విస్టేరియా పాదు యొక్క మొదలు ని పట్టుకుని నిలబడ్డాడు తను.నీళ్ళు బలంగా గోడని తాకుతున్నాయి.ఇప్పుడు ఆమె తల నీటి కి బయటే ఉంది.ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు.ఆమె కి నిలబడటానికి పట్టు దొరకడం లేదు.ఏదో కలలో తన్నుకులాడుతున్నట్లు అనిపిస్తోంది.చెయ్యి ఆమె చుట్టూ వేసి పట్టుకున్నాడు.


ఆమె అతని కాలుని దొరకబుచ్చుకునేంత గా వెళ్ళింది.కిందికి జారుతున్నట్లు అనిపించడం తో, ఆమె ని విస్టేరియా మొదలు వద్దకి గట్టిగా లాగాడు.నీళ్ళు ఆమె మోకాళ్ళ పైకే ఉన్నాయి.ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు.


"తొందరగా మెట్లు ఎక్కేసెయ్" అంటూ అతను అరిచాడు.


ఆమె అటూ ఇటూ చూసింది.కదలడానికి బలం చాలడం లేదు.అతను పులి లాగా అటూ ఇటూ చూసి బలంగా ఆమెని తననుంచి ముందుకి నెట్టాడు.ఆమె గోడకి మరింత చేరువ అయింది. నీళ్ళ ఉధృతి కొద్దిగా తగ్గింది.సోలిపోతున్నట్లుగా కూడదీసుకుని నడవసాగింది.గుమ్మం దగ్గర ఉన్న మెట్ల వద్ద కి చేరుకుంది,అతను కూడా చేరుకున్నాడు.   

(సశేషం) 


POST NO:41

-------------------


వరద ఉరవడి భయంకరం గా గర్జిస్తున్నది. ఎట్టకేలకు ఇద్దరూ మెట్ల మీదకి చేరుకున్నారు. ఇంటి గోడ కంపిస్తున్నది. వరద నీరు వాళ్ళ కాళ్ళని మళ్ళీ మళ్ళీ తాకుతున్నాయి.జిప్సీ వెళ్ళి హాల్ తలుపులు తీశాడు.ఆ పిమ్మట తడిసిన దుస్తుల తోనే పై అంతస్తు కి ఎక్కసాగారు.ఇటు చూస్తే హాల్ లో నాయనమ్మ కనిపించింది.ముడుచుకుని డైనింగ్ రూం కి దగ్గరలో ఉంది. చేతులెత్తి సైగ చేస్తున్నది.వరద తటాలున మొట్ట మొదటిగా ఆమె కాలిని తాకడం తో ,భయం తో నోరు తెరిచింది.

Yvette కి ప్రస్తుతం ఏమీ కనబడటం లేదు. పై అంతస్తు ఎక్కే మెట్లు తప్పా..!ఆమె భయం తో తడిసిన పిల్లి లా అయిపోయింది.పక్కనే ఉన్న బానిస్టర్ ని పట్టుకుని కొద్దిగా సేద తీరింది.ఇల్లు కంపిస్తున్నది. కింద నీళ్ళు బాగా వచ్చేస్తున్నాయి. ఆ జిప్సీ ఆయాసం తో దగ్గుతున్నాడు. అతని కేప్ కూడా పడిపోయింది.తన నల్లని ముంగురులు కళ్ళమీద పడుతున్నాయి.హాల్ లోకి వచ్చిన నీటిని అలానే చూస్తున్నాడు.

బానిస్టర్ రైలింగ్ ని పట్టుకున్నప్పుడు,అతని చేతికి ఉన్న వెడ్డింగ్ రింగ్ తళుక్కుమన్నది. 

"పరిస్థితి ఏమీ బాగోలేదు..బాగోలేదు" అన్నాడు తల వెంట్రుకల్ని చేత్తో పైకి అనుకుంటూ. దానితో పాటుగా దగ్గుతున్నాడు.

ఇల్లు కంపించుతున్న శబ్దం. పడిపోయినా పోవచ్చు.వరద నీరు సముద్రం లా ఉంది.ఎక్కడ చూసినా నీళ్ళే.

Yvette ఒక్క ఉదుటున ఎక్కడలేని సత్తువ కూడదీసుకుని పైకి ఎక్కేసింది వేగంగా..!ఇంటి పరిస్థితి చూస్తే ఎప్పుడు కూలుతుందో అన్నట్లు గా ఉంది.

"ఇల్లు మునుగుతున్నట్లుగా ఉంది" అరిచాడు జిప్సీ. ఆమె ఆందోళన గా ఉంది.

"అన్నట్లు చిమ్నీ...వెనుక రూం లో ఉండే చిమ్నీ ఎక్కడా...అక్కడికి పోవడం మంచిది" అన్నాడతను. అక్కడ వెనుక ఒక రూం ఉంది. రెండు కిటికీలు ఉన్నాయి దానికి.వాటికి ఇరువైపులా పెద్ద చిమ్నీలు ఉన్నాయి. జిప్సీ దగ్గుతూ,వణుకుతూ వేగంగా కిటికీ దగ్గరకి ఉరికాడు,బయట కి చూసేందుకు. ఆ ఇంటికి ,ఎత్తుగా ఉన్న గుట్ట కి మధ్య చాలా వేగంగా పోతూన్న ఓ కాలువ ఉన్నది. ఇంకా కుక్కల్ని పగటిపూట చూసుకునే ఓ కేంద్రమూ ఉన్నది.అలాగే దగ్గుతూ కిందికి చూశాడు. చెట్లు గిట్లూ అన్నీ నేలకొరుగుతున్నాయి. ప్రవాహం లోతు పది అడుగులు ఉండవచ్చు.   

ఏమి చేయాలో అర్ధం కాలేదు. భయం గా చేతుల్ని గుండె కి ఆంచుకున్నాడు. Yvette కేసి చూశాడు.మరోవేపు భయంకరమైన ప్రవాహం ఇంటిని అతలాకుతలం చేస్తున్నది. ఇల్లు ఒక వేపుకి కుంగింది. ఇద్దరూ భయానికి లోనయ్యారు. ఏమి చేయలేని స్థితి ఇంకోవేపు.

"ఇదిగో..ఇక్కడ...ఫర్వాలేదు.బాగానే ఉంది. అటు చిమ్నీ ఉంది చూడు,చాలా ఎత్తుగా..! సరే..నువ్వు దుస్తులు తీసేసి మంచం మీద పడుకో...లేదంటే ఇదిగో ఈ చలి తో మరణించే ప్రమాదం ఉంది..!" అన్నాడు జిప్సీ.

(సశేషం)  

 

   POST NO:42

------------------


 "ఆ..ఇపుడు ఫర్లేదు..సరే..సరే.." అంటూ ఆమె ఒక కుర్చీలో కూర్చుంది. తెలవెంట్రుకలు తడిసి ముద్దై ఆమె తెల్లని మొహానికి అంటుకుపోయి ఉన్నాయి.


"వెంటనే బట్టలిప్పేసి ..టవల్ తో గట్టిగా రుద్దుకో.అప్పుడే ఈ గడ్డ కట్టే చలి నుంచి బయటపడతావు.నేనూ అదే పని చేశాను.ఇల్లు కూలి పోతే ఓ పురుగు లా చనిపోవచ్చు కాని ఈ చల్లదనం వల్ల వచ్చే న్యూమోనియా తో పోకూడదు" అరిచి చెప్పాడు ఆ జిప్సీ.


అతను బాగా దగ్గుతున్నాడు.టైట్ గా ఉన్న తన జెర్సీని విప్పడానికి తంటాలు పడుతూ ఇది కొద్దిగా లాగు అన్నాడు.


ఆమె జెర్సీ ని బలం కొద్దీ లాగడం తో అది అతని మొహం మీది నుంచి ఊడి వచ్చేసింది.


"నువు బట్టలు తీసేసి టవల్ తో తుడుచుకో.." ఆజ్ఞాపిస్తున్నట్లుగా  అన్నాడు.తను కూడా షర్ట్ ని,ట్రవుజర్స్ ని విప్పేసాడు.విపరీతమైన చలికి గడగడా వణికిపోతున్నాడు. 


ఒక టవల్ ని తీసుకుని ఒంటిని బాగా రుద్దుకున్నాడు.కొంకర్లుపోయే చలికి అతని పళ్ళు పట పట మని శబ్దం చేస్తున్నాయి.Yvette కి అతను చెప్పింది సబబు గా అనిపించింది.ఆమె తన డ్రస్ తీసేయడానికి ప్రయత్నించింది.బాగా తడిచిన ఆ డ్రెస్ ని అతను కూడా ఓ చెయ్యి వేసి గట్టిగా లాగాడు.ఆ తర్వాత తన ఒంటిని రుద్దుకున్నాడు.తలుపు దగ్గరకి వెళ్ళి నిక్కి చూశాడు.పడమర వైపున కిటికీ ఒకటి ఉంది.సూర్యుడు అస్తమిస్తున్నాడు.ఇటు చూస్తే వరద సముద్రం లా ఉంది.చెట్లు అవీ అడ్డదిడ్డం గా పడిఉన్నాయి.


మేడమెట్లు దెబ్బతిన్నాయి.గోడ కూలిపోయింది.అతను ఆ నీళ్ళని అలాగే చూడసాగాడు.పళ్ళు చలికి పటపట లాడుతున్నాయి.చాలా ప్రయత్నం మీద రూం లోకి వెళ్ళి తలుపు వేశాడు.


Yvette కి ఒళ్ళంతా బలహీనత కమ్మేసింది.ఎలాగో తనని వెచ్చగా ఉంచుకోవడానికి టవల్ తో రుద్దుకోసాగింది.


"ఫర్లేదు...ఇక నీళ్ళు పెరిగే పరిస్థితి లేనట్టుంది" అరిచాడతను.

చలి తో మొద్దు బారినట్లు అయిన ఆమె శరీరం ఇపుడు కాస్త ఫరవలేదనిపించింది. 


"ఒక పని చెయ్యి..అదిగో ఆ మంచం మీద పడుకో నువ్వు...నేను నా ఒంటిని రుద్దుకుంటాను అవతలికి పోయి.." అన్నాడతను.

  అతని పళ్ళు చలికి లోబడి మాట ని స్పష్టం గా రానివ్వడం లేదు.సగం స్పృహ లో ఉన్నట్టుగా ఉన్న ఆమె మంచం మీదకి వెళ్ళింది.అతను తన ఒంటిని చలి నుంచి రక్షించుకోవడానికి తెగ పాట్లు పడుతున్నాడు.ఒకవైపు ఒంటిని  రుద్దుకుంటూనే,ఉత్తరం వైపు ఉన్న కిటికీ లోనుంచి చూశాడు.


నీళ్ళు కొద్దిగా పెరిగినట్లు తోచింది.సూర్యుడు కిందికి వెళ్ళిపోయినా,కొద్దిగా ఎర్రని కాంతి ఉన్నది.తలవెంట్రుకల్ని గట్టిగా తుడుచుకుంటూ ,ఊపిరి పీల్చుకున్నాడు.భయం అనిపించింది.మళ్ళీ ఛాతి మీద రుద్దుకున్నాడు.దగ్గు వస్తోంది.నీళ్ళు పొట్టలోకి పోయినట్లున్నాయి.టవల్ ని చూస్తే అక్కడక్కడా ఎర్రగా ఉంది.బహుశా ఎక్కడో గాయం అయి ఉండవచ్చు.అయితే ఎక్కడో అర్ధం కాలేదు వెంటనే.


నీటి శబ్దం విచిత్రం గా వినిపిస్తోంది.నీటి అలలు గోడలకి తగులుతున్నాయి. చల్లటి గాలి పెరిగింది.సూర్యుడు కనుమరుగయ్యాడు గదా.ఇల్లు మొత్తం పెద్దగా ధం అని శబ్దం చేసినట్లు తోచింది.భయం గొలిపే శబ్దాలు వినిపించసాగాయి.


(సశేషం) 


POST NO:43

-------------------


అతని మనసు నిండా భయం ఆవహించింది.మళ్ళీ తలుపు దగ్గరకి వెళ్ళి చూశాడు.ఒకటే గాలి...వరద నీటి సవ్వడి తో జతకలిసి సింహగర్జన చేస్తోంది. తలుపుసందుల్లోనుంచి బయటకి చూస్తే అంతటా నీళ్ళే నీళ్ళు.చికాకు గా ఉంది వాతావరణం.మలి సందె వేళ...అయినా చంద్రుడి జాడ కనుమరుగవలేదు.మబ్బులు కమ్ముకుంటున్న ఆకాశం లో చీకట్లు.


ఏమి చేయాలో పాలుపోలేదు.పక్క గది లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.ఆమె టవల్ కేసి చూశాడు,ఆరిందా లేదా అని.అక్కడక్కడా కొన్ని రక్తపు మరకలు.తలని మళ్ళీ గట్టిగా తుడుచుకుంటూ కిటికీ దగ్గరకి వెళ్ళాడు.


భయాన్ని అధిగమించే ప్రయత్నం లో అటూ ఇటూ తిరిగాడు. Yvett మంచం ఎక్కి దుప్పట్లు కప్పేసుకుంది.అయినా ఆమె వణుకుతున్న వైనం అర్ధమవుతూనే ఉంది.అది ఆగేట్టు గా లేదు. 


"వరద తగ్గుతున్నట్లు గా ఉన్నది. ఫర్వాలేదు."  అన్నాడతను. 

ఆమె కప్పుకున్న దుప్పట్ల లో నుంచి మొహం బయటకి పెట్టి చూసింది. అలాగే చూస్తూ ఉండిపోయింది.చలికి పళ్ళు పట పట లాడుతున్నాయి.ఆమె వేపు చూశాడతను.కానీ ...ఏమి అవుతుందో అన్నట్లుగా ఉంది పరిస్థితి.


"కాస్త వేడి గా ఉంటే బాగుండు. నన్ను కొంచెం రుద్దు రాదు...ఈ చలి తోనే పోయేటట్టు ఉన్నాను " అన్నదామె. తనలో ఒకటే వణుకు.సగం తెలివి లో ఉన్నదామె.


ఏదో భయం.మరోవేపు సేద తీరిన అనుభూతి.ఇంకోవేపు అలసట గానూ ఉందామెకి.దేనివో టెంటకిల్ లు చుట్టేసినట్లుగా ఉంది.శరీరం బిగిసిపోతున్నట్లుగా,ఎలక్ట్రిక్ షాక్ కొడుతున్నట్లుగా ఉంది.ఇద్దరూ స్టెడీ గా ఉన్నారు.వణుకు,ఆ పైన షాక్ కొడుతున్న ఫీలింగ్ ఆమె లోనూ,అతని లోనూ. 


వెచ్చదనం పెరిగింది.మగత గా ఉన్న వారి మనసులు చైతన్యం కోల్పోయి నిద్ర లోకి జారుకున్నాయి.


నిచెనలు అవీ పట్టుకుని జనాలు రాడం మొదలెట్టారు. చూస్తే తెల్లారిపోయింది.సూర్యుడు కనబడుతున్నాడు. బ్రిడ్జ్ కూలిపోయింది. వరద తగ్గుముఖం పట్టింది. ఇల్లు ఓ వైపు కంటా ఒరిగింది. ఎక్కడ చూసినా బురద,చెత్తా చెదారం ఇంకా కూలిపొయిన నిర్మాణాలు.


అల్లంత దూరం లో తోటమాలి ఆ వాగు దాపునే కనిపించాడు.ఆ తర్వాత కుక్ కూడా.అసక్తి గ అనిపించింది. ఆమె వెనుకరూం లో నుంచి ఇవతలకి వచ్చి ...జిప్సీ ఉన్న వేపు చూసింది.ఇంటికి కొద్ది దూరం లో బయట కనిపించాడు.ఆ చిన్నగేటు కి అవతల అతని బండి కనిపించింది.చీకటి పడుతుండగా తోటమాలి ఆ బండి ని డార్లే దగ్గరున్న రెడ్ లయన్ ప్రాంతానికి చేర్చాడు.  

 (సశేషం)

 

 POST NO:44

----------------------


మొత్తానికి పేపల్ విక్ పరిసరాలకి చెందిన వాళ్ళంతా నిచ్చెనలు పట్టుకుని వచ్చారు.ముఖ్యం గా ఈ ఇంటి వెనక భాగానికి ప్రవాహం దాటుకుని..!బిల్డింగ్ కూలిపోయేలా ఉంది. భయం వేసింది.ముందూ వెనకా పరిస్థితి దయనీయం గా ఉంది.రెక్టార్ యొక్క గది లో ఆ పుస్తకాల గతిని చూసి అయ్యో అనుకున్నారు.అవి ఎక్కడిక్కడ చినిగిపోయి ఉన్నాయి.నానమ్మ గది లో ని బ్రాస్ బెడ్ స్టెడ్ కూడా పాడయిపోయింది.మంచం కాలు ఒకటి విరిగిపోయింది.

ఇంటి మిద్దె పై ఉన్న పనిమనిషి రూం కూడా దెబ్బతిన్నది.ఆమె, పనిమనిషి ఒకటే ఏడుపు.విరిగిపోయిన కిచెన్ వేపు ఉన్న కిటికీ లోనుంచి ఒకతను జాగ్రత్త గా ఎక్కి పైకి వచ్చాడు.ఫ్లోర్ అంతా బురదమయం.అక్కడే నాయనమ్మ మృతదేహం.ఆమె వేసుకునే స్లిప్పర్ ఒకటి బురద లో చిక్కడిపోయి ఉంది.ఆ మన్నూ మశానం చూసి పక్కకి తప్పుకున్నాడు,కొద్దిగా భయం వేసి.Yvette అమ్మాయిగారు ఇంటిలోపల ఉండకపోవచ్చునేమో అన్నాడు తోటమాలి.

ఆ జిప్సీ ఇంకా ఆ అమ్మాయి కొట్టుకుపోతుండడం చూశానని కూడా చెప్పాడు.కాని అక్కడ ఉన్న పోలీస్ మనిషి అవేం పట్టించుకోకుండా తన గాలింపు ని కొనసాగిస్తూనే ఉన్నాడు.ఫ్రేం లీ కుటుంబానికి చెందిన కుర్రాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చారు.నిచ్చెనల్కి తాళ్ళు కట్టి ,ఏదో విజయం పొందినట్టు అరిచారు.కాని లోపల ఏమీ కనిపించలేదు. ఏ ఫలితమూ లేదు.


Bob Framely కిటికీ ని పగలగొట్టి Aunt Cissie రూం లోకి ప్రవేశించాడు.అంతా తెలిసిన వాతావరణమే గాని ఇప్పుడు మాత్రం దయ్యాల దిబ్బ లా అనిపించింది.ఇల్లు  ఏ క్షణం లోనైనా కూలేల ఉంది.


పై అంతస్తు కి నిచ్చెనని చేర్చారు.ముసలి జిప్సీ ఆవిడ రెడ్ లయన్ ప్రాంతానికి తమ బండిని,గుర్రాన్ని తీసుకు రావడానికి వెళుతోందని డార్లే నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు.


అప్పటికే పోలీస్ వ్యక్తి Yvette ఉండే రూం యొక్క కిటికీ ని పగలగొట్టాడు.గాఢ నిద్రలో ఉన్న ఆమె తటాలున లేచి ఒంటికి దుప్పటిని కప్పుకుంది.పోలీస్ వ్యక్తి ఆమె ని చూసు ఆశ్చర్యపోయి కేకవేశాడు.మిస్ Yvette మీరు జీవించే ఉన్నారా..?అంటూ మంచం దగ్గరకి వచ్చాడు.

   అతను అలాగే నిచ్చెనకి ఆనుకున్నాడు.ఏమి చేయాలో తోచక,ఆ అవివాహితుడు కిటికీ ని గట్టిగా పట్టుకున్నాడు.అమె తల వెంట్రుకలు బాగా తడిసి ఒంటికి అంటుకు పోయి ఉన్నాయి.దుప్పట్లని ఆమె చాతి భాగం లో కప్పుకుని ఉంది.నిజానికి ఆమె చాలా నిద్ర లో ఉంది.ఇక్కడే ఉన్నానా అన్నట్లు ఉంది ఆమె వాలకం.


"ఏం భయపడవద్దు మిస్..మీరు క్షేమంగా ఉన్నారిప్పుడు.." అన్నాడా పోలీస్ వ్యక్తి.మగత లో ఉన్న ఆమె అతను చెప్పేది జిప్సీ గురించేమో అనుకుంది.అన్నట్లు అతను ఎక్కడ..?ప్రపంచానికి చివరి రాత్రి లా అనిపించిన ఆ సమయం లో అతను ఎక్కడికి వెళ్ళాడు..?


అతను వెళ్ళిపోయాడు.ఇక్కడున్నది పోలీస్ వ్యక్తి.మగత గా మొహాన్ని చేతి తో రుద్దుకుంది ఆమె.  


"మీరు డ్ర్స్ వేసుకుంటే ,మిమ్మల్ని క్షేమంగా కిందికి దించుతాం...ఇల్లు చూస్తే పడిపోయేలా ఉంది.ఇతర గదుల్లో ఎవరూ లేరు గదా" అన్నాడు పోలీస్ వ్యక్తి.


ఇంటి బయటకి చూస్తే ,దూరం గా రెక్టార్ ,మోటార్ కారు లో నుంచి దిగివస్తున్నట్లు కనిపించింది.


Yvette స్థాణువు లా,నిరాశ గా అయిపోయింది.వెంటనే ఆమె లేచి తన దుస్తులు వేసుకుంది.అద్దం లో చూసుకుంది.ఆమె కురులు చెదిరిపోయి భయంకరం గాఉన్నాయి.తను అదేం పట్టించుకోలేదు.ఏదైతేనేం...ఆ జిప్సీ వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకుంది.


(సశేషం) 


POST NO:45

-------------------

ఆమె దుస్తులు అన్నీ కుప్పగా కిందపడి ఉన్నాయి.అక్కడే ఉన్న ఓ టవల్ మీద రెండు రక్తపు చుక్కలు తప్పా,ఆ జిప్సీ ఆనవాలు మరొకటి లేదు.తల వెంట్రుకలు సవరించుకుంది.అంతలోనే పోలీస్ వ్యక్తి తలుపు తట్టాడు.Yvette చక్కగా డ్రెస్ చేసుకుంది.హమ్మయ్య అనుకున్నాడు తను.


"సాధ్యమైనంత త్వరలో మనం ఈ ఇంటినుంచి బయటపడాలి.ఏ నిమిషం లో అయినా ఇది కూలిపోవచ్చు."గుర్తు చేశాడు పోలీస్.


"నిజం గా అంత ప్రమాదం లో ఉన్నామా..?" అంది ఆమె ప్రశాంతం గా.


కేకలు వినబడడం తో, ఆమె కిటికీ వద్దకి వెళ్ళి కిందికి చూసింది.రెక్టార్ (తండ్రి) రెండు చేతులు పైకి చాపి ,కన్నీళ్ళు కారుస్తూ కనిపించాడు. 

"నేను బాగానే ఉన్నాను డాడీ.."అంటూ అరిచింది Yvette.ఆమెకి కూడా కన్నీళ్ళు తిరిగాయి.అయితే ఇప్పుడు ఆ జిప్సీ గురించి ప్రస్తావించదలుచుకోలేదు.


"ఏడవకండి మిస్. మీ నాయనమ్మ మరణించారు.కనీసం మీరైనా బ్రతికి ఉన్నందుకు ఆయన దేవుడికి థాంక్స్ చెబుతున్నారు.నిజానికి మీరంతా అయిపోయి ఉంటారని భావించాము.."అన్నాడు ఆ పోలీస్.


"ఏమిటి...నాయనమ్మ చనిపోయిందా.." ప్రశ్నించింది Yvette.


"పూర్ లేడి...ఆమె పోయిందనే అంటున్నారు" అన్నాడతను.విచారం గా.


టేబుల్ డ్రాయర్ లో నుంచి రుమాలు తీసి కన్నీళ్ళని తుడుచుకోసాగింది.


"మిస్...చూడండి.ఈ నిచ్చెన తో కిందికి దిగగలరా "అడిగాడు పోలీస్.

     ఆమె కిందికి చూసింది.చాలా లోతు గా అనిపించింది.అమ్మో కష్టమే అనుకుంది.కాని జిప్సీ చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి." ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు భయపడకు" అని.


"మరి మిగతా అన్ని రూం లు చూశారుగా,ఎవరూ లేనట్లే గదా..?" అడిగిందమె పోలీస్ ని.


"ఈ ఇంట్లో ఉన్నది మీరు ఒక్కరే,ముసలావిడని సేవ్ చేయలేకపోయాం...మీ కుక్ సరైన సమయం లో బయట పడింది.Lizzie వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది.మీరు ఇంకా ముసలావిడే ఇక్కడ మిగిలిపోయింది.కిందికి దిగగలరు గదా నిచ్చెన సాయం తో..?" అన్నాడాయన.


"అలాగే.." అందామె అన్యమనస్కంగా. ఆ జిప్సీ ఎలాగూ వెళ్ళిపోయాడు గదా అనుకుంది.


నిచ్చెన సాయం తో కిందికి దిగుతున్న సుకుమారవతి అయిన కుమార్తె ని చేతులు సాచి అందుకున్నాడు రెక్టార్.విరిగిపోయిన కిటికీ లో నుంచి చూస్తూ ఆ పోలీస్ హీరోయిక్ గా ఫీలయ్యాడు.నిచ్చెన పై భాగాన్ని పట్టుకున్నాడు తను.


తండ్రి చేతుల్లో వాలిపోయిన ఆమె ని Bob Framely వాళ్ళు తమ ఇంటికి కారు లో తీసుకువెళ్ళారు.పాపం,Lucille సోదరిని చూసి విలపించింది. పెద్దవాళ్ళు పోయినా పిల్లలు బతకాలి అన్నట్లుగా నాయనమ్మ పోయినా Yvette బతికింది చాలు అని తనని తాను ఓదార్చుకుంది.


(సశేషం)          


POST NO:46

--------------------

పేపల్ హైడేల్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ ఊహించని విధంగా బద్దలయి వరదపొంగి వచ్చింది.దానివల్ల ఈ ఉపద్రవం సంభవించింది.అది ఇక్కడనుంచి రమారమి అయిదుమైళ్ళు ఉంటుంది.చాలా పాత నిర్మాణం అది.ఎవరూ కలలో కూడ ఊహించని విధంగా జరిగిపోయింది.

రెక్టార్ ఇంకా అతని కుమార్తెలు మరో కొత్త ఇల్లు చూసుకునేవరకు Framely వాళ్ళ ఇంట్లోనే తలదాచుకున్నారు.Yvette పడుకుండిపోవడం వల్ల నాయనమ్మ అంత్యక్రియలకి హాజరు కాలేకపోయింది.

ఆ జిప్సీ తనని ఎలా రక్షించినదీ అంతా జ్ఞాపకం వచ్చింది. పాష్ లోని మెట్ల వరకు పాకుకుంటూ రావడం,ఆపైన పై అంతస్తు కి వెళ్ళడం అదంతానూ.మొత్తనికి అతనూ ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నాడు.రెడ్ లయన్ ప్రాంతం లో ఉన గుర్రాన్ని తీసుకుపోవడానికి వచ్చిన ముసలి జిప్సీ ద్వారా అది తెలిసింది.ఇప్పటికీ అంతా తనకి మసక మసక గా ఉన్నది మనసులో.అది అలా జరిగిపోయింది,అంతే.

Bob Framely ఆ జిప్సీ ని ఎంతో మెచ్చుకున్నాడు.ఆ జిప్సీ కి మెడల్ ఇవ్వాలి,దానికి తను అర్హుడు అన్నాడు.కుటుంబం లో మిగతా వారంతా అవునా అన్నట్లు ఆశ్చర్యపోయారు.


"అతనికి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి" అంది Lucille.


అవును...అతడిని నేను ప్రేమిస్తునాను... అని పదే పదే మనసులో అనుకుంది Yvette.తను పడుకుని ఉందిప్పుడు.బాధ గా ఉంది.అతను కనిపించకుండా వెళ్ళిపోవడం కూడా తనకి ఒకందుకు తృప్తి గానే అనిపించింది.దాని అంతరార్ధం ఆ చిన్నారి మనసు కి తెలుసు.    


నాయనమ్మ అంత్యక్రియలు అవీ ముగిసిన తర్వాత ఆమె కి ఓ ఉత్తరం అందింది.తేదీ ఉంది గాని ఊరి పేరు లేదు.విషం ఇలా ఉంది.


"డియర్ మిస్, మీరు క్షేమంగా ఉన్నట్లు పేపర్ లో చదివి తెలుసుకున్నాను.మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని కలుస్తాను.టిడ్ వెల్ లో పశువుల సంత జరుగుతుంది గదా,బహుశా ఆ సమయం లో మేము అటు వైపు వస్తాము.అప్పుడు మీకు గుడ్ బై చెబుతాను.నేను వెళ్ళేటప్పుడు మీకు చెబుదామనుకున్నా గానీ వరద నీళ్ళు నాకు సమయం ఇవ్వలేదు.ఎప్పుడూ నేను ఆశాజీవినే.వినయపూర్వకంగా సదా మీ సేవకుడు ...Joe Boswell.


అప్పుడు గానీ ఆమెకి గుర్తు రాలేదు అతనికీ ఓ పేరు ఉందని...!!!


(సమాప్తం) 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వీథికుక్క-1

 ఒకరోజున, అది ఏ రోజో సరిగా గుర్తులేదు గానీ...రమారమి ఆరు నెలల క్రితం మా బయట గోడ ని ఆనుకుని ఓ బక్క కుక్క పడుకుని ఉంది. వాన చినుకులు పడుతున్నాయ...